కాటారంలో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు.
దోమల నివారణే ధ్యేయంగా ప్రత్యేక చర్యలు : సర్పంచ్ పంతకాని సడవలి.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
కాటారం, సెప్టెంబర్ 30: ప్రజారోగ్య పరిరక్షణే లక్ష్యంగా జయశంకర్-భూపాలపల్లి జిల్లా కాటారం గ్రామపంచాయతీ పరిధిలో పారిశుద్ధ్య పనులను బుధవారం ముమ్మరంగా చేపట్టారు. సీజనల్ వ్యాధులు, దోమల ఉధృతి పెరిగే అవకాశాల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా సర్పంచ్ పంతకాని సడవలి ఆధ్వర్యంలో పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బందితో కలిసి గ్రామంలోని పలు వీధుల్లో విస్తృతంగా పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామంలోని వివిధ వార్డుల్లో మురుగు కాలువల్లో పేరుకుపోయిన పూడిక, చెత్తాచెదారాన్ని పారిశుద్ధ్య సిబ్బందితో తొలగించారు. నీరు నిల్వ ఉండే ప్రాంతాలు, మురుగు కాలువల పరిసరాల్లో బ్లీచింగ్ పౌడర్ను పిచికారీ చేయించారు. దోమల వ్యాప్తిని అరికట్టి ప్రజలు డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు సర్పంచ్ తెలిపారు. ఈ సందర్భంగా పంతకాని సడవలి మాట్లాడుతూ, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించగలమని పేర్కొన్నారు. ప్రజలు తమ ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు పారిశుద్ధ్య కార్మికులు నిరంతరం శ్రమిస్తున్నారని, వారి సేవలకు ప్రజలు సహకరించాలని సర్పంచ్ విజ్ఞప్తి చేశారు. పారిశుద్ధ్య నిర్వహణలో పంచాయతీ చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలు భాగస్వాములై పరిసరాల పరిశుభ్రతను కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కొండగొర్ల బానయ్య, వార్డు సభ్యులు కొండ రాజమల్లు, అక్కపాక మల్లయ్య, కొండ రాము, పసుల మొగిలి, రవి, స్థానిక నాయకులు, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.