
క్రీడలకు విద్యతో సమాన ప్రాధాన్యం : ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు.
గ్రామీణ క్రీడాకారులను రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యం.
రాష్ట్ర స్థాయి క్రీడా ఉత్సవాలను ప్రారంభించిన ఎమ్మెల్యే.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్-భూపాలపల్లి, సెప్టెంబర్ 28:విద్యకు ప్రజా ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తుందో క్రీడలకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తోందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని తెలిపారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచి పతకాలు సాధించిన వారికి ఉద్యోగాలు, ఇతర ప్రోత్సాహకాలు అందిస్తున్నామని చెప్పారు. భూపాలపల్లి జిల్లా క్రీడా అధికారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి క్రీడా ఉత్సవాలను సోమవారం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులు, విద్యార్థులను పరిచయం చేసుకున్న ఆయన వారితో కలిసి కబడ్డీ ఆడి ఉత్సాహపరిచారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడల్లో ప్రతిభను ప్రదర్శించే యువతకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. బోల్లికుంట గ్రామానికి చెందిన ప్రతిభావంతురాలికి ఎక్సైజ్ శాఖలో ఉద్యోగంతో పాటు ఇల్లు కల్పించడం ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాయకత్వంలో క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. భూపాలపల్లి జిల్లాకు చెందిన క్రీడాకారులు తమ ప్రతిభను మరింత మెరుగుపరుచుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. తాము పుట్టిన గ్రామానికి, చదివిన పాఠశాలకు, జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. భూపాలపల్లిలో క్రీడలకు అవసరమైన పరికరాలు, మౌలిక వసతులు అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు చేపడతామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడా అధికారి, సంబంధిత అధికారులు, భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, స్థానిక కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, క్రీడాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు.