Take a fresh look at your lifestyle.

సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి భట్టి విక్రమార్క సానుకూల స్పందన.

0 2

సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి సానుకూల స్పందన.
దసరాలోపు కీలక హామీల అమలుకు చర్యలు తీసుకుంటాం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
35 శాతం లాభాల వాటా నుంచి సొంతింటి పథకం వరకు 12 అంశాలపై చర్చ.
(ప్రజాలక్ష్యం ప్రత్యేక ప్రతినిధి)
హైదరాబాద్, సెప్టెంబర్ 28: సింగరేణి కార్మికుల సమస్యలు, ఎన్నికల సందర్భంగా కార్మికులకు ఇచ్చిన హామీల అమలు, సంస్థ భవిష్యత్ అభివృద్ధి తదితర అంశాలపై తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన సోమవారం రాత్రి వరకు ప్రగతి భవన్‌లో సమీక్ష సమావేశం జరిగింది. కార్మికుల సమస్యలపై ఐఎన్టీయూసీ ప్రతినిధులు చేసిన విజ్ఞప్తులపై ఉప ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందిస్తూ, దసరాలోపు పలు సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామితో పాటు కోల్‌బెల్ట్ ఎమ్మెల్యేలు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్, ప్రేమ్ సాగర్ రావు, గండ్ర సత్యనారాయణ రావు, గడ్డం వినోద్, మట్టా రాగమయి, పాయం వెంకటేశ్వర్లు, కోరెం కనకయ్య, రామదాసు, సాంబశివరావులతో పాటు ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ డా. జనక్ ప్రసాద్ పాల్గొన్నారు. సింగరేణి యాజమాన్యం తరఫున సీఎండీ బుద్ధప్రకాష్ జ్యోతి, డైరెక్టర్ పా. గౌతమ్ పోట్రు, డైరెక్టర్లు కొప్పుల వెంకటేశ్వర్లు, రాధాకృష్ణ, తిరుమల రావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ నాయకులు సింగరేణి కార్మికులకు సంబంధించిన పలు కీలక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికల సమయంలో కార్మికులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయడంతో పాటు కార్మికుల సంక్షేమం, ఉద్యోగ భద్రత, వైద్య సేవలు, సంస్థ ఆర్థిక పరిపుష్టికి సంబంధించిన అంశాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రధానంగా 2025–26 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థ ఆర్జించిన లాభాల్లో కార్మికులకు 35 శాతం లాభాల వాటాను ప్రకటించి, దసరా పండుగలోపు వారి ఖాతాల్లో జమ చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే కారుణ్య నియామకాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రతి నెలా మెడికల్ బోర్డులను నిర్వహించాలని కోరారు. సాధ్యమైనంత వరకు కార్మికులను మెడికల్ అన్ఫిట్ చేయకుండా చూడడంతో పాటు గతంలో నిర్వహించిన మెడికల్ బోర్డుల నిర్ణయాలను పునఃసమీక్షించి సంబంధిత కార్మికులకు మరో అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ముఖ్య హామీల్లో ఒకటైన కార్మికుల సొంత ఇంటి పథకాన్ని సాధ్యమైనంత త్వరగా అమలు చేయాలని కోరారు. అదేవిధంగా కోల్ ఇండియా తరహాలో సింగరేణి కార్మికులకు సంబంధించిన పెర్క్స్‌పై ఆదాయపు పన్ను మినహాయింపు కల్పించే అంశంపై దసరాలోపు నిర్ణయం తీసుకునేలా చర్యలు చేపట్టాలని కోరారు. అలియాస్ నేమ్స్ సమస్యపై ఇప్పటికే కమిటీ సమావేశం జరిగినందున, ఈ సమస్యను వన్‌టైమ్ సెటిల్‌మెంట్ ద్వారా మానవీయ కోణంలో పరిష్కరించాలని ఐఎన్టీయూసీ ప్రతినిధులు కోరారు. అలాగే పెండింగ్‌లో ఉన్న కోర్టు, విజిలెన్స్ కేసులను సమీక్షించి సాధ్యమైన మేరకు మానవీయ కోణంలో పరిష్కరించాలని, డిస్మిస్ అయిన కార్మికులకు కూడా నిబంధనల మేరకు మరో అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సింగరేణి సంస్థ భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొత్త బొగ్గు గనులను సంస్థకు కేటాయించేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. అదే సమయంలో టీఎస్ జెన్‌కో, ట్రాన్స్‌కో నుంచి సింగరేణికి రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బొగ్గు ఉత్పత్తితో పాటు సింగరేణి ఆధ్వర్యంలో ఇతర అనుబంధ పరిశ్రమలను ఏర్పాటు చేసి సంస్థ ఆదాయాన్ని, ఉపాధి అవకాశాలను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. వివిధ గనుల్లో డ్రిల్ బిట్స్, భద్రతా సామగ్రి, డంపర్ల స్పేర్ పార్ట్స్ తదితర అవసరమైన పరికరాల కొరతతో యంత్రాల వినియోగం సక్రమంగా జరగడం లేదని నాయకులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అవసరమైన సామగ్రిని వెంటనే సమకూర్చి ఉత్పత్తి, ఉత్పాదకతతో పాటు భద్రతా ప్రమాణాలను మెరుగుపరచాలని కోరారు. సింగరేణి ఆసుపత్రుల్లో వైద్యుల కొరతను కూడా సమావేశంలో ప్రస్తావించారు. ఇప్పటికే ఎంపికైన 33 మంది నూతన వైద్యులను వెంటనే విధుల్లోకి తీసుకుని కార్మికులు, వారి కుటుంబాలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని విజ్ఞప్తి చేశారు. సింగరేణి అధికారులకు సంబంధించిన పీఆర్‌పీ (పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే)ను కూడా వెంటనే విడుదల చేయాలని కోరారు. కార్మికుల సమస్యలను పరిష్కరించడంతో పాటు సింగరేణి సంస్థను మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రభుత్వం, యాజమాన్యం సమన్వయంతో పనిచేయాలని ఐఎన్టీయూసీ నాయకులు కోరారు. కార్మికులకు ఇచ్చిన హామీలను నిర్ణీత కాలపరిమితిలో అమలు చేయడం ద్వారా కార్మికుల్లో విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఐఎన్టీయూసీ ప్రతినిధుల విజ్ఞప్తులపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సానుకూలంగా స్పందిస్తూ, దసరాలోపు సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్మికుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందని ఆయన పేర్కొన్నట్లు ఐఎన్టీయూసీ వర్గాలు తెలిపాయి. అనంతరం ఐఎన్టీయూసీ ప్రతినిధుల బృందం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, సమావేశంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపింది. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి ఇదే విధమైన చొరవను కొనసాగించాలని కోరింది. ఈ సమావేశంలో ఐఎన్టీయూసీ నాయకులు నరసింహ రెడ్డి, ధర్మపురి, సమ్మయ్య, త్యాగరాజన్, శంకర్ రావు, వికాస్ కుమార్ యాదవ్, శేషా రత్నం, ఆల్బర్ట్, వడ్డేపల్లి దాస్, అక్రం, సత్యనారాయణ రెడ్డి, కోట రవీందర్ రెడ్డి, అక్బర్ అలీ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.