గారేపల్లిలో ఘనంగా ‘గోరింటాకు సంబరాలు’.
ఆషాడ మాసం సందర్భంగా మహిళల సందడి.. ఆటపాటలు, నృత్యాలతో ఉత్సాహభరిత వేడుకలు.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
కాటారం, జూలై 29: ఆషాడ మాసాన్ని పురస్కరించుకుని జయశంకర్-భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గారేపల్లి గ్రామంలో అయ్యప్ప మహిళా గ్రూప్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ‘గోరింటాకు సంబరాలు’ గ్రామంలో పండుగ వాతావరణాన్ని తలపించాయి. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఉత్సాహంగా వేడుకలను నిర్వహించారు. మహిళలందరూ ఒకచోట చేరి సామూహికంగా గోరింటాకు ఆకులను సేకరించి, వాటిని నూరి ఒకరికొకరు గోరింటాకు పెట్టుకున్నారు. అనంతరం జానపద గీతాలు ఆలపిస్తూ, ఆటలు, నృత్యాలు చేస్తూ కేరింతలతో సందడి చేశారు. సంప్రదాయ దుస్తుల్లో పాల్గొన్న మహిళలు వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ, ఆషాడ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం భారతీయ సంస్కృతిలో ఒక ప్రత్యేక ఆచారమని తెలిపారు. గోరింటాకు శరీరానికి చల్లదనాన్ని అందించడమే కాకుండా ఆరోగ్యానికి మేలు చేస్తుందని, శుభం, సౌభాగ్యం, ఆయురారోగ్యాలకు ప్రతీకగా భావిస్తారని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు గ్రామీణ సంస్కృతి, సాంప్రదాయాలను భావితరాలకు చేరవేసేందుకు దోహదపడతాయని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో పడకంటి అంజలి, ముక్తవరం సుజాత, అంద్య సంధ్యారాణి, కలికోట కల్పనతో పాటు గ్రామానికి చెందిన పలువురు మహిళలు పాల్గొని సంబరాలను విజయవంతం చేశారు.