Take a fresh look at your lifestyle.

భూపాలపల్లిలో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి.

0 2

భూపాలపల్లిలో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి.

విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు.

ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ.. పేదలకు అన్నదానం.

(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్-భూపాలపల్లి, సెప్టెంబర్ 27: తెలంగాణ మలిదశ ఉద్యమ నేత, మాజీ మంత్రి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు ఎలగొండ రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా కేంద్రంలోని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనతో పాటు చేనేత రంగ అభివృద్ధి, వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. ప్రజా సమస్యలపై నిబద్ధతతో పోరాడిన ఆయన పదవులను సైతం త్యాగం చేసి నిరుపేదలు, చేనేత కార్మికుల హక్కుల కోసం ఉద్యమించారని గుర్తుచేశారు. బాపూజీ ఆశయాలు, సామాజిక సేవా స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.

సేవా కార్యక్రమాలు:

జయంతి సందర్భంగా పద్మశాలి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం మంజూరు నగర్‌లోని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం సమీపంలో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు ఎలగొండ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. వెనుకబడిన వర్గాల హక్కులు, చేనేత కార్మికుల సంక్షేమం కోసం ఆయన సాగించిన పోరాటాలు నేటికీ ఆదర్శప్రాయమని అన్నారు. బాపూజీ చూపిన మార్గంలో నడుస్తూ సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, కౌన్సిలర్ అప్పం కిషన్, కుర్మిల శ్రీనివాస్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు దాట్ల శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు, పద్మశాలి సంఘం నాయకులు అడ్డగట్ల శ్రీధర్, తౌటం ప్రభాకర్, గూట్ల తిరుపతి, భూపాలపల్లి పట్టణ అధ్యక్షుడు శేఖర్ నాని, వంగ కుమార్ స్వామి, క్యాతం మహేందర్, కూచన కిషన్ ప్రసాద్, కొలిపాక ప్రసాద్, బొద్దుల శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.