Take a fresh look at your lifestyle.

బొగ్గు ఉత్పత్తి కంటే కార్మికుల భద్రతకే ప్రథమ ప్రాధాన్యత : త్రైపాక్షిక భద్రతా సమీక్షా సమావేశంలో డా. జనక్‌ ప్రసాద్‌.

0 4

బొగ్గు ఉత్పత్తి కంటే కార్మికుల భద్రతకే ప్రథమ ప్రాధాన్యత
ప్రమాదరహిత సింగరేణి కోసం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి.

ఐఎన్‌టీయూసీ సెక్రటరీ జనరల్‌ డా. జనక్‌ ప్రసాద్‌.
(ప్రజాలక్ష్యం ప్రత్యేక ప్రతినిధి)
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 3: సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి కంటే ప్రతి కార్మికుడి ప్రాణానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఐఎన్‌టీయూసీ సెక్రటరీ జనరల్‌ డా. జనక్‌ ప్రసాద్‌ పేర్కొన్నారు. ప్రమాదరహిత సింగరేణి లక్ష్యంగా యాజమాన్యం, అధికారులు, కార్మిక సంఘాలు సమన్వయంతో మరింత పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో గురువారం నిర్వహించిన సంస్థ 50వ త్రైపాక్షిక భద్రతా సమీక్షా సమావేశంలో డా. జనక్‌ ప్రసాద్‌ పాల్గొన్నారు. సుమారు ఆరు గంటలపాటు జరిగిన సమావేశంలో కార్మికుల భద్రత, రక్షణ చర్యలు, ఆరోగ్య సేవలు, ప్రమాదాల నివారణ తదితర అంశాలపై ఆయన పలు కీలక సూచనలు చేశారు.

ఆధునిక శిక్షణ, నాణ్యమైన రక్షణ పరికరాలు:

కార్మికులకు ఆధునిక భద్రతా శిక్షణ అందించడంతో పాటు నాణ్యమైన రక్షణ పరికరాలను సమకూర్చాలని డా. జనక్‌ ప్రసాద్‌ కోరారు. మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని, కాంట్రాక్టు కార్మికులకు కూడా రెగ్యులర్‌ కార్మికులతో సమాన స్థాయిలో భద్రతా శిక్షణ, రక్షణ చర్యలు కల్పించాలని సూచించారు. గనుల్లో సిబ్బంది, సూపర్‌వైజర్లు, అవసరమైన అధికారుల కొరతను తక్షణమే పరిష్కరించాలని ఆయన డిమాండ్‌ చేశారు. సిబ్బంది కొరత వల్ల పనిభారం పెరగకుండా చర్యలు తీసుకోవడంతో పాటు భద్రతా ప్రమాణాల అమలులో ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు.

‘జీరో యాక్సిడెంట్‌’ లక్ష్యంగా పనిచేయాలి:

కార్మికుల భద్రతే సింగరేణి అభివృద్ధికి పునాది అని డా. జనక్‌ ప్రసాద్‌ పేర్కొన్నారు. ‘జీరో యాక్సిడెంట్‌’ లక్ష్యంతో సంస్థలోని ప్రతి స్థాయిలో భద్రతా ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో డీజీఎంఎస్‌ అధికారులు, సింగరేణి యాజమాన్యం, అధికారుల సంఘం, గుర్తింపు పొందిన, ప్రాతినిధ్య కార్మిక సంఘాల నాయకులు పాల్గొని గనుల్లో భద్రతను మరింత బలోపేతం చేసేందుకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో ఐఎన్‌టీయూసీ సెంట్రల్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్లు నరసింహరెడ్డి, ధర్మపురి, కాంపెల్లి సమ్మయ్య, త్యాగరాజన్‌, జెట్టి శంకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.