మారు మూల ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు.
మహదేవపూర్ సామాజిక ఆసుపత్రి పునర్నిర్మాణానికి హామీ.
ఆగస్టు 4న మరో ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహణ.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్-భూపాలపల్లి, జూలై 31: మారు మూల ప్రాంత ప్రజలకు కూడా పట్టణాలకు సమానంగా నాణ్యమైన వైద్య సేవలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. శిధిలావస్థలో ఉన్న మహదేవపూర్ సామాజిక ఆసుపత్రిని ఆధునిక వసతులతో పునర్నిర్మించి ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. శుక్రవారం మహదేవపూర్ సామాజిక ఆసుపత్రిలో ఐడీబీఐ బ్యాంకు సహకారంతో హైదరాబాద్ ఎంఎన్‌జే ఆసుపత్రి, కరీంనగర్ ఓమెగా ఆసుపత్రి వైద్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత క్యాన్సర్, కంటి నిర్ధారణ వైద్య శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ముఖ్యంగా మహిళలను సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించడం ద్వారా పేద కుటుంబాలు ఆర్థికంగా నష్టపోకుండా కాపాడటమే ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. ప్రజలకు ఆధునిక వైద్య సేవలు అందించేందుకు హెల్త్ ఏటీఎం, ఈసీజీ, ఇతర అత్యాధునిక వైద్య పరికరాలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. హెల్త్ ఏటీఎం ద్వారా 64 రకాల వైద్య పరీక్షలు వేగంగా నిర్వహించవచ్చని, పరీక్షల వివరాలు ఐదేళ్ల వరకు భద్రంగా నిల్వ ఉండే విధంగా ప్రత్యేక కార్డు అందజేస్తామని వివరించారు. కంటి పరీక్షల కోసం ప్రత్యేక పరికరాలు, గుండె సంబంధిత వ్యాధుల నిర్ధారణకు ఈసీజీ యంత్రాలను కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మహిళలు తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలు చేయించుకుని వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తిస్తే చికిత్స సులభమవుతుందని మంత్రి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యం, విద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, గ్రామీణ ప్రాంతాల్లోనూ నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రజల సౌకర్యార్థం ఆగస్టు 4న ఎంఎన్‌జే ఆసుపత్రి ఆధ్వర్యంలో మరో ఉచిత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. కాటారం డివిజన్ పరిధిలో ఇప్పటివరకు 680 మందికి హైదరాబాద్‌లో ఉచిత కంటి ఆపరేషన్లు నిర్వహించగా, మంథని నియోజకవర్గ వ్యాప్తంగా 45 వేల మందికి కంటి చికిత్సలు అందించినట్లు మంత్రి తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి ప్రజోపయోగ ఆరోగ్య కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. అనంతరం వైద్య శిబిరంలో సేవలందించిన వైద్యులను మంత్రి శాలువాలతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ ఐతా ప్రకాశ్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. మధుసూదన్, ఆసుపత్రుల సమన్వయ అధికారి డా. శ్రీకాంత్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజాబాబు, రాష్ట్ర సభ్యులు దండు రమేష్, కాటారం ఆర్డీఓ రవీందర్, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, తహసీల్దార్ సత్యనారాయణ స్వామి, ఎంపీడీఓ రవీంద్రనాథ్, అంకాలజిస్టు డా. సంతోష్ రెడ్డి, సర్పంచ్ హసీనా భాను అక్బర్, కాటారం మార్కెట్ కమిటీ చైర్మన్ పంతకాని తిరుమల సమ్మయ్య, పీఏసీఎస్ చైర్మన్ తిరుపతి రెడ్డి, ఐడీబీఐ మేనేజర్ చంద్రమౌళీశ్వర రెడ్డి, కాళేశ్వరం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.