

సమస్యల పరిష్కారం కోరుతూ రోడెక్కిన సింగరేణి అధికారులు.
ఆర్జీవన్ జీఎం కార్యాలయం వరకు భారీ నిరసన ర్యాలీ.
స్పందించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరిక.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, జూన్ 17: తమ దీర్ఘకాలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సింగరేణి అధికారులు బుధవారం సాయంత్రం గోదావరిఖనిలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఆర్సీఓఏ క్లబ్ నుంచి ఆర్జీవన్ జనరల్ మేనేజర్ కార్యాలయం వరకు చేపట్టిన ఈ ర్యాలీలో వివిధ ఏరియాలకు చెందిన అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఎంఓఏఐ) అధ్యక్షుడు తాళ్లపల్లి లక్ష్మీపతి గౌడ్, ప్రధాన కార్యదర్శి పెద్ది నర్సింహులు మాట్లాడుతూ, గత రెండున్నర సంవత్సరాలుగా అధికారుల సమస్యల పరిష్కారం కోసం ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఎమ్మెల్యేలను పలుమార్లు కలిసి విజ్ఞప్తులు చేసినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన అధికారుల సమస్యల పట్ల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. సమస్యల పరిష్కారం కోసం రెండు సంవత్సరాలుగా నిరీక్షించినప్పటికీ స్పందన లేకపోవడంతోనే రోడ్లపైకి రావాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. సాధారణంగా అధికారులు ఆందోళనలకు దూరంగా ఉంటారని, అయితే పరిస్థితులు వారిని నిరసన బాట పట్టేలా చేశాయని పేర్కొన్నారు. సంస్థలో దాదాపు 90 శాతం మంది అధికారులు ఈ ఆందోళనకు మద్దతు తెలుపుతున్నారని, ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని హెచ్చరించారు. యాజమాన్యం స్పందించి సమస్యలు పరిష్కరించకపోతే దశలవారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.
పీఆర్పీ అమలులో జాప్యంపై ఆగ్రహం:
రెండు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న పీఆర్పీ (పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే) అమలు విషయంలో ప్రభుత్వం, యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తున్నాయని నాయకులు విమర్శించారు. ఉద్యోగులు జీతభత్యాల కోసం పనిచేస్తారని, అందులో భాగమైన పీఆర్పీని ఇంతకాలం పెండింగ్లో ఉంచడం న్యాయసమ్మతం కాదన్నారు. అలాగే కోల్ ఇండియాలో 2017 వేతన సవరణలో జరిగిన అసమానతలను ఇటీవల సరిదిద్దినా, అదే విధానాన్ని సింగరేణిలో అమలు చేస్తామని గతంలో ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేర్చలేదని ఆరోపించారు. 1974లో సింగరేణి బోర్డు ఆమోదించిన విధంగా కోల్ ఇండియాలో అమలయ్యే వేతన, సేవా ప్రయోజనాలను సింగరేణిలో కూడా అమలు చేయాల్సి ఉన్నప్పటికీ ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం వల్ల అధికారులు నష్టపోతున్నారని పేర్కొన్నారు.
సీఎంఓలో ఫైల్ పెండింగ్:
పీఆర్పీకి సంబంధించిన ఫైలు దాదాపు ఆరు నెలలుగా ముఖ్యమంత్రి కార్యాలయంలో పెండింగ్లో ఉందని, దానిపై ఎలాంటి పురోగతి కనిపించడం లేదని నాయకులు తెలిపారు. ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం వెంటనే జోక్యం చేసుకొని అధికారుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.
దశలవారీ ఆందోళనలకు సిద్ధం:
ప్రస్తుతం గోదావరిఖనిలో ప్రారంభమైన నిరసన కార్యక్రమాలను ఈ నెల 19న శ్రీరాంపూర్ ప్రాంతంలో, అనంతరం కొత్తగూడెం ప్రాంతంలో కూడా నిర్వహించనున్నట్లు నాయకులు ప్రకటించారు. అవసరమైతే రిలే నిరాహార దీక్షలు, వర్క్ టు రూల్, సమ్మె వంటి కార్యక్రమాలకు కూడా సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ నిరసన ర్యాలీలో ఆర్జీవన్, ఆర్జీ-2, ఆర్జీ-3, శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి తదితర సింగరేణి ఏరియాలకు చెందిన అధికారులు పెద్ద ఎత్తున పాల్గొని సంఘీభావం తెలిపారు.