Take a fresh look at your lifestyle.

రామప్పకు సింగరేణి మైనింగ్‌తో ముప్పు అవాస్తవం : సింగరేణి యాజమాన్యం.

0 4

రామప్పకు సింగరేణి మైనింగ్‌తో ముప్పు అవాస్తవం.
సమగ్ర శాస్త్రీయ అధ్యయనం తర్వాతే మైనింగ్‌పై నిర్ణయం.
సింగరేణి యాజమాన్యం స్పష్టీకరణ.
(ప్రజాలక్ష్యం ప్రత్యేక ప్రతినిధి)
హైదరాబాద్, అక్టోబర్ 5: ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయానికి సింగరేణి మైనింగ్ కార్యకలాపాలతో ముప్పు పొంచి ఉందంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని సింగరేణి యాజమాన్యం స్పష్టం చేసింది. రామప్పకు ఎలాంటి నష్టం కలగకుండా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే వెంకటాపూర్ ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టుపై ముందుకు వెళ్తామని పేర్కొంది. ములుగు జిల్లా వెంకటాపూర్‌లో సింగరేణి ఆధ్వర్యంలో ప్రతిపాదించిన ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టుపై సమగ్ర శాస్త్రీయ అధ్యయనం నిర్వహించిన అనంతరం మాత్రమే తదుపరి నిర్ణయం తీసుకుంటామని యాజమాన్యం సోమవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. భారత పురావస్తు శాఖతో పాటు ఇతర ప్రతిష్టాత్మక శాస్త్రీయ సంస్థలు నిర్వహించే అధ్యయనాలు, వాటి నివేదికలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే ప్రాజెక్టుపై తదుపరి చర్యలు చేపడతామని వెల్లడించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థగా సింగరేణి రాష్ట్ర వారసత్వ సంపద పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని యాజమాన్యం పేర్కొంది. ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయానికి ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టం కలిగించే చర్యలకు పాల్పడబోమని స్పష్టం చేసింది. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ, చట్టబద్ధమైన మరియు పర్యావరణహితమైన మైనింగ్ కార్యకలాపాలకే సింగరేణి కట్టుబడి ఉంటుందని పునరుద్ఘాటించింది.

Leave A Reply

Your email address will not be published.