భద్రాద్రి జిల్లా అదనపు కలెక్టర్ కారుకు ప్రమాదం.
కంటైనర్‌ను ఢీకొన్న కారు.. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం.
సీటు బెల్టు ధరించడంతో సురక్షితంగా బయటపడ్డ ధార వేణుగోపాల్.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
నల్గొండ, సెప్టెంబర్ 28: భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్ ధార వేణుగోపాల్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి సమీపంలోని కామినేని ఆస్పత్రి వద్ద సోమవారం జరిగిన ఈ ఘటనలో ఆయన త్రుటిలో పెను ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. హైదరాబాద్ నుంచి కొత్తగూడెం వైపు అదనపు కలెక్టర్ వాహనం వెళ్తుండగా కామినేని ఫ్లైఓవర్‌పై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ముందుగా వెళ్తున్న కంటైనర్ లారీ ఒక్కసారిగా కుడివైపునకు రావడంతో వెనుక నుంచి వస్తున్న కారు అదుపుతప్పి కంటైనర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. ప్రమాద సమయంలో కారు ముందు సీటులో కూర్చున్న అదనపు కలెక్టర్ వేణుగోపాల్ సీటు బెల్టు ధరించి ఉండటంతో ఎలాంటి గాయాలు కాలేదు. ఆయన సురక్షితంగా బయటపడటంతో అధికారులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న నార్కట్‌పల్లి ఎస్సై కృష్ణమూర్తి వెంటనే సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గురైన వాహనాలను రహదారి నుంచి పక్కకు తరలించి ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు. అనంతరం అదనపు కలెక్టర్‌ను సురక్షితంగా కొత్తగూడెం వైపు పంపించారు. రహదారిపై వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.