Take a fresh look at your lifestyle.

ప్రతిభావంతులైన విద్యార్థులకు పూర్వ విద్యార్థుల నగదు ప్రోత్సాహకాలు : పాల్వంచలో పూర్వ విద్యార్థుల గొప్పతనం.

0 4

ప్రతిభావంతులైన విద్యార్థులకు పూర్వ విద్యార్థుల నగదు ప్రోత్సాహకాలు.

చదువుకున్న పాఠశాలపై మమకారంతో ఏటా నగదు బహుమతులు.. పూర్వ విద్యార్థుల గొప్పతనం.

(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
పాల్వంచ, ఆగస్టు 15: తాము చదువుకున్న పాఠశాలపై ఉన్న మమకారాన్ని చాటుకుంటూ పాల్వంచ జడ్పీహెచ్‌ఎస్‌ (బొల్లోరిగూడెం) 1984-85 పదో తరగతి పూర్వ విద్యార్థులు ప్రతిభావంతులైన విద్యార్థులకు ఏటా నగదు ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. ఇందులో భాగంగా 2025-26 విద్యా సంవత్సరంలో పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మొత్తం రూ.12 వేల నగదు బహుమతులను శనివారం 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలి చేతుల మీదుగా అందించారు.ప్రథమ స్థానంలో నిలిచిన ఒకరికి, ద్వితీయ స్థానంలో నిలిచిన ఒకరికి, తృతీయ స్థానంలో నిలిచిన ఇద్దరికి నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి, పోటీ తత్వాన్ని పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు పూర్వ విద్యార్థులు తెలిపారు.

పాఠశాలపై మమకారంతో శాశ్వత ప్రోత్సాహకం:

తాము చదువుకున్న పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల ప్రోత్సాహం కోసం 1984-85 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు గత ఏడాది సొమ్మును సేకరించి రూ.1.60 లక్షలను తెలంగాణ వికాస్ బ్యాంకులో స్థిర డిపాజిట్ చేసినట్లు తెలిపారు. పూర్వ విద్యార్థులు ప్రతిమ, కేటీపీఎస్ ఉద్యోగి ఎస్. వెంకటేశ్వర్లు పేర్లపై అందరి ఆమోదంతో ఈ డిపాజిట్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ డిపాజిట్‌పై వచ్చే వడ్డీ మొత్తాన్ని ప్రతి సంవత్సరం పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా నగదు ప్రోత్సాహకంగా అందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులను ప్రోత్సహించడంతో పాటు తాము చదువుకున్న పాఠశాలతో అనుబంధాన్ని కొనసాగించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పూర్వ విద్యార్థులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. తాను చదువుకున్న పాఠశాలలోనే ప్రతిమ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుండటం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు రవీందర్, అలీమ్ బాబా, దేవేందర్, ఎస్. వెంకటేశ్వర్లు, రామారావు, గురు బ్రహ్మచారి, అశోక్, సుధాకర్, ప్రతిమ, అరుణ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.