Take a fresh look at your lifestyle.

పీకే ఓసీ–2 డిప్ సైడ్ ఎక్స్టెన్షన్ ఫైనాన్షియల్ బిడ్‌లో సింగరేణి పాల్గొనాలి : బిఎంఎస్.

0 32

పీకే ఓసీ–2 డిప్ సైడ్ ఎక్స్టెన్షన్ ఫైనాన్షియల్ బిడ్‌లో సింగరేణి పాల్గొనాలి.
కేంద్రం సానుకూలంగా ఉంది.. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి: ఏబీకేఎంఎస్–బీఎంఎస్.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
భద్రాద్రి-కొత్తగూడెం, జూలై 2:మణుగూరు పీకే ఓసీ-2 డిప్ సైడ్ ఎక్స్టెన్షన్ ప్రాజెక్టు సింగరేణి భవిష్యత్తుకు అత్యంత కీలకమైనదని, ఈ నెల 7వ తేదీలోపు జరిగే ఫైనాన్షియల్ బిడ్ ప్రక్రియలో సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో తప్పనిసరిగా పాల్గొని ప్రాజెక్టును కైవసం చేసుకునేందుకు అన్ని చర్యలు చేపట్టాలని సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ (ఏబీకేఎంఎస్–బీఎంఎస్) డిమాండ్ చేసింది. గురువారం భద్రాద్రి కొత్తగూడెంలోని బీఎంఎస్ భవన్‌లో కార్పొరేట్ ఏరియా అధ్యక్షుడు రామ్‌సింగ్ అధ్యక్షతన నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో సంఘం కార్యదర్శి, నేషనల్ డస్ట్ ప్రివెన్షన్ కమిటీ సభ్యుడు పి. మాధవ నాయక్, యూనియన్ అధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్ మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కేంద్ర బొగ్గు, గనుల మంత్రిత్వ శాఖ ఈ ప్రాజెక్టు విషయంలో సింగరేణికి సానుకూల దృక్పథంతో ఉన్నప్పటికీ, తుది కేటాయింపులో ఫైనాన్షియల్ బిడ్ కీలకమని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చేజారనీయకుండా సమర్థవంతమైన వ్యూహంతో బిడ్‌లో పాల్గొనాలని కోరారు. మణుగూరు ప్రాంతంలోని ప్రస్తుత గనుల్లో బొగ్గు నిల్వలు క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో పీకే ఓసీ–2 డిప్ సైడ్ ఎక్స్టెన్షన్ ప్రాజెక్టు సింగరేణికి దక్కకపోతే సంస్థ కార్యకలాపాలు, వేలాది మంది కార్మికుల ఉపాధి, స్థానిక ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టులో సుమారు 215 మిలియన్ టన్నుల నాణ్యమైన బొగ్గు నిల్వలు ఉన్నాయని, ఇది సింగరేణి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంతో పాటు సంస్థ ఆర్థిక బలోపేతం, ఉద్యోగ భద్రత, తెలంగాణ పారిశ్రామికాభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని తెలిపారు. బొగ్గు తవ్వకాల రంగంలో శతాబ్దకాల అనుభవం, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యం కలిగిన ఉద్యోగులు, బలమైన మౌలిక సదుపాయాలు సింగరేణికే ఉన్నందున ఈ ప్రాజెక్టును విజయవంతంగా నిర్వహించే సామర్థ్యం కూడా సంస్థకే ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం సమన్వయంతో తక్షణ చర్యలు తీసుకుని ఫైనాన్షియల్ బిడ్‌లో పోటీగా పాల్గొని పీకే ఓసీ–2 డిప్ సైడ్ ఎక్స్టెన్షన్ ప్రాజెక్టును సింగరేణి కైవసం చేసుకునేలా చర్యలు చేపట్టాలని సంఘం డిమాండ్ చేసింది. ఈ సమావేశంలో జి.వి. కృష్ణారెడ్డి, పవన్ కుమార్, అజ్మీర వెంకటేశ్వర్లు, బి. రాంసింగ్, మొగిలిపాక రవి, నర్సింగరావు, నరేష్, బాలకృష్ణ, శ్రవణ్ కుమార్, ఏ. మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.