సీఐటీయూ పోరాట ఫలితమే సింగరేణి కార్మికుల ప్రాథమిక వేతన రక్షణ.
హైకోర్టు తీర్పుతో కార్మికులకు చారిత్రాత్మక విజయం: దుడ్డేల సాయిలు.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్-భూపాలపల్లి, జూలై 31: అండర్‌గ్రౌండ్ నుంచి సర్ఫేస్‌కు బదిలీ అయిన సింగరేణి కార్మికుల ప్రాథమిక వేతనాన్ని రక్షిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు సీఐటీయూ నిరంతర పోరాటానికి దక్కిన చారిత్రాత్మక విజయమని సీఐటీయూ భూపాలపల్లి బ్రాంచ్ కార్యదర్శి దుడ్డేల సాయిలు అన్నారు. ఈ తీర్పు ద్వారా వేలాది మంది కార్మికుల హక్కులు పరిరక్షించబడినట్లు ఆయన పేర్కొన్నారు. శుక్రవారం భూపాలపల్లి ఏరియాలోని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సంస్థ అవసరాల దృష్ట్యా అండర్‌గ్రౌండ్ నుంచి సర్ఫేస్‌కు బదిలీ అయిన కార్మికుల ప్రాథమిక వేతనాన్ని తగ్గించడం వల్ల వారు తీవ్ర ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటున్నారని, దీనిపై సీఐటీయూ సుదీర్ఘకాలం పోరాటం చేసి న్యాయస్థానాన్ని ఆశ్రయించిందన్నారు. హైకోర్టు తీర్పులో అండర్‌గ్రౌండ్ నుంచి సర్ఫేస్‌కు బదిలీ అయిన కార్మికుల బేసిక్ వేతనాన్ని తగ్గించడం చట్టవిరుద్ధమని స్పష్టం చేసిందని తెలిపారు. అలాగే తగ్గించిన బేసిక్ వేతనం ఆధారంగా యాజమాన్యం చేపట్టిన రికవరీలను రద్దు చేయడంతో పాటు, ఇప్పటికే వసూలు చేసిన మొత్తాలను సంబంధిత కార్మికులకు తిరిగి చెల్లించాలని ఆదేశించిందన్నారు. కార్మికులకు రావలసిన అన్ని అనుబంధ ప్రయోజనాలు కూడా వర్తించేలా తీర్పు ఉండటం విశేషమని పేర్కొన్నారు. ట్రామర్లు, సపోర్ట్‌మెన్‌లు, టండల్‌లు, కోల్ కట్టర్లు, ఆపరేటర్లు తదితర అండర్‌గ్రౌండ్ నుంచి సర్ఫేస్‌కు బదిలీ అయిన అన్ని కేటగిరీల కార్మికులు ఈ వేతన రక్షణకు సంబంధించి ఏవైనా సమస్యలు ఎదుర్కొంటుంటే సీఐటీయూను సంప్రదించాలని దుడ్డేల సాయిలు కోరారు. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం సీఐటీయూ భవిష్యత్తులోనూ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సీఐటీయూ నాయకులు, సింగరేణి కార్మికులు పాల్గొన్నారు.