Take a fresh look at your lifestyle.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది – ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్.

0 25

                                                                                                                                            కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది.                                                                                                                    ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్.
335 మందికి సింగరేణి కారుణ్య నియామక పత్రాల పంపిణీ.                                                                                                          ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు వినతిపత్రం సమర్పణ.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
మంచిర్యాల, జూన్ 13: సింగరేణి కార్మికుల వారసత్వ ఉద్యోగాల సమస్య పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుందని ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ అన్నారు. గత 15 ఏళ్లుగా డిపెండెంట్ ఉద్యోగాల కోసం కార్మిక కుటుంబాలు చేసిన పోరాటాలకు ఫలితంగా నేడు వందలాది కుటుంబాలకు న్యాయం జరిగిందని ఆయన పేర్కొన్నారు. శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పద్మవినాయక ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణరావు, మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు తదితరులతో కలిసి 335 మంది అభ్యర్థులకు సింగరేణి కారుణ్య నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో జనక్ ప్రసాద్ మాట్లాడుతూ, డిపెండెంట్ ఉద్యోగాల కోసం సంవత్సరాల తరబడి కార్మిక కుటుంబాలు ఎదురుచూశాయని, పలువురు ఉద్యోగం కోసం ఎదురుచూస్తూనే మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్య పరిష్కారం కోసం గుర్తింపు సంఘం నాయకుడు సీతారామయ్యతో పాటు కార్మిక సంఘాల నాయకులు నిరంతరం పోరాడారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణి కార్మికుల సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. కార్మికులందరికీ న్యాయం చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం చర్చలు జరిపి, వారసత్వ ఉద్యోగాల సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టిందన్నారు. ఇంకా మిగిలి ఉన్న వారసత్వ ఉద్యోగాలు, మెడికల్ బోర్డు సమస్యలు, ఇతర కార్మిక సంక్షేమ అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం భవిష్యత్తులోనూ అండగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. సింగరేణి కార్మిక కుటుంబాలకు ఉపాధి భరోసా కల్పించడమే కాకుండా వారి ఆర్థిక స్థిరత్వానికి ఈ నియామకాలు దోహదపడతాయని జనక్ ప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమాన్ని సింగరేణి చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. అనంతరం సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం, పెండింగ్‌లో ఉన్న ఉద్యోగాల భర్తీ, మెడికల్ బోర్డు అంశాల పరిష్కారం తదితర డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు జనక్ ప్రసాద్ సమర్పించారు. కార్యక్రమంలో సింగరేణి యాజమాన్య అధికారులు, కార్మిక సంఘాల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో కార్మిక కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.