
తొర్రికొండ రవికి ‘భారత్ కళా పురస్కార్–2026’
బెస్ట్ వెడ్డింగ్. ఫోటోగ్రాఫర్‌గా జాతీయ స్థాయి పురస్కారం.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
ఖమ్మం, అక్టోబర్ 5: ఫోటోగ్రఫీ రంగంలో విశేష ప్రతిభ కనబరుస్తూ, వివాహ వేడుకలు, సాంస్కృతిక కార్యక్రమాల్లోని అపురూప క్షణాలను తన కెమెరాలో అద్భుతంగా చిత్రీకరిస్తున్న ప్రముఖ ఫోటోగ్రాఫర్ తొర్రికొండ రవికి ప్రతిష్టాత్మక ‘భారత్ కళా పురస్కార్–2026’ లభించింది. బెస్ట్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ విభాగంలో ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. హైదరాబాద్‌లోని శంషాబాద్‌లో అక్టోబర్ 2, 3, 4 తేదీల్లో నిర్వహించిన ఫోటో ట్రేడ్ షో సందర్భంగా సిగ్మా ఫోటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా, ట్రేడ్ షో నిర్వాహకులు సంయుక్తంగా జాతీయ స్థాయి వెడ్డింగ్ ఫోటోగ్రఫీ పోటీలను నిర్వహించారు. దేశవ్యాప్తంగా పలువురు ఫోటోగ్రాఫర్లు పాల్గొన్న ఈ పోటీల్లో తొర్రికొండ రవి ప్రతిభను గుర్తించి పురస్కారానికి ఎంపిక చేశారు. అనంతరం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో నిర్వాహకులు, ఫోటోగ్రఫీ రంగ ప్రముఖుల చేతుల మీదుగా రవికి అవార్డును అందజేసి ఘనంగా సత్కరించారు. ఫోటోగ్రఫీ రంగంలో ఆయన అందిస్తున్న సేవలు, వినూత్న శైలి, నాణ్యమైన చిత్రీకరణను పరిగణనలోకి తీసుకుని ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. గత కొంతకాలంగా ఫోటోగ్రఫీ రంగంలో తనదైన శైలితో రాణిస్తున్న రవి, వివాహ వేడుకల్లోని భావోద్వేగాలు, ఆనంద క్షణాలను అత్యుత్తమ నాణ్యతతో చిత్రీకరిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ ఫోటోగ్రఫీలో నూతన ఒరవడికి కృషి చేస్తున్న ఆయనకు జాతీయ స్థాయి పురస్కారం దక్కడంపై కుటుంబ సభ్యులు, ఫోటోగ్రఫీ రంగ మిత్రులు, శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.