సింగరేణిలో రాజకీయ జోక్యం, అవినీతికి ముగింపు పలకాలి : అప్పాని శ్రీనివాస్. భూపాలపల్లి ఏరియాలో ఎస్సీఎంకేఎస్–బీఎంఎస్‌లోకి భారీగా కార్మికుల చేరిక.


భూపాలపల్లి ఏరియాలో ఎస్సీఎంకేఎస్–బీఎంఎస్‌లోకి భారీగా కార్మికుల చేరిక.
సింగరేణిలో రాజకీయ జోక్యం, అవినీతికి ముగింపు పలకాలి.
సంస్థ పరిరక్షణకు కార్మికులంతా ఐక్యంగా నిలవాలి: అప్పాని శ్రీనివాస్
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్-భూపాలపల్లి, అక్టోబర్ 12: సింగరేణి సంస్థ పరిరక్షణ, కార్మికుల హక్కుల సాధన, ఉద్యోగ భద్రతే లక్ష్యంగా పనిచేస్తున్న సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ (ఎస్సీఎంకేఎస్–బీఎంఎస్)లో భూపాలపల్లి ఏరియాకు చెందిన పలువురు కార్మికులు చేరారు. ఆదివారం రాత్రి స్థానిక బిఎంఎస్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కేటీకే-1 ఇంక్లైన్, వర్క్‌షాప్‌లో పనిచేస్తున్న 11 మంది కార్మికులు యూనియన్‌లో చేరగా, సంఘం అధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్, ఏరియా ఉపాధ్యక్షుడు వెలబోయిన సుజెందర్ వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. కేటీకే-1 ఇంక్లైన్ బ్రాంచి కార్యదర్శి రాసకట్ల నర్సింగరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అప్పాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. సింగరేణి సంస్థ భవిష్యత్తును, కార్మికుల ప్రయోజనాలను కాపాడాలంటే కార్మికులంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. యూనియన్‌ను బలోపేతం చేయడం ద్వారా కార్మికుల సమస్యల పరిష్కారం కోసం మరింత సమర్థవంతంగా పోరాడవచ్చని పేర్కొన్నారు. కార్మికుల ఓట్లతో గుర్తింపు, ప్రాతినిధ్య హోదాలు పొందిన సంఘాలు వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని శ్రీనివాస్ అన్నారు. కార్మికుల ఇబ్బందులను పరిష్కరించాల్సిన సంఘాలు అందుకు బదులుగా పైరవీలకే పరిమితమవుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. సింగరేణిలో రాజకీయ జోక్యానికి, అవినీతి ఆరోపణలకు తావులేకుండా పారదర్శక పాలన సాగాలని, కార్మికుల హక్కులు, ఉద్యోగ భద్రత, సంక్షేమానికి పెద్దపీట వేయాలని డిమాండ్ చేశారు. సింగరేణి అభివృద్ధికి నూతన బొగ్గు ప్రాజెక్టులను సాధించడంతోపాటు సంస్థ ఆర్థిక ప్రయోజనాలను పరిరక్షించే చర్యలు చేపట్టాలని కోరారు. సంస్థను కాపాడుకోవడం, కార్మికుల ఉద్యోగ భవిష్యత్తుకు భరోసా కల్పించడం అందరి బాధ్యతని స్పష్టం చేశారు. కార్మికుల హక్కుల సాధన, ఉద్యోగ భద్రత, సంక్షేమం కోసం ఎస్సీఎంకేఎస్–బీఎంఎస్ రాజీలేని పోరాటం కొనసాగిస్తుందని నూతనంగా చేరిన కార్మికులకు హామీ ఇచ్చారు. యూనియన్ బలోపేతానికి ప్రతి కార్మికుడు సహకరించాలని పిలుపునిచ్చారు. యూనియన్‌లో చేరిన వారిలో బోయిన మల్లికార్జున్, బోలో వెంకటేశ్వర్లు, దీపు (ఎస్‌డీఎల్ ఆపరేటర్లు), టి. సత్తయ్య, సీహెచ్. శ్రీకాంత్, పి. దిలీప్, మోసం ప్రశాంత్, ఎండీ. తాజోద్దీన్, దేవులాల్, మండ మల్లేష్ (జనరల్ అసిస్టెంట్లు), సునీల్ (వర్క్‌షాప్ టర్నర్) ఉన్నారు. ఈ కార్యక్రమంలో రాసకట్ల నర్సింగరావు, పండ్రాల మల్లేష్, సట్కూరి శ్రీనివాస్, ఒరం లక్ష్మణ్, ఆడప రాజు, రఘుపతి రెడ్డి, శ్రీరాములు, భాస్కర్, రాజునాయక్, తాండ్ర మొగిలి, దాసరి ఓదెలు, సాగర్ తదితర కార్మికులు, యూనియన్ కార్యకర్తలు పాల్గొన్నారు.