Take a fresh look at your lifestyle.

టి.ఎస్.యు.ఎస్. కార్యాలయ కూల్చివేత ప్రజాస్వామ్య హక్కులపై దాడి : పౌర హక్కుల సంఘం రాష్ట్ర నాయకులు.

0 2

టి.ఎస్.యు.ఎస్. కార్యాలయ కూల్చివేత ప్రజాస్వామ్య హక్కులపై దాడి.
కక్షపూరిత చర్యలను సహించేది లేదు.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.
తెలంగాణ పౌర హక్కుల సంఘం రాష్ట్ర నాయకులు.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్‌-భూపాలపల్లి, అక్టోబర్‌ 12: భూపాలపల్లిలో తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం (టిఎస్ యుఎస్) కార్యాలయాన్ని కూల్చివేయడాన్ని తెలంగాణ పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ గడ్డం లక్ష్మణ్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్క నారాయణరావు తీవ్రంగా ఖండించారు. కార్మిక సంఘాల పట్ల భిన్నాభిప్రాయాలు ఉన్నాయనే కారణంతో వాటి కార్యాలయాలను కూల్చివేయడం ప్రజాస్వామ్య హక్కులకు విఘాతం కలిగించడమేనని పేర్కొన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులను గుర్తించి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. భూపాలపల్లిలోని టి.ఎస్.యు.ఎస్. కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం పనిచేసే సంఘాల కార్యాలయాలను తొలగించడం ద్వారా వారి గొంతును నొక్కాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. కార్మిక సంఘాలకు తమ కార్యకలాపాలను స్వేచ్ఛగా నిర్వహించుకునే హక్కు ఉందని, ఆ హక్కులకు భంగం కలిగించే చర్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. ఈ ఘటనకు సంబంధించి స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, భూపాలపల్లి మున్సిపల్‌ చైర్మన్‌ కొమురయ్య గౌడ్‌ తమ బాధ్యతను స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజాప్రతినిధులు ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించాల్సింది పోయి, కార్మిక సంఘాల కార్యకలాపాలకు ఆటంకం కలిగించే చర్యలకు మద్దతు ఇస్తే ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రజాప్రతినిధులు వారి సంఘాల కార్యాలయాల విషయంలో వివాదాలకు తావివ్వడం సమంజసం కాదన్నారు. చట్టబద్ధమైన అనుమతులు, విధివిధానాలను పాటించకుండా కార్యాలయాన్ని కూల్చివేసి ఉంటే, ఆ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. రాజకీయ కక్షతో లేదా ఇతర కారణాలతో కార్మిక సంఘాల కార్యాలయాలపై చర్యలకు పాల్పడటం ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. సింగరేణి కార్మికులు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని, వారి హక్కులను కాపాడటం ప్రభుత్వంతోపాటు ప్రజాప్రతినిధుల బాధ్యత అని గుర్తుచేశారు. కార్మిక సంఘాల స్వేచ్ఛను హరించే ప్రయత్నాలను పౌర హక్కుల సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం కార్యాలయానికి సంబంధించిన ప్రహరీ గోడ కూల్చివేతపై సమగ్ర విచారణ జరిపించాలని, ఆ చర్యకు అవసరమైన చట్టబద్ధమైన అనుమతులు ఉన్నాయా లేదా అన్నది తేల్చాలని వారు డిమాండ్‌ చేశారు. ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి చర్యలు తీసుకోవడంతోపాటు, కార్యాలయానికి జరిగిన నష్టంపై విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు. భవిష్యత్తులో కార్మిక సంఘాల హక్కులకు భంగం కలగకుండా ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. కార్మికుల గొంతును నొక్కే ప్రయత్నాలను ప్రజాస్వామ్య శక్తులు చూస్తూ ఊరుకోవని, వారి హక్కుల పరిరక్షణ కోసం పౌర హక్కుల సంఘం నిరంతరం పోరాడుతుందని నాయకులు స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో పౌర హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు పాని, తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకుడు రాదండి దేవేందర్‌, తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిట్టపల్లి కుమారస్వామి, రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నీరేటి రాజన్న, తెలంగాణ ప్రజా ఫ్రంట్‌ జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్‌, అసంఘటిత కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు ఐత బాబు, పార్వతక్క, తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం నాయకులు దాసరి జనార్ధన్‌, జైపాల్‌ సింగ్‌, గోడిసెల శ్రీహరి, నామల శ్రీనివాస్‌ తదితర ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.