Take a fresh look at your lifestyle.

సింగరేణి లాభాల్లో 40 శాతం కార్మికులకు ఇవ్వాలి : ఏఐటియుసి అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ ఎం.డి. ఆసిఫ్ పాషా.

0 5

లాభాల్లో 40 శాతం కార్మికులకు ఇవ్వాలి.
సింగరేణి బకాయిలను వెంటనే చెల్లించాలి.
జెన్కో బకాయిల కోసం 9న హైదరాబాద్‌లో ముట్టడి.
ఏఐటియుసి అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ ఎం.డి. ఆసిఫ్ పాషా.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్-భూపాలపల్లి, అక్టోబర్ 5: సింగరేణి సంస్థకు ఈ ఏడాది వచ్చిన వాస్తవ లాభాలను వెంటనే ప్రకటించి, అందులో 40 శాతం వాటాను కార్మికులకు అందజేయాలని ఏఐటీయూసీ అనుబంధ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ ఎం.డి. ఆసిఫ్ పాషా డిమాండ్ చేశారు. సంస్థకు రావాల్సిన బకాయిలను ప్రభుత్వం, తెలంగాణ జెన్కో వెంటనే చెల్లించాలని కోరారు. కార్మికుల సమస్యలు, ఆర్థిక ప్రయోజనాలు, హక్కుల సాధన కోసం ఏఐటీయూసీ నిరంతరం పోరాడుతుందని తెలిపారు. సోమవారం భూపాలపల్లి ఏరియాలోని అన్ని గనులు, డిపార్ట్‌మెంట్లలో కార్మికుల సమస్యలపై ఏఐటీయూసీ ఆధ్వర్యంలో యాజమాన్యాలకు మెమోరాండాలు సమర్పించారు. ఇందులో భాగంగా కేటీకే-5 ఇన్‌క్లైన్ గని ఆవరణలో యాక్టింగ్ పిట్ సెక్రటరీ నల్ల సత్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గని మేనేజర్ మాచర్ల రమేష్‌కు కార్మికుల సమస్యలతో కూడిన మెమోరాండాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆసిఫ్ పాషా మాట్లాడుతూ, కోల్ ఇండియాలోని కార్మికులకు పీఎల్‌ఆర్ బోనస్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన నాలుగు జాతీయ కార్మిక సంఘాలకు, అందులో ప్రధాన పాత్ర పోషించిన ఏఐటీయూసీకి సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ తరఫున అభినందనలు తెలిపారు. పీఎల్‌ఆర్ బోనస్ అమలుకు కృషి చేసిన కీర్తిశేషులు కామ్రేడ్ టీ.బి. విటల్ రావు సేవలను గుర్తుచేశారు. రష్యా పర్యటన సందర్భంగా అక్కడి కార్మికులకు అమలవుతున్న బోనస్ విధానాన్ని పరిశీలించి, భారత కార్మికులకు కూడా బోనస్ అందేలా పార్లమెంటులో చట్టం తీసుకురావడానికి ఆయన కృషి చేశారని పేర్కొన్నారు. దీని ఫలితంగా సుమారు 1960 నుంచి బొగ్గు గని కార్మికులకు బోనస్ చట్టం అమల్లోకి వచ్చిందని, ప్రారంభంలో రూ.300గా ఉన్న బోనస్ ప్రస్తుతం 2025-26 సంవత్సరానికి రూ.1,10,250కు చేరిందని ఆసిఫ్ పాషా తెలిపారు. సంస్థకు లాభాలు వస్తే వాటిలో కార్మికులకు కూడా వాటా ఇవ్వాలనే డిమాండ్‌ను ఏఐటీయూసీ నిరంతరం ముందుకు తీసుకువస్తోందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో కామ్రేడ్ కె.ఎల్. మహేంద్ర సంస్థకు నష్టాలు వస్తే కార్మికుల వేతనాల్లో కోత విధించడం కాకుండా, లాభాలు వచ్చినప్పుడు కార్మికులకు వాటా ఇవ్వాలని డిమాండ్ చేసిన విషయాన్ని ఆసిఫ్ పాషా గుర్తుచేశారు. దీనిపై అప్పటి ముఖ్యమంత్రి సింగరేణికి లాభాలు వస్తే 10 శాతం లాభాలను కార్మికులకు వాటాగా ఇస్తామని ప్రకటించి, ఆ మేరకు చెల్లింపులు చేసిన విషయాన్ని పేర్కొన్నారు. కార్మికులకు ఆర్థిక ప్రయోజనాలు, బోనస్‌లు, లాభాల వాటా సాధించడంలో ఏఐటీయూసీ పోషించిన పాత్రను ఓర్వలేని కొన్ని సంఘాలు తమపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. కార్మిక ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న సంఘాల వైఖరిని కార్మికులు ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. సింగరేణి సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన సుమారు రూ.59 వేల కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని, ఈ ఏడాది సంస్థకు వచ్చిన వాస్తవ లాభాలను ప్రకటించి 40 శాతం వాటాను కార్మికులకు అందించాలని ఏఐటీయూసీ డిమాండ్ చేసింది. కార్మికులకు అవసరమైన రక్షణ పరికరాలు, పనిముట్లు, భద్రతా సామగ్రిని వెంటనే అందుబాటులో ఉంచాలని, తెలంగాణ జెన్కో నుంచి సింగరేణికి రావాల్సిన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కోరింది. జెన్కో బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 9న హైదరాబాద్‌లోని జెన్కో హెడ్ ఆఫీస్ ఎదుట సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ముట్టడి కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆసిఫ్ పాషా తెలిపారు. సింగరేణి కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని సంస్థకు రావాల్సిన బకాయిల సాధనతో పాటు సంస్థను మరింత లాభాల బాటలో నడిపించేందుకు తమ వంతు పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల్లో కేటికె.5 గనిలో మల్లికార్జున్, దోర్నాల తిరుపతి, నల్ల సత్తి, కొండపల్లి శ్రీను, జె. రాజు, బి. రాయమల్లు, ఎం. ప్రవీణ్, రమణ, సమ్మిరెడ్డి, నరేష్, రమేష్, రామచందర్ తదితరులతో పాటు పిట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కేటీకే-1 గనిలో జి. శ్రీనివాస్, పి. రవికుమార్, సదానందం, నరేష్, రాజారాం; కేటీకే-6లో పి. శ్రీనివాస్, గణేష్, తోడే రాజన్న, కె. కృష్ణమూర్తి; కేటీకే-8లో నూకల చంద్రమౌళి, ఎల్. శంకర్, జగత్ రావు, పి. కృష్ణ, కృష్ణారెడ్డి, ఎస్. శ్రీనివాస్; కేటీకే ఓసీపీలో తోట రామచందర్, సికిందర్ సింగ్; ఎస్‌అండ్‌పీసీ విభాగంలో సాంబయ్య; ఏరియా వర్క్‌షాప్‌లో దాసరి శ్రీనివాస్, కొమురయ్య పాల్గొన్నారు. అన్ని గనుల్లో ఏఐటీయూసీ నాయకులు, కార్యకర్తలు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.