బాల్కొండ మండలంలో జిల్లా వ్యవసాయ అధికారి పర్యటన

బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, సెప్టెంబర్ 25 (లోకంతీరు) : రైతులు మేలైన యాజమాన్య పద్ధతులు పాటించడం వల్ల అద్భుతమైన పంట దిగుబడులను సాధించవచ్చు అని జిల్లా వ్యవసాయ అధికారి వాజిద్ హుస్సేన్ తెలిపారు. బుధవారం రోజున బాల్కొండ మండల వ్యవసాయ అధికారి లావణ్య మరియు వ్యవసాయ విస్తరణ అధికారిని నిహారికతో కలిసి బాల్కొండ మండల పరిధిలోని బోదేపల్లి లో వివిధ పంట క్షేత్రాలను పరిశీలించారు. రైతులు తాము సాగు చేస్తున్న పంటలను ప్రతిరోజు విధిగా పరిశీలిస్తూ ఉండాలనీ, ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితుల వల్ల వరిలో బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు, అగ్గి తెగులు, మరియు సుడిదోమ ఉధృతి ఎక్కువగా అయినట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు వ్యవసాయ శాఖ అధికారులు కలిసి మండలాల వారీగా పంట పొలాలను పరిశీలిస్తూ ఆయా మండలాల్లో ఎక్కువగా వస్తున్న చీడపీడల యాజమాన్యం పై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నట్టుగా వివరించారు. బాల్కొండ మండలంలో ప్రస్తుతం వరిలో బాక్టీరియా ఆకు ఎండు తెగులు, అగ్గి తెగులు సుడిదోమ తదితర చీడపీడలను గమనించినట్టుగా తెలిపారు. పంటలపై సోకే తెగుళ్లను కానీ, చీద పీడలను కానీ వాటి తొలిదశలోనే గుర్తించడం వల్ల పటిష్టమైన నివారణ చర్యలు తీసుకోవడానికి వీలుంటుంది అని ఈ సందర్భంగా రైతులకు సూచించారు. డీఏవో వెంట మండల వ్యవసాయ అధికారి లావణ్య, వ్యవసాయ విస్తరణ అధికారి నిహారిక మరియు రైతులు ఉన్నారు.