సింగరేణి వాస్తవ లాభాలు ప్రకటించి కార్మికులకు 40 శాతం వాటా చెల్లించాలి.
సింగరేణి యాజమాన్యం జేబీసీసీఐ సంఘాలను చర్చలకు ఆహ్వానించాలి.
దీపావళి పీఎల్‌ఆర్ బోనస్‌పై వెంటనే సమావేశం ఏర్పాటు చేయాలి.
15న బీఎంఎస్ ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా ఆందోళనలు.
ఎస్‌సీఎంకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్-భూపాలపల్లి, సెప్టెంబర్ 13: సింగరేణి యాజమాన్యం సంస్థ వాస్తవ లాభాలను వెంటనే ప్రకటించి కార్మికులకు 40 శాతం లాభాల వాటా చెల్లించాలని, దీపావళి పీఎల్‌ఆర్ బోనస్‌పై వెంటనే సమావేశం ఏర్పాటు చేయాలని బీఎంఎస్ అనుబంధ సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ (ఎస్‌సీఎంకేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం, సంస్థ పరిరక్షణ కోసం ఈ నెల 15న సింగరేణి వ్యాప్తంగా బీఎంఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఆదివారం భూపాలపల్లి ఏరియాలోని బీఎంఎస్ కార్యాలయంలో నాయకులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో అప్పాని శ్రీనివాస్ మాట్లాడారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో సింగరేణిలో సుమారు 58 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగినప్పటికీ సంస్థ వాస్తవ ఆర్థిక పరిస్థితి, లాభాలపై యాజమాన్యం స్పష్టత ఇవ్వడం లేదని అన్నారు. సింగరేణి లాభాలను వెంటనే ప్రకటించి కార్మికులకు 40 శాతం వాటా చెల్లించాలని డిమాండ్ చేశారు. గతంలో కార్మికులకు లాభాల్లో వాటా చెల్లించిన నేపథ్యంలో ప్రస్తుత లాభాలపై కూడా పారదర్శకత పాటించాలని కోరారు.
సింగరేణిలో ఉత్పత్తి తగ్గడానికి యాజమాన్యం ప్రణాళికాబద్ధంగా వ్యవహరించకపోవడమే కారణమని బీఎంఎస్ నాయకులు ఆరోపించారు. అవసరమైన పరికరాలు, యంత్రాలు, విడిభాగాలు సకాలంలో అందుబాటులో లేకపోవడంతో ఉత్పత్తిపై ప్రభావం పడుతోందన్నారు. కార్మికులకు అవసరమైన భద్రతా సామగ్రిని కూడా ఎలాంటి జాప్యం లేకుండా అందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని, కొత్త ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ, వివిధ అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. సింగరేణిలో రాజకీయ జోక్యాన్ని తగ్గించి సంస్థ అభివృద్ధి, ఉత్పత్తి, కార్మికుల సంక్షేమంపై యాజమాన్యం దృష్టి సారించాలని అన్నారు.
సింగరేణిలో ఇటీవల చోటుచేసుకున్న మిస్‌ఫైర్ బ్లాస్టింగ్ ప్రమాద ఘటనలపై కార్మికుల్లో ఆందోళన నెలకొందని అప్పాని శ్రీనివాస్ తెలిపారు. కొత్తగా ఎలక్ట్రానిక్ డిటోనేటర్ల వినియోగాన్ని సింగరేణి యాజమాన్యం నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఎలక్ట్రానిక్ డిటోనేటర్ల వినియోగంతో చోటుచేసుకున్న ప్రమాదాలపై డీజీఎంఎస్ ఆధ్వర్యంలో సమగ్ర విచారణ జరిపించి, ప్రమాదాలకు కారణాలను గుర్తించి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన భద్రతా చర్యలు చేపట్టాలని కోరారు.
సింగరేణిలో గుర్తింపు సంఘం కాలపరిమితి ముగిసిన నేపథ్యంలో జేబీసీసీఐ సంఘాలను యాజమాన్యం చర్చలకు ఆహ్వానించాలని అన్నారు. కార్మికుల సమస్యలపై వెంటనే చర్చలు, సంప్రదింపులు ప్రారంభించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నూతన కార్మిక చట్టాల్లో యూనియన్ ఎన్నికల విధానం గందరగోళంగా ఉన్నందున, కార్మిక చట్టాల సవరణ జరిగే వరకు జేబీసీసీఐ సంఘాలను చర్చలకు ఆహ్వానించి కార్మికుల సమస్యలపై సంప్రదింపులు కొనసాగించాలని కోరారు.
ఇదిలా ఉండగా, 2026 దీపావళి పీఎల్‌ఆర్ బోనస్‌పై కోల్‌ఇండియా యాజమాన్యం వెంటనే చర్చలు ప్రారంభించాలని, పీఎల్‌ఆర్ బోనస్ కమిటీని త్వరగా సమావేశపరచి బోనస్‌పై నిర్ణయం తీసుకోవాలని బీఎంఎస్, ఏబీకేఎంఎస్ నాయకత్వం కోరింది. ఈ మేరకు సెప్టెంబర్ 9న ఏబీకేఎంఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి సుజిత్ సింగ్ ఆధ్వర్యంలో బీఎంఎస్, ఏబీకేఎంఎస్ నాయకులు కోల్‌ఇండియా చైర్మన్‌ను కలిసి లేఖ అందజేసినట్లు అప్పాని శ్రీనివాస్ తెలిపారు. 2026 సంవత్సరానికి బొగ్గుగని కార్మికులకు మెరుగైన దీపావళి పీఎల్‌ఆర్ బోనస్ సాధించేందుకు బీఎంఎస్ నాయకత్వం కృషి చేస్తుందని చెప్పారు.
సింగరేణి సంస్థను పరిరక్షించడంతోపాటు కార్మికుల హక్కులు, సంక్షేమాన్ని కాపాడేందుకు బీఎంఎస్ నిరంతరం పోరాడుతుందని అప్పాని శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఈ నెల 15న నిర్వహించే ఆందోళనలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో వెలబోయిన సుజెందర్, బ్రాంచి ఉపాధ్యక్షుడు సట్కూరి శ్రీనివాస్, పండ్రాల మల్లేష్, కేంద్ర కమిటీ సభ్యులు రాసాకట్ల నరసింగరావు, బ్రాంచ్ కార్యదర్శి రేణిగుంట్ల మల్లేష్, శ్రీరాములు, పునీత్, శీలం రాజు, ఓదెలు, కుమార్, రాజేందర్, మల్లయ్య, బీజేపీ నాయకుడు సంపత్ తదితరులు పాల్గొన్నారు.