ఆదివాసీ హక్కులకై తిరగబడ్డ నాయక ‘పోడు బిడ్డ’
— గుమ్మడి లక్ష్మీనారాయణ ఆదివాసీ రచయితల వేదిక

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ,ఆగస్టు 23 (లోకంతీరు) : ఆదివాసీల హక్కుల కోసం పోరాడి అమరులైన వీరులలో చేనేని భీమయ్య అనామక నాయకపోడ్ వీరుడు. రాజ్ గోండ్ నాయకపోడ్ తెగలో పుట్టిన చేనేని భీమయ్య ఆదివాసీల హక్కుల కోసం 1988 లో ఉద్యమాన్ని ప్రారంభించాడు. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని మద్దిగుడ గ్రామంలో భీమయ్య ఒక నిరుపేద కుటుంబంలో పుట్టాడు. కనీస నివాస సౌకర్యం కూడా లేని పేదకుటుంబం భీమయ్యది. ‘ప్రజల ముంగిట ప్రజాపాలన’ లో భాగంగా 1986, మే 20న ఆదిలాబాద్ జిల్లా గిన్నెదరికి వచ్చిన ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఆదివాసులు నివసించే గడ్డి గుడిసెలను చూసి చలించిపోయారు. ఆదివానులకు ఇల్లు మంజూరు చేయగా ఇళ్ల నిర్మాణం కోసం కట్టెలు అవసరం ఉండేవి. అడవిలోకి వెళ్ళి ఆదివాసులు కట్టెలు తెచ్చుకొంటుండగా మార్గ మధ్యలోనే అటవీ అధికారులు పట్టుకొని దట్టమైన అడవిలో బంధించి వారిపై దాడులు చేస్తూ, చిత్ర హింసలు పెట్టేవారు. నిజాం ప్రభుత్వం ఎలా చిత్రహింసలు పెట్టేదో, అటవీ అధికారులు కూడా నయా రాజాకార్లలాగా జులుం చేశారు. దీనిని జీర్ణించుకున్న చెనేని భీమయ్య అటవీ అధికారులపై ఆనాడు తిరగబడ్డాడు. కనీసం ఆదివాసులు బెంగళూరు పెంకతోనైనా ఇల్లు నిర్మించుకోకూడదా? ఆదివాసులపై ఎందుకంత కక్ష?.. వీటికి సమాధానం చెప్పాలని అంతా ఏకమై అటవీ అధికారుల కార్యాలయాలను ముట్టడించారు. కుమరంభీమ్ స్ఫూర్తితో అడవిపై ఆదివాసులకే సర్వ హక్కులుంటాయని అటవీ అధికారుల నిర్బంధాలను ప్రశ్నించేందుకు భీమయ్య ఆధ్వర్యంలో ఆదివాసులు నడుం బిగించారు.
దీనిని జీర్ణించుకోలేక…!
అధికారులు ఆదివాసి గుడేలైన సావిగూడెం, గట్రలేపల్లే,
తుడేంగుడేం, పెద్దగుడ, దేవపూర్, మదిగుడేం లపై ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యంగా పోలీసు బలగాలతో దాడులు చేసి ఇళ్ల నిర్మాణంకోసం తెచ్చుకున్న కర్రలను లారీల్లో నింపుకొని తీసుకపోయేందుకు ప్రయత్నించారు. అటవీఅధికారుల తీరుపై ఆదివాసి మహిళలు పెద్ద ఎత్తున బయటకు వచ్చి ఆ అధికారులపై ఎదురుదాడి చేశారు. దీనిని జీర్ణించుకోలేని అటవీ అధికారులు పోలీసు బలగాలను తీసుకువచ్చి మహిళలని కూడా చూడకుండా వారి ఇళ్లపై దాడులు నిర్వహించారు. దొరికిన మహిళలను చిత్రహింసలు పెడుతూ దాడి చేశారు. అడవి సంపదను అక్రమంగా అమ్ముకునేది ఫారెస్ట్ అధికారులు. కాని ఆదివాసులు ఆడవి సంపదను కాపాడుకునేవారు. కావాలని ఫారెస్ట్ అధికారులకు ఆదివాసులు అడ్డుపడుతున్నారని ఈ నేపథ్యంతోనే ఆదివాసి గూడెలపై దాడులు చేయడం జరిగింది. ఆదివాసి తెగలు అన్ని ఏకమై భీమయ్య ఆధ్వర్యంలో ఫారెస్ట్ అధికారులు తీసుకు వెళ్తున్న కర్ర లారీలను పోకుండా ఆదివాసులు ఎడ్లబండ్లను అడ్డం పెట్టి ఫారెస్ట్ అధికారులపై దండయాత్ర చేయగా పోలీసులు అదివాసులపై కాల్పులు జరిపి అనేక మంది ఆదివాసులను గాయపరిచారు. అప్పటికే పోలీసు బలగం మొత్తం అడవిలో ఖాకీవనం కావడంతో మరింత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. హెూరా హెూరీగా జరిగిన పోరులో చేనేని భీమయ్య బుల్లెట్ గాయాలపాలై పేగులు బయటకు వచ్చినా గట్టిగా టవాలా చుట్టుకొని పోలీసులకు ఎదురొడ్డి ప్రాణాలు విడిచాడు. చాలా మంది ఆదివానులకు గాయాలయ్యాయి. బద్ది పాపయ్య,మడవి చిన్నబ్బాయి, స్మేడాకి భీం, అడ భీంరామ్ లను పోలీసులు బంధించి తీసుకువెళ్లి చిత్రహింసలు పెడుతూ ఇబ్బందులకు గురి చేశారు.
1988లో ఆనాటి ముఖ్యమంత్రి…!
ఎన్టీ రామారావు ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లు నిర్మించుకోవడానికి కావలసిన కలప కోసం ఉద్యమం చేయాల్సి వచ్చింది. ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఎదురొడ్డి పోరాటం చేశారు. ఈ పోరాటంలో మృతి చెందిన ఆదివాసీ మహిళల వార్త తెలుసుకున్న ఆనాటి జిల్లా కలెక్టర్ పీవీకే శర్మ, ఐటిడిఎ అధికారి సుబ్రమణ్యంలు మదిగుడ సంఘటన స్థలానికి చేరుకొని, అక్కడి పరిస్థితులు తెలుసుకొని జరిగిన పొరపాట్లను సరిదిద్దే ప్రయత్నం చేయగా ఆవేశంతో ఊగిపోయిన ఆదివాసులు అధికార్లపై తిరగబడ్డారు. ఆదివాసుల ప్రాణాలు పోయాక మీరు వస్తారా..! ఒక ముఖ్యమంత్రి చలించిపోయి ఇల్లు మంజూరు చేస్తే నిర్మాణం కోసం తెచ్చుకున్న కలపను కూడా అటవీ అధికారులు దౌర్జన్యంగా పోలీసులతో వచ్చి ఆదివాసులపై దాడి చేస్తూ, ప్రాణాలు తీస్తుంటే మీరు అప్పుడేం చేశారు?…అని ప్రశ్నించారు. పోయిన ప్రాణాలు ఇవ్వలేము కానీ ఉన్నవారికి ఉద్యోగం ఇచ్చి, ఆదుకుంటామని కలెక్టర్ హామీ ఇవ్వడంతో నిస్సహాయులుగా మౌనం వహించారు. బాధిత కుటుంబంలో చదువుకున్న యువతకు అటవీ శాఖలో ఉద్యోగాలు కల్పించారు. చదువురాని వారికి సబ్సిడీ కింద సంక్షేమ పథకాలు మంజూరు చేసి, వ్యవసాయం చేసుకునేందుకు తగిన నిధులు ఇచ్చి వారి అభివృద్ధికి కృషి చేశారు. అటవీ హక్కుల పోరులో గాయపడిన భీమయ్య 1988, ఏప్రిల్ 24న మరణించారు.
చేనేని భీమయ్య చేసిన పోరాటానికి ఫలితంగా..!
గూడేలలో ఆదివాసి యువకులు ఉద్యోగం చేసే దిశగా ఎదిగారు. 2022 లో మందమర్రిలో భీమయ్య విగ్రహమును స్వచ్చందంగా ఆదివాసీలే ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి ఏడాది ఏప్రిల్ 24న భీమయ్య వర్ధంతి నిర్వహిస్తూ అయనకు ఘనంగా నివాళులు అర్పిస్తారు. పొడుబిడ్డ వీరమరణం పొంది 36 సంవత్సరాలు గడిచినా నాయకపోడు గిరిజనుల చరిత్ర విస్మయానికి గురైంది. ప్రభుత్వం భీమయ్య పోరాట స్ఫూర్తిని గుర్తించి వారికి తగిన సంక్షేమ ఫలాలు అందించాలి. అటవీ హక్కుల కోసం పోరాడిన అనామక ఆదివాసీ ముద్దుబిడ్డ భీమయ్యకు అక్షర నివాళీ.