గోపాల గోపి మృతి సీపీఐ, ఏఐటీయూసీకి తీరని లోటు.
సీపీఐ పట్టణ కార్యదర్శి సోతుకు ప్రవీణ్‌కుమార్.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్-భూపాలపల్లి, ఆగస్టు 20: భూపాలపల్లి కేటీకే-1 గనిలో విధులు నిర్వహిస్తూ బుధవారం అర్ధరాత్రి గుండెపోటుతో గోపాల గోపి మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని సీపీఐ పట్టణ కార్యదర్శి సోతుకు ప్రవీణ్‌కుమార్ అన్నారు. గోపాల గోపి మృతి సీపీఐ, ఏఐటీయూసీతో పాటు సింగరేణి కార్మిక లోకానికి తీరని లోటని పేర్కొన్నారు. సీపీఐ శాఖ కార్యదర్శిగా, సింగరేణి ఏఐటీయూసీ నాయకుడిగా అనేక కార్మిక కార్యక్రమాలను ముందుండి నడిపించి ప్రత్యేక గుర్తింపు పొందారని తెలిపారు. కార్మికుల హక్కుల పరిరక్షణతో పాటు పార్టీ అభివృద్ధికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. గోపాల గోపి పార్థివదేహంపై ఎర్రజెండా కప్పి, పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి సీపీఐ తరఫున ప్రగాఢ సానుభూతి తెలిపారు. విధి నిర్వహణలో మృతి చెందిన గోపాల గోపి కుటుంబానికి సింగరేణి యాజమాన్యం రూ.కోటి నష్టపరిహారం చెల్లించాలని సోతుకు ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ, ఏఐటీయూసీ బ్రాంచి, జిల్లా నాయకులు నూకల చంద్రమౌళి, ఎండీ ఆసిఫ్ పాషా, తాళ్ల పోశం, నేరెళ్ల జోసెఫ్, హైమద్, జెండాల కొమురయ్య, బాబురావు, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.