Take a fresh look at your lifestyle.

బాలాజీ ఇంటిగ్రేటెడ్ స్కూల్‌లో ఘనంగా ముందస్తు వినాయక చవితి వేడుకలు.

0 7

బాలాజీ ఇంటిగ్రేటెడ్ స్కూల్‌లో ఘనంగా ముందస్తు వినాయక చవితి

మట్టి వినాయక విగ్రహాలనే పూజిద్దాం – రాజేంద్ర ప్రసాద్ రెడ్డి.

(ప్రజాలక్ష్యం ప్రతినిధి)

జయశంకర్-భూపాలపల్లి, సెప్టెంబర్ 11:పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను నివారించి, పర్యావరణహితమైన మట్టి వినాయక విగ్రహాలనే పూజించాలని బాలాజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఏ. రాజేంద్ర ప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చారు. భూపాలపల్లిలోని బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్‌లో శుక్రవారం ముందస్తు వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది కలిసి విఘ్నేశ్వరుడికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విద్యార్థులు గణపతి ప్రతిమలను పుష్పాలు, పత్రాలతో అందంగా అలంకరించి పూజించారు. సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని పండుగ వేడుకలను మరింత శోభాయమానం చేశారు. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించే పలు కార్యక్రమాలను విద్యార్థులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఏ. రాజేంద్ర ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. సహజ రంగులు, పత్రాలు, పూలతో పూజలు నిర్వహిస్తూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని సూచించారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించేందుకు పర్యావరణహితమైన వినాయక విగ్రహాలను వినియోగించడం అవసరమన్నారు. పాఠశాల ప్రిన్సిపాల్ రజినీకాంత్ మాట్లాడుతూ.. పండుగలు విద్యార్థులకు మన సంస్కృతి, సంప్రదాయాలను పరిచయం చేయడంతో పాటు ఐక్యత, భక్తి, పర్యావరణ బాధ్యత వంటి విలువలను పెంపొందిస్తాయని తెలిపారు. భక్తిభావం, సాంస్కృతిక సంప్రదాయాలు, పర్యావరణ స్పృహ కలబోసిన ఈ వేడుకలు విద్యార్థులను విశేషంగా ఆకట్టుకున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.