Take a fresh look at your lifestyle.

మైనింగ్ స్టాఫ్ సమస్యలను యాజమాన్యంతో చర్చించి పరిష్కరిస్తాం: డాక్టర్ జనక్ ప్రసాద్.

0 12

మైనింగ్ స్టాఫ్ సమస్యలను యాజమాన్యంతో చర్చించి పరిష్కరిస్తాం: డాక్టర్ జనక్ ప్రసాద్.

ఐఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో భూపాలపల్లిలో మైనింగ్ స్టాఫ్ సమావేశం.

కేడర్ స్కీమ్, పదోన్నతులు, అండర్ మేనేజర్ పోస్టులు, ఛార్జ్ అలవెన్స్ సహా పలు డిమాండ్లతో మెమొరాండం సమర్పణ.

(ప్రజాలక్ష్యం ప్రతినిధి)

జయశంకర్-భూపాలపల్లి, జూలై 19: సింగరేణి మైనింగ్ స్టాఫ్ ఎదుర్కొంటున్న సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి దశలవారీగా పరిష్కరించేలా కృషి చేస్తామని తెలంగాణ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్, ఐఎన్‌టీయూసీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జనక్ ప్రసాద్ హామీ ఇచ్చారు. ఆదివారం భూపాలపల్లి ఏరియాలోని సింగరేణి కమ్యూనిటీ హాల్‌లో ఐఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించిన మైనింగ్ స్టాఫ్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మైనింగ్ స్టాఫ్ ప్రతినిధులు తమ సమస్యలు, పెండింగ్ డిమాండ్లపై సమగ్ర మెమొరాండంను జనక్ ప్రసాద్‌కు అందజేశారు. సమావేశంలో మాట్లాడిన జనక్ ప్రసాద్ మాట్లాడుతూ, మైనింగ్ స్టాఫ్ ఎదుర్కొంటున్న సమస్యలు చాలా కాలంగా పరిష్కారానికి నోచుకోకుండా ఉన్నాయని అన్నారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను సింగరేణి యాజమాన్యంతో చర్చించి సానుకూల నిర్ణయం వచ్చేలా కృషి చేస్తామని తెలిపారు. ఉద్యోగుల హక్కులకు భంగం కలగకుండా ప్రతి సమస్యను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఉద్యోగుల సంక్షేమమే ఐఎన్‌టీయూసీ ప్రధాన లక్ష్యమని, మైనింగ్ స్టాఫ్‌కు న్యాయం జరిగే వరకు సంఘం అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

మెమొరాండంలో ప్రధాన డిమాండ్లు:

అనారోగ్యం లేదా ఇతర కారణాలతో అండర్‌గ్రౌండ్ విధులకు అనర్హులైన మైనింగ్ స్టాఫ్‌కు CMR-2017 నిబంధనల ప్రకారం సర్ఫేస్‌లో సూటబుల్ ఉద్యోగాలు కల్పించాలని ప్రతినిధులు కోరారు. ఓపెన్‌కాస్ట్ గనుల్లో కూడా మైనింగ్ సర్దార్లు, ఓవర్‌మెన్‌ల అవసరానికి అనుగుణంగా సూటబుల్ పోస్టుల్లో నియమించాలని విజ్ఞప్తి చేశారు. 2016-17 జేఎంఈటీ డిప్లొమా హోల్డర్లకు కేడర్ స్కీమ్ ప్రకారం పదోన్నతులు ఇవ్వకుండా ఏడు నుంచి ఎనిమిదేళ్లుగా అదే గ్రేడ్‌లో కొనసాగిస్తూ శ్రమ దోపిడీ జరుగుతోందని వారు ఆరోపించారు. కంపెనీలో సుమారు 200 ఓవర్‌మెన్ ఖాళీలు ఉన్నప్పటికీ వాటిని భర్తీ చేయకుండా సీనియర్ మైనింగ్ సర్దార్లతోనే ఓవర్‌మెన్ విధులు చేయిస్తున్నారని తెలిపారు. తక్షణమే ఖాళీలు భర్తీ చేసి గ్రేడ్ అప్‌గ్రేడ్‌తో పాటు ప్రమోషన్లు కల్పించాలని కోరారు. 2024 జేఎంఈటీ బ్యాచ్‌కు కేడర్ స్కీమ్ ప్రకారం ఏడాది పూర్తయిన తర్వాత SF/MS గ్రేడ్-సి ప్రమోషన్ ఇవ్వాల్సి ఉన్నప్పటికీ, అవసరమైన ఓవర్‌మెన్ సర్టిఫికెట్లు, జీటీ, ఫస్ట్ ఎయిడ్ అర్హతలు సాధించినా గత ఎనిమిది నెలలుగా ప్రమోషన్లు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అండర్ మేనేజర్ (ఈ-2) పోస్టుల భర్తీలో సంస్థలోనే సెకండ్ క్లాస్, ఫస్ట్ క్లాస్ మేనేజర్ అర్హతలు, 10 నుంచి 15 ఏళ్ల అనుభవం కలిగిన వందలాది ఓవర్‌మెన్‌లను పక్కనబెట్టి బయటి నియామకాలకు ప్రాధాన్యం ఇవ్వడం సరికాదన్నారు. అనుభవజ్ఞులైన ఉద్యోగులకు ముందుగా అవకాశాలు కల్పించాలని కోరారు. అలాగే ఏ-గ్రేడ్ హెడ్ ఓవర్‌మెన్‌లకు పరీక్షలు లేకుండానే జూనియర్ మైనింగ్ ఆఫీసర్ (జేఎంఓ-ఈ2) పదోన్నతులు ఇవ్వాలని, తద్వారా ఖాళీ అయ్యే ఓవర్‌మెన్ పోస్టుల్లో 2016-17 జేఎంఈటీ బ్యాచ్‌కు ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.

ఎలక్ట్రానిక్ డిటోనేటర్లపై ఆందోళన:

అండర్‌గ్రౌండ్ గనుల్లో తగిన శిక్షణ, అవగాహన లేకుండానే ఎలక్ట్రానిక్ డిటోనేటర్లను వినియోగించడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని మైనింగ్ స్టాఫ్ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. కేటీకే-5 ఇంక్లైన్‌లో సీనియర్ మైనింగ్ సర్దార్ ఎస్. ప్రసాద్ చేతిలో డిటోనేటర్ పేలి వేళ్లు కోల్పోయిన ఘటనను ప్రస్తావిస్తూ, పూర్తి స్థాయి శిక్షణ ఇచ్చిన తర్వాతే వాటిని వినియోగించాలని కోరారు. ఇవి కంపెనీపై అదనపు ఆర్థిక భారం మోపడంతో పాటు బ్లాస్టింగ్ ప్రక్రియకు ఎక్కువ సమయం పట్టి ఉత్పత్తిపైనా ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు.

ఓపెన్‌కాస్ట్ గనుల్లో ఖాళీలు భర్తీ చేయాలి:

ఓపెన్‌కాస్ట్ గనుల్లో సర్దార్లు, ఓవర్‌మెన్‌ల విధులపై సర్క్యులర్ జారీ చేసినప్పటికీ, ఖాళీలు భర్తీ చేయకుండా ఉన్న సిబ్బందిపైనే అదనపు పనిభారం మోపుతున్నారని తెలిపారు. వెంటనే కౌన్సెలింగ్ నిర్వహించి ఖాళీలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా సూపర్వైజింగ్ అండ్ టెక్నికల్ స్టాఫ్‌కు అమలు చేస్తున్న ఎన్-1 స్కేల్, 50 శాతం పీహెచ్‌డీ విధానాన్ని రద్దు చేసి పాత విధానాన్ని పునరుద్ధరించాలని, ఫీల్డ్ ఓవర్‌మెన్‌లకు కూడా డిప్లొమా హోల్డర్ల మాదిరిగా ఐదేళ్లకోసారి పదోన్నతులు కల్పించాలని, కోల్ ఇండియా తరహాలో సింగరేణి మైనింగ్ స్టాఫ్‌కు ఛార్జ్ అలవెన్స్ అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐఎన్‌టీయూసీ సీనియర్ సెంట్రల్ కమిటీ ఉపాధ్యక్షుడు నరసింహారెడ్డి, సింగరేణి మహిళా విభాగం అధ్యక్షురాలు మద్దినేని శేషారత్నం, మైనింగ్ స్టాఫ్ ఇన్‌చార్జి తిరుపతి రాజు, భూపాలపల్లి బ్రాంచ్ అధ్యక్షుడు భేతెల్లి మధుకర్‌ రెడ్డి, ఆర్జీ-1 వైస్ ప్రెసిడెంట్ సదానందం, భూపాలపల్లి మైనింగ్ స్టాఫ్ ఇన్‌చార్జి చక్రపాణి, ఆర్జీ-2 వైస్ ప్రెసిడెంట్ సత్యనారాయణ, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ బుచ్చయ్య, రఘుపతిరెడ్డి, మారేపల్లి బాబు, సమ్మిరెడ్డి తదితర ఐఎన్‌టీయూసీ నాయకులు, మైనింగ్ స్టాఫ్ ప్రతినిధులు, డిప్లొమా, నాన్-డిప్లొమా ఉద్యోగులు సుమారు 300 మంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.