ముఖ్యమంత్రి తెలంగాణ పరువు తీస్తున్నాడు
తల్లి కాంగ్రెస్ తోనే పోరాటం చేసి తెలంగాణను సాధించుకున్నాం! ఇప్పుడున్న ఈ పిల్ల కాంగ్రెస్ ఎంత?
కార్మికులను కలిసేందుకు వస్తే గేట్లు బంద్ పెట్టి అడ్డుకుంటారా!
తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆగ్రహం.
ఖనిలో కవిత ‘బాయిబాట’.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని టౌన్, జూన్ 17:
కార్మికులను కలిసేందుకు వస్తే గేట్లు బంద్ పెట్టి అడ్డుకుంటారా! ప్రతిపక్ష పార్టీలను సింగరేణి కార్మికులు కలవద్దా? కార్మికులకు ఏ పార్టీ వారితోనైనా మాట్లాడే హక్కు ఉందనీ జీడీకే 11 ఇంక్లైన్ లో జరిగిన ‘బాయిబాట’ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత గోదావరిఖని పర్యటనలో భాగంగా ముందుగా సింగరేణి ఆర్జీ-1 పరిధి జీడీకే 11 ఇంక్లైన్ గనిపై ‘సింగరేణి బాయిబాట’ కార్యక్రమం చేపట్టారు. టీఆర్ఎస్, హెచ్ఎంఎస్ నాయకులతో కలిసి గనికి వెళ్లిన కవితను గని అధికారుల సూచనల మేరకు పోలీసులు, సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది గేట్ వేసి అడ్డుకునే ప్రయత్నం చేశారు. కాగా నాయకులు గేట్ ను నెట్టుకుని లోపలకు వెళ్ళారు. ఈ మేరకు కవిత కార్మికులను కలుస్తూ వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. మహిళా కార్మికులతో కాసేపు ముచ్చటించి వారిని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ అసలు సింగరేణి క్యాంపస్ లోకి పోలీసులే రావద్దనీ, కానీ వాళ్లను తీసుకొచ్చారంటే వీళ్లు ఎంత తప్పు చేసి ఉంటారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, రాహుల్ గాంధీ కూడా ఎన్నికలకు ముందు సింగరేణి కార్మికులతో మీటింగ్ లు పెట్టలేదా! అని ప్రశ్నించారు. కార్మికులు మీ మాటలు నమ్మి కోల్ బెల్ట్ ప్రాంతంలో కాంగ్రెస్ ను గెలిపించారని, కానీ మీరు గెలిచాక గ్లౌజ్ లు, షూస్, మెషీన్లలో ఏదీ నాణ్యత లేకుండా పోయిందన్నారు. గనుల్లోకి వెళ్లే కార్మికులకు కనీసం ఆక్సిజన్ కూడా ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చారని ఆరోపించారు. ఏమైనా అడిగితే గత ప్రభుత్వం మీద నెట్టేసి డబ్బులు లేవంటూ చేతులెత్తుతున్నారని ఎద్దేవా చేశారు. సింగరేణి కార్మికులకు మాట ఇచ్చే ముందు ఇవ్వన్నీ మీకు తెలియదా! అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులకు కనీసం నీళ్లు, గాలి ఇచ్చే సోయి కూడా లేదనీ, ప్రాథమిక సౌకర్యాలు కూడా కల్పించడం లేదన్నారు. సింగరేణిలో రాజకీయ జోక్యం ఎక్కువ కావడంతోనే చిన్న చిన్న సౌకర్యాలు కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. వీటన్నింటినీ ప్రశ్నించాల్సిన అవసరం ఉందనీ, తనది ప్రశ్నించే తత్వమని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో అగ్గిరాజేసి రాష్ట్రం సాధించుకున్నామని, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక కూడా కేసీఆర్ తో మాట్లాడి మీ కోసం పనిచేశానని వెల్లడించారు. ముఖ్యంగా డిపెండెంట్ ఉద్యోగాల కోసం తాను చేసిన పోరాటంతో 19 వేల ఉద్యోగాలు నడుచుకుంటూ వచ్చాయని తెలిపారు. మహిళలకు సింగరేణిలో ఉద్యోగాలు వచ్చేలా చేశామని, తాను ఎప్పటికీ సింగరేణి బిడ్డనేనని, ఎక్కడున్నా కార్మికుల కోసమే కొట్లాడుతానని వెల్లడించారు. తల్లి కాంగ్రెస్ తోనే పోరాటం చేసి తెలంగాణను సాధించుకున్నాం! ఇప్పుడున్న ఈ పిల్ల కాంగ్రెస్ ఎంత? అంటూ పంచ్ డైలాగ్ విసిరారు. ఈ ముఖ్యమంత్రి తెలంగాణ ఇజ్జత్ తీయటమే పనిగా పెట్టుకున్నాడనీ, ఢిల్లీకి అప్పు కోసం పోతే చెప్పులు ఎత్తుకుపోయే వాళ్లను చూసినట్లు చూస్తున్నారని అంటాడని, మహారాష్ట్ర ముఖ్యమంత్రి తన ఫోన్ ఎత్తటం లేదని చెబుతాడనీ, మొన్నటికి మొన్న నేను హిట్లర్ లాంటి వాడినంటూ గొప్పగా చెప్పుకున్నాడనీ, అసలు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇంత బేలగా మాట్లాడుతాడా! అని అన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ సింగరేణికి కొత్త బ్లాక్ లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మూసివేతకు గురైన అండర్ గ్రౌండ్ గనులను ప్రభుత్వం తెరవాలని, బొగ్గు బ్లాక్ లలో షాప్ట్ వేస్తే అవి ఇంకొక 50 ఏళ్ల వరకు నడుస్తాయన్నారు. అండర్ గ్రౌండ్ మైనింగ్ కారణంగా పర్యావరణ పరిరక్షణతో పాటు వేలాది మందికి ఉపాధి దొరుకుతుందని పేర్కొన్నారు. సింగరేణి కార్మికుల కష్టాలపై మాట్లాడాల్సిన గుర్తింపు సంఘం ఏఐటీయూసీ మౌనంగా ఉందనీ, సింగరేణి డబ్బులతో నిర్మించిన మెడికల్ కాలేజ్ లో 25 శాతం సీట్లు కార్మికుల పిల్లలకు ఇవ్వాలి కానీ, ఐదు శాతం కూడా ఇవ్వటం లేదని ఆరోపించారు. దీనిపై ఏఐటీయూసీ నేతల స్పందన లేదన్నారు. అనంతరం గంగానగర్ సమీపంలోని రాపిడ్ ఫిల్టర్ బెడ్ ను సందర్శించారు. సింగరేణి కాలనీల్లో ప్రజలకు మంచి నీళ్లు ఇచ్చే బాధ్యత సింగరేణి యాజమాన్యనిదేనని, కానీ మొత్తం డ్రైనేజీ నీళ్లు మంచి నీళ్లలో కలుస్తున్నా కనీసం ఫిల్టర్ చేయటం లేదన్నారు. దీంతో ప్రజలు నీళ్లు కొనుక్కోని తాగాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఇక్కడి ఫిల్టర్ బెడ్ కోసం 20 కోట్లు ఖర్చు చేశారనీ, కానీ పనులు పూర్తి చేయకపోవటంతో ఇప్పటికీ ప్రజలకు నీళ్లు రావటం లేదన్నారు. వెంటనే రాపిడ్ ఫిల్టర్ సిస్టమ్ పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఫిల్టర్ బెడ్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే సింగరేణి కాలనీలతో పాటు 30 వేల మంది ప్రజలకు నీళ్లు ఇవ్వొచ్చనీ అన్నారు. తదనంతరం కవిత గోదావరిఖనిలోని సింగరేణి ఏరియా హాస్పిటల్ ను సందర్శించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్య సిబ్బందితో మాట్లాడి వారికి ఎదురవుతున్న ఇబ్బందులపై ఆరా తీశారు. మనకు ఉన్న సింగరేణి హాస్పిటల్ లో నిజానికి గాంధీ, ఉస్మానియాలో ఉన్నన్ని సౌకర్యాలు ఉండాలనీ, ఇక్కడ హాస్పిటల్స్ లో చాలా కష్టాలున్నాయన్నారు. కాంట్రాక్ట్ స్టాఫ్ ను తీసుకొని వాళ్లను ఇబ్బంది పెడుతున్నారని, అసలు తెలంగాణలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ విధానం ఉండొద్దన్నది తమ విధానమన్నారు. హాస్పిటల్ బయట క్యాంటీన్ లో చాయ్ తాగి సింగరేణి ఏరియా హాస్పిటల్ నుండి గోదావరిఖని చౌరస్తాలోని హెచ్ఎంఎస్ కార్యాలయం వరకు ఆటోలో ప్రయాణిస్తూ ఆటో కార్మికుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వేర్వేరుగా జరిగిన కార్యక్రమాలలో ఆమె వెంట టీఆర్ఎస్, హెచ్ఎంఎస్ నాయకులున్నారు.