
సింగరేణి అధికారులకు పీఆర్పీ వెంటనే చెల్లించాలి.
సీఎంఓఏఐ రిలే నిరాహార దీక్షకు బీఎంఎస్ మద్దతు.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
భద్రాద్రి-కొత్తగూడెం, జూలై 2: సింగరేణి అధికారులకు చెల్లించాల్సిన పనితీరు ఆధారిత ప్రోత్సాహక వేతనం (పీఆర్పీ) బకాయిలను తక్షణమే విడుదల చేయాలని సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ (ఎస్సీఎంకేఎస్–బీఎంఎస్) డిమాండ్ చేసింది. ఈ మేరకు సీఎంఓఏఐ ఆధ్వర్యంలో కొత్తగూడెంలో కొనసాగుతున్న అధికారుల రిలే నిరాహార దీక్షకు బీఎంఎస్ నాయకులు గురువారం సంఘీభావం ప్రకటించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా అఖిల భారత ఖని మజ్దూర్ సంఘ్ (ఏబీకేఎంఎస్) జాతీయ కార్యదర్శి, నేషనల్ డస్ట్ ప్రివెన్షన్ కమిటీ సభ్యుడు పి. మాధవ నాయక్, ఎస్సీఎంకేఎస్–బీఎంఎస్ అధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్ మాట్లాడుతూ, సింగరేణి అధికారుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం సానుకూల దృక్పథంతో పరిశీలించి వెంటనే పరిష్కరించాలని కోరారు. పీఆర్పీ అంశాన్ని రాజకీయాలకు అతీతంగా పరిగణించి త్వరితగతిన పరిష్కారం చూపాలని సూచించారు. ఇప్పటికే పలు కార్మిక సంఘాలు అధికారుల పోరాటానికి మద్దతు ప్రకటించాయని, ఇటీవల సింగరేణి సీఎండీ, డైరెక్టర్లతో జరిగిన సమావేశంలో కూడా పీఆర్పీ సమస్యపై సుదీర్ఘంగా చర్చించినప్పటికీ, ప్రభుత్వం వైపు బాధ్యతను మళ్లిస్తూ యాజమాన్యం వ్యవహరించడం సరికాదని విమర్శించారు. అధికారులకు పీఆర్పీ చెల్లించడంలో ఎలాంటి సాంకేతిక లేదా పరిపాలనా పరమైన అడ్డంకులు లేవని పేర్కొన్న వారు, ప్రభుత్వం, యాజమాన్యం సానుకూలంగా స్పందించి సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరారు. సింగరేణి అభివృద్ధి, ఉత్పత్తి లక్ష్యాల సాధనలో అధికారులు కీలక పాత్ర పోషిస్తున్నందున, వారికి రావాల్సిన పీఆర్పీ బకాయిలను ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జి.వి. కృష్ణారెడ్డి, టి.ఎస్. పవన్ కుమార్, అజ్మీర వెంకటేశ్వర్లు, బి. రాంసింగ్, మొగిలిపాక రవి, నర్సింగరావు, నరేష్, బాలకృష్ణ, శ్రవణ్ కుమార్, ఎ. మోహన్ తదితరులు పాల్గొన్నారు.