Take a fresh look at your lifestyle.

ప్రియుడి కోసం భర్త హత్య.. కేసును ఛేదించిన ములుగు పోలీసులు.

0 20

ప్రియుడి కోసం భర్త హత్య.. కేసును ఛేదించిన ములుగు పోలీసులు.
భార్యతో పాటు ఇద్దరు నిందితుల అరెస్ట్.. సాంకేతిక ఆధారాలతో కేసు దర్యాప్తు పూర్తి.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
ములుగు, జూలై 4:అక్రమ సంబంధానికి అడ్డుగా మారాడనే కారణంతో భర్తను హత్య చేయించిన ఘటనను ములుగు జిల్లా పోలీసులు ఛేదించారు. భార్య తన ప్రియుడు, మరో వ్యక్తితో కలిసి పథకం ప్రకారం హత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.
శనివారం రాత్రి జిల్లా పోలీసు కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రవీందర్ కేసు వివరాలను వెల్లడించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేటకు చెందిన సిరిపంగ నర్సింగరావును ఆయన భార్య శోభారాణి, ఆమె ప్రియుడు ఆల పెద్ద వెంకటేశ్వర్లు, అతని బావమరిది దుర్గారెడ్డి కలిసి హత్య చేసినట్లు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం, నర్సింగరావును పెద్దపెండ్యాల నుంచి కారులో ములుగు తీసుకొచ్చిన నిందితులు జాకారం గ్రామ సమీపానికి చేరుకున్న తర్వాత, వెనుక సీటులో ఉన్న దుర్గారెడ్డి నైలాన్ తాడుతో మెడ బిగించి హత్య చేశాడు. అనంతరం జాకారం శివారులోని వాటర్ ట్యాంక్ సమీపంలో మృతదేహాన్ని ఉరివేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఇంకా ప్రాణాలతో ఉన్నాడేమోనన్న అనుమానంతో తలపై రాయితో బలంగా కొట్టి హత్యను నిర్ధారించినట్లు డీఎస్పీ తెలిపారు. సీసీటీవీ దృశ్యాలు, సెల్‌ఫోన్ టవర్ డేటా, ఇతర సాంకేతిక ఆధారాల ఆధారంగా ఐదు ప్రత్యేక పోలీసు బృందాలు దర్యాప్తు నిర్వహించి కేసును ఛేదించాయని చెప్పారు. నిందితులను అరెస్టు చేసి, హత్యకు ఉపయోగించిన తాడు, రాయి తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ కేసును సమర్థవంతంగా ఛేదించిన దర్యాప్తు బృందాలను జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కె.కేకాన్ అభినందించినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో ములుగు సీఐ సురేష్, సీసీఎస్ సీఐ కుమార్, ఎస్సై చంద్రశేఖర్, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.