బొగ్గు గ్యాసిఫికేషన్ రంగంలోకి సింగరేణి అడుగులు : భూగర్భ బొగ్గు గ్యాసిఫికేషన్ పైలట్ ప్రాజెక్టుకు సన్నాహాలు.
బొగ్గు గ్యాసిఫికేషన్ రంగంలోకి సింగరేణి అడుగులు.
భూగర్భ బొగ్గు గ్యాసిఫికేషన్ పైలట్ ప్రాజెక్టుకు సన్నాహాలు.
బెల్లంపల్లిలో తొలి పైలట్ ప్రాజెక్టు.. భీమారం, చెన్నూరు సౌత్, నైనీ ప్రాంతాల్లో అవకాశాలపై అధ్యయనం.
హైడ్రోకార్బన్స్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ నాగులపల్లి శ్రీకాంత్‌తో సమావేశమైన సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్దప్రకాష్ జ్యోతి.
(ప్రజాలక్ష్యం ప్రత్యేక ప్రతినిధి)
హైదరాబాద్, జూలై 11:సాంప్రదాయ బొగ్గు తవ్వకాలకే పరిమితం కాకుండా భవిష్యత్ ఇంధన అవసరాలకు అనుగుణంగా సింగరేణి కార్యకలాపాలను విస్తరించే దిశగా కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం సూచించిన బహుముఖ విస్తరణ వ్యూహంలో భాగంగా బొగ్గు గ్యాసిఫికేషన్ రంగంలోకి ప్రవేశించేందుకు సంస్థ సమగ్ర కార్యాచరణ రూపొందిస్తోంది. ముఖ్యంగా భూగర్భ బొగ్గు గ్యాసిఫికేషన్ పైలట్ ప్రాజెక్టును బెల్లంపల్లి ప్రాంతంలో ప్రారంభించేందుకు సన్నాహాలు వేగవంతం చేసింది. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్లో పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ నాగులపల్లి శ్రీకాంత్‌తో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో సింగరేణి ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బుద్దప్రకాష్ జ్యోతి సంస్థ చేపడుతున్న ప్రణాళికలను వివరించారు. సమావేశంలో మాట్లాడిన సీఎండీ డాక్టర్ బుద్దప్రకాష్ జ్యోతి, బొగ్గు గ్యాసిఫికేషన్ ద్వారా బొగ్గును నేరుగా కాల్చకుండా రసాయన ప్రక్రియ ద్వారా సింథటిక్ గ్యాస్ (సింగ్యాస్)గా మార్చి, ఎరువులు, రసాయనాలు, హైడ్రోజన్, విద్యుత్ ఉత్పత్తి వంటి పలు రంగాల్లో వినియోగించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. భవిష్యత్తులో దేశ ఇంధన భద్రత, దిగుమతుల తగ్గింపు, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి ఈ సాంకేతికత ఎంతో కీలకమని పేర్కొన్నారు. సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రాంగణంలో రోజుకు 400 టన్నుల సామర్థ్యంతో అమ్మోనియం నైట్రేట్ మెల్ట్ ప్లాంట్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ అధ్యయనం నిర్వహించిందని తెలిపారు. ప్రస్తుతం పెట్టుబడిపై ఆశించిన స్థాయిలో రాబడి కనిపించకపోయినా, ప్లాంట్ సామర్థ్యాన్ని పెంచడం, కేంద్ర ప్రభుత్వ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ వినియోగించడం, స్వదేశీ సాంకేతికతను ఉపయోగించడం వంటి ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. గ్యాసిఫికేషన్ రంగంలో ఇప్పటికే అమలులో ఉన్న దేశంలోని ప్రాజెక్టుల నుంచి సాంకేతిక అనుభవాన్ని సేకరించేందుకు ఈ నెలలో సింగరేణి అధికారుల బృందం ఒడిశాలోని తాల్చేర్ ప్రాజెక్టు, ఎంసీఎల్–బీహెచ్ఈఎల్ సంయుక్త ప్రాజెక్టు, జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ గ్యాసిఫికేషన్ యూనిట్లను సందర్శించి అధ్యయనం చేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా భీమారం, చెన్నూరు సౌత్, నైనీ ప్రాంతాల్లో ఉపరితల బొగ్గు గ్యాసిఫికేషన్ సాధ్యాసాధ్యాలపై సాంకేతిక, ఆర్థిక విశ్లేషణ కొనసాగుతోందని చెప్పారు. బొగ్గు నాణ్యత, నిల్వలు, ఉత్పత్తి వ్యయం, మార్కెట్ అవకాశాలు వంటి అంశాలను సమగ్రంగా పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. భూగర్భ బొగ్గు గ్యాసిఫికేషన్‌కు సంబంధించి బెల్లంపల్లి, రామగుండం ప్రాంతాల్లో లోతైన బొగ్గు నిల్వలున్న ఐదు బ్లాక్‌లను గుర్తించినట్లు సీఎండీ తెలిపారు. వీటిలో బెల్లంపల్లి డిప్‌సైడ్ బ్లాక్‌లో తొలి పైలట్ ప్రాజెక్టును చేపట్టేందుకు డ్రిల్లింగ్ ఏర్పాట్లు ప్రారంభమయ్యాయని చెప్పారు. సీఎంఐఎఫ్ఆర్ (సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ అండ్ ఫ్యూయల్ రీసెర్చ్) శాస్త్రవేత్తల సాంకేతిక సహకారంతో ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ నాగులపల్లి శ్రీకాంత్ గ్యాసిఫికేషన్ రంగంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు, అందుబాటులో ఉన్న సాంకేతికత, ప్రోత్సాహకాలు, భవిష్యత్తు అవకాశాలపై సింగరేణి అధికారులతో చర్చించినట్లు తెలిసింది. దేశీయ బొగ్గు వనరులను విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని సమావేశంలో ప్రస్తావించారు. బొగ్గు గ్యాసిఫికేషన్‌లో సింగరేణి ప్రవేశం సంస్థ వ్యాపార విస్తరణలో కీలక మలుపుగా భావిస్తున్నారు. సంప్రదాయ బొగ్గు విక్రయాలకే పరిమితం కాకుండా ఎరువులు, పారిశ్రామిక రసాయనాలు, హైడ్రోజన్ ఇంధనం, విద్యుత్ ఉత్పత్తి వంటి అధిక విలువ కలిగిన రంగాల్లోకి అడుగుపెట్టే అవకాశం కలుగుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల సంస్థ ఆదాయ వనరులు విస్తరించడంతో పాటు తెలంగాణ పారిశ్రామికాభివృద్ధికి, ఉపాధి అవకాశాల పెంపుకు, దేశ ఇంధన స్వావలంబనకు కూడా దోహదం చేసే అవకాశాలు ఉన్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ సమావేశంలో డైరెక్టర్లు ఎల్వీ సూర్యనారాయణ (ఆపరేషన్స్), కె. వెంకటేశ్వర్లు (ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్), గౌతమ్ పోట్రు (పర్సనల్ అండ్ ఫైనాన్స్), ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూవ్మెంట్) బి. వెంకన్న, జనరల్ మేనేజర్ (కోఆర్డినేషన్ అండ్ మార్కెటింగ్) టి. శ్రీనివాస్, జనరల్ మేనేజర్ (ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్) జి. దేవేందర్, జనరల్ మేనేజర్ (బిజినెస్ డెవలప్మెంట్) రాందాస్, జనరల్ మేనేజర్ (ఆర్ అండ్ డీ) వెంకటరమణ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.