Take a fresh look at your lifestyle.

సింగరేణి వాస్తవ లాభాలపై కార్మికులకు 36 శాతం వాటా ప్రకటించాలి : టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి డిమాండ్.

0 6

సింగరేణి వాస్తవ లాభాలపై కార్మికులకు 36 శాతం వాటా ప్రకటించాలి.

పన్నుల అనంతరం రూ.6 వేల కోట్లకు పైగా లాభం వచ్చే అవకాశం.                                           

దసరాలోపు వాటా ఎప్పుడు, ఎంత ఇస్తారో వెల్లడించాలి.

టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి డిమాండ్.

(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, అక్టోబర్ 5: సింగరేణి సంస్థ 2025–26 ఆర్థిక సంవత్సరంలో సాధించిన వాస్తవ నికర లాభాలను వెంటనే ప్రకటించి, పన్నులు చెల్లించిన అనంతరం మిగిలే లాభాల్లో కార్మికులకు 36 శాతం వాటాను చెల్లించాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. ప్రొవిజన్ పేరుతో సంస్థ అభివృద్ధి కోసం నిధులను పక్కన పెట్టకుండా, వాస్తవ లాభాల ఆధారంగా కార్మికులకు వాటా చెల్లించాలని కోరారు. ఆదివారం రాత్రి మీడియాకు విడుదల చేసిన వీడియో సందేశంలో మిర్యాల రాజిరెడ్డి మాట్లాడుతూ, 2025–26 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి 58 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించుకోగా, 62 మిలియన్ టన్నుల బొగ్గును డిస్పాచ్ చేసినట్లు తెలిపారు. అయితే ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోలేదనే కారణంతో ఈ ఏడాది లాభాలు ఎంత వస్తాయోనన్న ఆందోళన కార్మికుల్లో నెలకొందన్నారు. ప్రభుత్వం, యాజమాన్యం ఇప్పటివరకు వాస్తవ లాభాలను ప్రకటించకపోవడం ఆ ఆందోళనకు మరింత కారణమవుతోందని పేర్కొన్నారు. తనకు తెలిసిన సమాచారం మేరకు సింగరేణి గతంలో ఎన్నడూ సాధించని స్థాయిలో లాభాలను ఆర్జించినట్లు తెలుస్తోందని రాజిరెడ్డి అన్నారు. పన్నులు చెల్లించకముందు సుమారు రూ.8,500 కోట్ల లాభం వచ్చినట్లు అంచనా ఉందని, అందులో పావు వంతు మేర పన్నులు చెల్లించినా పన్నుల అనంతరం రూ.6 వేల కోట్లకు పైగా లాభం మిగిలే అవకాశం ఉందని తెలిపారు. గత రెండేళ్లలో కార్మికులకు లాభాల వాటా విషయంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ ఏడాదైనా వాస్తవ లాభాలపై 36 శాతం వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. బొగ్గు విక్రయాల ద్వారానే సుమారు రూ.7 వేల కోట్లకు పైగా లాభం వచ్చినట్లు తెలుస్తోందని ఆయన తెలిపారు. సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్‌లో 1,200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ద్వారా సుమారు రూ.500 కోట్ల వరకు లాభం వచ్చినట్లు పేర్కొన్నారు. ఇతర పెట్టుబడులు, వాటిపై వచ్చే వడ్డీలు తదితరాలను కలిపి మరో రూ.750 కోట్ల వరకు ఆదాయం లేదా లాభాలు వచ్చినట్లు తెలుస్తోందన్నారు. మొత్తం మీద పన్నుల రూపంలో రూ.2 వేల కోట్లకు పైగా చెల్లించినా సుమారు రూ.6 వేల కోట్లకు పైగా నికర లాభం వచ్చే అవకాశం ఉందని వివరించారు. ఈ నేపథ్యంలో పన్నుల అనంతరం వచ్చే వాస్తవ లాభాలపై 36 శాతం వాటాను కార్మికులకు చెల్లించాలని టీబీజీకేఎస్ డిమాండ్ చేస్తోందన్నారు. రేపు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కోల్‌బెల్ట్ ప్రజాప్రతినిధులతో పాటు సింగరేణి యాజమాన్యంతో సమావేశం జరగనున్నట్లు సమాచారం ఉందని తెలిపారు. ఆ సమావేశంలో సింగరేణి వాస్తవ నికర లాభాలను ప్రకటించడంతో పాటు కార్మికులకు ఎప్పుడు లాభాల వాటా చెల్లిస్తారు, ఎంత శాతం చెల్లిస్తారనే అంశాలపై స్పష్టత ఇవ్వాలని కోరారు. దీనివల్ల లాభాల వాటాపై ఆందోళనలో ఉన్న కార్మికులకు కొంత స్పష్టత లభిస్తుందని అన్నారు. సింగరేణిలో ఓఎంఎస్‌ (ఔట్‌పుట్‌ పర్‌ మ్యాన్‌ షిఫ్ట్‌) గణనీయంగా పెరగడం కూడా లాభాలు పెరగడానికి ప్రధాన కారణాల్లో ఒకటని రాజిరెడ్డి తెలిపారు. సింగరేణి వెబ్‌సైట్‌లో ఓఎంఎస్‌ 7.56గా నమోదైందని, గతంలో ఇది సుమారు 6.0 స్థాయిలో ఉండేదని పేర్కొన్నారు. ఒక్క కార్మికుడు ఒక్క షిఫ్ట్‌లో సగటున 7.5 టన్నులకు పైగా బొగ్గు ఉత్పత్తి చేయడం వల్ల ఉత్పాదకత పెరిగిందని వివరించారు. అదేవిధంగా సింగరేణిలో కార్మికుల సంఖ్య తగ్గడం కూడా మ్యాన్‌షిఫ్ట్‌లపై ప్రభావం చూపిందన్నారు. గైర్హాజరు కారణంగా కొందరిపై చర్యలు తీసుకోవడం, మెడికల్ బోర్డు లేకపోవడంతో పలువురు సిక్‌లిస్ట్‌లో ఉండటం, మానవ వనరుల తగ్గుదల తదితర కారణాలతో కార్మికుల సంఖ్య తగ్గిందని చెప్పారు. దీంతో మొత్తం మ్యాన్‌షిఫ్ట్‌లు తగ్గినప్పటికీ ఓఎంఎస్‌ పెరగడం వల్ల ఉత్పాదకత గణనీయంగా పెరిగిందని తెలిపారు. కాంట్రాక్ట్ కార్మికులకు గతంలో సుమారు రూ.5,500 చెల్లిస్తే ప్రస్తుతం రూ.6 వేల నుంచి రూ.7 వేల వరకు చెల్లిస్తున్నా, ఇతర వ్యయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత కూడా సింగరేణికి భారీ లాభాలు మిగిలే అవకాశం ఉందని రాజిరెడ్డి పేర్కొన్నారు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే సంస్థకు గతంతో పోలిస్తే గణనీయంగా అధిక లాభాలు వచ్చే పరిస్థితి ఉందని అన్నారు. కాబట్టి ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం ఎటువంటి జాప్యం చేయకుండా పన్నుల అనంతరం వచ్చిన వాస్తవ లాభాలను ప్రకటించి, వాటిపై 36 శాతం లాభాల వాటాను కార్మికులకు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రొవిజన్ పేరుతో సంస్థ అభివృద్ధి కోసం నిధులు కేటాయించి కార్మికుల లాభాల వాటాను తగ్గించవద్దని కోరారు.

Leave A Reply

Your email address will not be published.