కార్తికేయ ఎంక్లేవ్‌లో సీసీ రోడ్ల నిర్మాణానికి ఎంపీ నిధులు కేటాయించాలి.
మాజీ ఎంపీపీ, బీజేపీ మేడ్చల్ అసెంబ్లీ ఇన్‌చార్జ్ ఏనుగు సుదర్శన్ రెడ్డికి వినతిపత్రం.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
ఘట్కేసర్, జూలై 11:మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఘట్కేసర్ డివిజన్ పోచారం వార్డు, చౌదరిగూడలో ఉన్న కార్తికేయ ఎంక్లేవ్ కాలనీలో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ ఎంపీ స్థానిక ప్రాంత అభివృద్ధి నిధుల నుంచి నిధులు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కార్తికేయ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు మాజీ ఎంపీపీ, బీజేపీ మేడ్చల్ అసెంబ్లీ ఇన్‌చార్జ్ ఏనుగు సుదర్శన్ రెడ్డిని కోరారు. శనివారం కార్తికేయ ఎంక్లేవ్ కాలనీ అధ్యక్షుడు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఏనుగు సుదర్శన్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఈ వినతిని ఎంపీ ఈటల రాజేందర్ దృష్టికి తీసుకెళ్లి, ఎంపీ నిధులతో కాలనీలో నెలకొన్న మౌలిక సదుపాయాల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. వినతిపత్రంలో కాలనీలోని అంతర్గత రోడ్లు పూర్తిగా దెబ్బతినడంతో ప్రజలు నడవడానికి, వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. సుమారు వెయ్యి మీటర్ల పొడవు, 18 అడుగుల వెడల్పుతో సీసీ రోడ్ల నిర్మాణానికి ఎంపీ నిధులు మంజూరు చేయాలని కోరారు. కాలనీలో 40 అడుగులు, 30 అడుగుల వెడల్పు గల రోడ్లు ఉన్నందున అవసరమైన మేరకు సీసీ రోడ్లు నిర్మిస్తే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని వివరించారు. ఈ సందర్భంగా ఏనుగు సుదర్శన్ రెడ్డి వినతిపత్రాన్ని స్వీకరించి, సమస్యను సంబంధిత ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్తికేయ ఎంక్లేవ్ కాలనీ వాసులు భూపాల్ రెడ్డి, ఎం.ఎస్. రావు, సద్గుణచారి, శ్రీనివాస్ రెడ్డి, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.