సింగరేణిలో భద్రతకే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలి: ఏఐటీయూసీ డిమాండ్.
దాదాపు ఏడాది తర్వాత జరిగిన సేఫ్టీ ట్రైపార్టైట్ సమావేశం.
సింగరేణి భవన్ లో ఆరు గంటల పాటు సాగిన సుదీర్ఘ చర్చలు।
సిబ్బంది కొరత, పాత యంత్రాలపై ప్రతినిధుల తీవ్ర ఆందోళన.
(ప్రజాలక్ష్యం ప్రత్యేక ప్రతినిధి)
హైదరాబాద్, సెప్టెంబర్ 3:సింగరేణి సంస్థ పరిధిలోని గనులు, డిపార్ట్‌మెంట్లలో కార్మికుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు పటిష్టం చేయాలని ఏఐటీయూసీ డిమాండ్ చేసింది. హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో సుమారు ఏడాది విరామం తర్వాత గురువారం ‘సేఫ్టీ ట్రైపార్టైట్ సమావేశం’ జరిగింది. సంస్థ చైర్మన్ డాక్టర్ గౌతమ్ బుద్ధ ప్రకాష్, డైరెక్టర్ (పా) గౌతమ్ పోట్రు, మైనింగ్ ఇన్‌స్పెక్టర్లు, అన్ని ఏరియాల జీఎంలు మరియు ప్రాతినిధ్య సంఘాల నాయకుల సమక్షంలో ఈ సమావేశం సుమారు ఆరు గంటల పాటు సుదీర్ఘంగా సాగింది. 6 జిల్లాల్లోని 12 ఏరియాల్లో ఉన్న గనుల్లో భద్రతా ప్రమాణాలపై లోతుగా చర్చించారు. మైనింగ్ స్టాఫ్, ట్రేడ్స్‌మెన్ సిబ్బంది కొరత వల్ల ఉన్న కార్మికులపై తీవ్ర పనిభారం పెరుగుతోందని, ఇది ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఖాళీ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అన్ని ఏరియాల్లో కోల్ డ్రిల్ బిట్స్‌తో పాటు అవసరమైన సేఫ్టీ మెటీరియల్ కొరత ఉందనే విషయాన్ని సభ దృష్టికి తీసుకెళ్లారు. పరికరాలను వెంటనే అందుబాటులో ఉంచి కార్మికులకు సరఫరా చేయాలని కోరారు. మైన్స్, డిపార్ట్‌మెంట్లలో కాలం చెల్లిన యంత్రాలను వాడటం వల్ల ప్రమాదాల ముప్పు పెరుగుతోందని, పాత వాటి స్థానంలో ఆధునిక, సురక్షితమైన యంత్రాలను తీసుకురావాలని స్పష్టం చేశారు. ఓపెన్ కాస్ట్ గనుల్లో రవాణా రోడ్లను మెరుగుపరచడంతో పాటు తగినంత లైటింగ్ ఏర్పాటు చేయాలని కోరారు. క్వారీల్లో తిరిగే వాహనాలకు పూర్తి స్థాయి భద్రతా పరికరాలు కల్పించాలన్నారు. అండర్‌గ్రౌండ్ మైన్స్‌లో కఠిన భద్రతా చర్యలు అమలు చేయడంతో పాటు, ఓపెన్‌కాస్ట్ గనుల్లో పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్, అన్‌లోడింగ్ కార్మికులకు కూడా సమాన స్థాయిలో భద్రతా పరికరాలు, రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. మైనింగ్ సూపర్‌వైజర్ సిబ్బందికి విధుల నిర్వహణలో స్పష్టమైన ఏరియా జ్యూరిస్డిక్షన్ (ప్రాంతీయ పరిధి) కేటాయించాలని ప్రస్తావించారు. ఈ సమావేశంలో సింగరేణి ఉన్నతాధికారులతో పాటు ఏఐటీయూసీ తరఫున రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్, అదనపు ప్రధాన కార్యదర్శి మిర్యాల రంగయ్య, ఉప ప్రధాన కార్యదర్శి కందికట్ల వీరభద్రయ్య, ముస్కే సమ్మయ్య, వై.వి.రావు, మడ్డి ఎల్లయ్య, గౌడ్ సారయ్య తదితరులు పాల్గొన్నారు.