అనారోగ్యంతో చికిత్స పొందుతున్న కార్మికులకు పరామర్శ.
మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు ఐఎన్‌టీయూసీ నాయకుల విజ్ఞప్తి.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్-భూపాలపల్లి, సెప్టెంబర్ 3: భూపాలపల్లి ఏరియా సింగరేణి ఆసుపత్రిలో వివిధ అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న కార్మికులను ఐఎన్‌టీయూసీ నాయకులు గురువారం పరామర్శించారు. భూపాలపల్లి ఏరియా ఐఎన్‌టీయూసీ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు బేతెల్లి మధుకర్‌రెడ్డి, ఐఎన్‌టీయూసీ సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ ఏ. రఘుపతిరెడ్డి ఆసుపత్రిని సందర్శించి కార్మికుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు వైద్యులను కలిసి చికిత్స పొందుతున్న కార్మికుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. కార్మికులకు అవసరమైన అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని వైద్యులను కోరారు. ఆసుపత్రిలో అందుతున్న చికిత్స, వైద్య సదుపాయాలపై కూడా వివరాలు తెలుసుకున్నారు. తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కొంతమంది కార్మికులకు మెరుగైన వైద్యం అందించేందుకు ఏరియా ఆసుపత్రి ఏసీఎంవోతో మాట్లాడి హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆసుపత్రులకు రిఫర్ చేయించినట్లు ఐఎన్‌టీయూసీ నాయకులు తెలిపారు. కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో మెరుగైన వైద్యం అందేలా యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహించాలని వారు కోరారు.