Take a fresh look at your lifestyle.

పర్యావరణ హిత గని నిర్వహణలో సింగరేణికి ప్రత్యేక గుర్తింపు.

0 38

పర్యావరణ హిత గని నిర్వహణలో సింగరేణికి ప్రత్యేక గుర్తింపు.                                      పర్యావరణ ప్రమాణాల అమలుకు కేంద్రం ప్రశంసలు… వడ్డీతో సహా రూ.40 కోట్లు తిరిగి చెల్లింపు.                                                                                                                                        డోర్లీ-2 గని మూసివేతలో ఆదర్శంగా నిలిచిన సింగరేణి.. డోర్లీ-1కు మరో రూ.60 కోట్లకు పైగా వచ్చే అవకాశం

(ప్రజాలక్ష్యం ప్రత్యేక ప్రతినిధి)

హైదరాబాద్, జూన్ 10:బొగ్గు ఉత్పత్తితో పాటు పర్యావరణ పరిరక్షణలోనూ అత్యున్నత ప్రమాణాలు పాటిస్తున్న సంస్థగా సింగరేణి మరోసారి గుర్తింపు పొందింది. బెల్లంపల్లి ఏరియాలోని డోర్లీ-2 ఓపెన్‌కాస్ట్ గనిని కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నిర్దేశించిన నిబంధనల ప్రకారం విజయవంతంగా మూసివేసినందుకు గుర్తింపుగా, గని ప్రారంభ సమయంలో ఎస్క్రో డిపాజిట్‌గా చెల్లించిన సొమ్మును వడ్డీతో సహా సుమారు రూ.40 కోట్ల మేరకు కేంద్రానికి చెందిన కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ (సీసీఓ) సింగరేణికి తిరిగి చెల్లించింది. గనుల నిర్వహణలోనే కాకుండా, గని మూసివేత అనంతరం పర్యావరణ పునరుద్ధరణ, భూసంరక్షణ, కాలుష్య నియంత్రణ, అటవీకరణ కార్యక్రమాలను సింగరేణి నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా అమలు చేయడంతో ఈ గుర్తింపు లభించింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మార్గదర్శకత్వంలో సంస్థ చేపడుతున్న పర్యావరణహిత చర్యలకు ఇది నిదర్శనంగా నిలిచిందని అధికారులు పేర్కొన్నారు.

ఎస్క్రో డిపాజిట్ అంటే ఏమిటి?

కొత్త గనులకు అనుమతులు మంజూరు చేసే సమయంలో, గని జీవితకాలంలో చేపట్టాల్సిన పర్యావరణ పరిరక్షణ, భూసంరక్షణ, గని మూసివేత చర్యల అంచనా వ్యయాన్ని ముందస్తుగా డిపాజిట్ రూపంలో కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ వద్ద జమ చేయాల్సి ఉంటుంది. గని మూసివేత అనంతరం అన్ని నిబంధనలను సక్రమంగా అమలు చేసినట్లు నిర్ధారణ అయిన తర్వాత ఆ మొత్తాన్ని వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తారు. ఈ నేపథ్యంలో సింగరేణి 2013-14లో డోర్లీ-2 గనికి సంబంధించిన పర్యావరణ చర్యల కోసం రూ.26.79 కోట్లను ఎస్క్రో డిపాజిట్‌గా జమ చేసింది. ఏడేళ్ల పాటు బొగ్గు ఉత్పత్తి చేసిన ఈ గనిని 2023-24లో మూసివేశారు. అనంతరం థర్డ్ పార్టీ సంస్థ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, శిబ్‌పూర్ నిర్వహించిన ఆడిట్‌లో సింగరేణి అన్ని నిబంధనలను పూర్తిస్థాయిలో అమలు చేసినట్లు తేలింది. దీంతో సీసీఓ డిప్యూటీ అసిస్టెంట్ కోల్ కంట్రోలర్ ఆకాష్ శివ హరే జారీ చేసిన లేఖలో, డిపాజిట్ మొత్తంలో 90 శాతం అయిన రూ.36.63 కోట్లను విడుదల చేస్తున్నట్లు, మిగిలిన మొత్తాన్ని తుది పరిశీలన అనంతరం చెల్లిస్తామని పేర్కొన్నారు. మొత్తంగా వడ్డీతో కలిపి సుమారు రూ.40 కోట్లు సింగరేణికి అందనున్నాయి.

పర్యావరణ పరిరక్షణలో ఆదర్శ చర్యలు:

డోర్లీ-2 గని ప్రాంతంలో గతంలో ఉన్న అడవులకు సమానంగా 162.5 హెక్టార్ల విస్తీర్ణంలో అటవీకరణ చేపట్టింది. గని తవ్వకాల ముందు తొలగించిన టాప్‌సాయిల్‌ను భద్రపరిచి తిరిగి డంపులపై పరిచి మొక్కలు నాటింది. ధూళి కాలుష్య నియంత్రణ కోసం డస్ట్ కలెక్టర్లు, వెట్ డ్రిల్లింగ్, వాటర్ స్ప్రింక్లర్లు, మిస్ట్ స్ప్రేయర్లను వినియోగించింది. జల కాలుష్య నియంత్రణ కోసం గార్లాండ్ డ్రైనేజీలు, చెక్‌డ్యామ్‌లు, సెటిలింగ్ ట్యాంకులు ఏర్పాటు చేసి గని నీటిని శుద్ధి చేసిన తర్వాతే విడుదల చేసింది. గని మూసివేత అనంతరం భద్రతా చర్యలు, కంచెల ఏర్పాటు, పాత నిర్మాణాల తొలగింపు వంటి పనులను కూడా పూర్తిచేసింది.

త్వరలో మరో రూ.60 కోట్లకు పైగా:

ఈ సందర్భంగా డైరెక్టర్ (ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్) కొప్పుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, సింగరేణి చేపడుతున్న పర్యావరణహిత గని మూసివేత చర్యలకు గుర్తింపుగానే ఈ డిపాజిట్ తిరిగి లభించిందన్నారు. గతంలో శ్రీరాంపూర్ ఆర్కే-8 ఇంక్లైన్ భూగర్భ గనికి సంబంధించి కూడా రూ.4 కోట్ల డిపాజిట్ తిరిగి అందిందని గుర్తు చేశారు. డోర్లీ-1 గనికి సంబంధించిన తనిఖీలు కూడా తుది దశలో ఉన్నాయని, వాటి పూర్తితో మరో రూ.60 కోట్లకు పైగా డిపాజిట్ సింగరేణికి తిరిగి వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.