Take a fresh look at your lifestyle.

సింగరేణి కార్మిక సమస్యల హామీల అమలుకు ప్రభుత్వం సానుకూలం: ఐఎన్టీయూసీ.

0 2

సింగరేణి కార్మికులకు శుభవార్త.. హామీల అమలుకు ప్రభుత్వం సానుకూలం.
లాభాల వాటా ప్రకటన, సొంతింటి పథకం, మెడికల్‌ బోర్డుల ఏర్పాటుపై ముందడుగు.
ఐఎన్‌టీయూసీ నాయకులు బేతల్లి మధుకర్‌రెడ్డి, పసునూటి రాజేందర్‌, జోగు బుచ్చయ్య.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్‌-భూపాలపల్లి, అక్టోబర్‌ 12: సింగరేణి కార్మికుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంతోపాటు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం సానుకూలంగా స్పందించాయని ఐఎన్‌టీయూసీ భూపాలపల్లి ఏరియా వైస్ ప్రెసిడెంట్ బేతల్లి మధుకర్‌రెడ్డి, కేంద్ర నాయకులు పసునూటి రాజేందర్‌, జోగు బుచ్చయ్య తెలిపారు. ఈ నెల 15వ తేదీలోపు కార్మికుల లాభాల వాటాను ప్రకటించి, వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసేలా చర్యలు తీసుకుంటున్నారని వెల్లడించారు. సోమవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఐఎన్‌టీయూసీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఐఎన్‌టీయూసీ జాతీయ అధ్యక్షుడు జి. సంజీవరెడ్డి నాయకత్వంలో, సెక్రటరీ జనరల్‌ డాక్టర్‌ జనక్‌ ప్రసాద్‌ ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యంతో జరిపిన చర్చల ఫలితంగా కార్మికుల సమస్యల పరిష్కారానికి పలు అంశాల్లో ముందడుగు పడిందని పేర్కొన్నారు.
ప్రతి నెలా ఏరియా ఆసుపత్రుల్లో మెడికల్‌ బోర్డులు ఏర్పాటు చేసి, అర్హులైన కార్మికులకు వైద్యపరమైన అనర్హత ప్రక్రియను వేగంగా పూర్తి చేసేలా ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. ఎన్నికల హామీల్లో భాగంగా కార్మికులకు సొంతింటి పథకాన్ని త్వరలో ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని వెల్లడించారు. కోల్‌ ఇండియా తరహాలో సింగరేణి కార్మికులకు చెల్లించే పర్క్స్‌పై కూడా ఆదాయపు పన్ను మినహాయింపు కల్పించే అంశంపై ఈ ఏడాదిలోనే నిర్ణయం తీసుకునేలా కృషి చేస్తున్నారని చెప్పారు. కార్మికుల పేర్లలో వ్యత్యాసాలకు సంబంధించిన సమస్య పరిష్కారానికి ఇప్పటికే కమిటీ సమావేశం పూర్తయిందని, నవంబర్‌ నాటికి వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ విధానంలో మానవీయ కోణంతో పరిష్కరించే అవకాశం ఉందని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న కోర్టు, విజిలెన్స్‌ కేసులను సమీక్షించి, అర్హతలు, నిబంధనల మేరకు మానవీయ దృక్పథంతో పరిష్కరించాలని కోరారు. కోవిడ్‌ సమయంలో విధుల నుంచి తొలగించబడిన కార్మికులకు మరో అవకాశం కల్పించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. సింగరేణి భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని కొత్త బొగ్గు గనులను కేటాయించాలని ఐఎన్‌టీయూసీ నాయకులు కోరారు. తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్‌కో నుంచి సింగరేణికి రావాల్సిన బకాయిలను త్వరితగతిన చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బొగ్గు ఉత్పత్తికే పరిమితం కాకుండా అనుబంధ పరిశ్రమలను ఏర్పాటు చేయడం ద్వారా సంస్థ ఆదాయాన్ని పెంచడంతోపాటు కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించాలని సూచించారు. గనుల్లో డ్రిల్‌ బిట్స్‌, భద్రతా పరికరాల కొరతను తక్షణమే అధిగమించి కార్మికుల భద్రతా ప్రమాణాలను మెరుగుపరచాలని డిమాండ్‌ చేశారు. అధికారులకు సంబంధించిన పనితీరు ఆధారిత వేతనాన్ని (పర్ఫార్మెన్స్‌ రిలేటెడ్‌ పే) త్వరగా విడుదల చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్మికుల సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణ, సంస్థ అభివృద్ధి విషయంలో ప్రభుత్వం, యాజమాన్యం ఇచ్చిన హామీలను కార్యరూపంలోకి తీసుకురావాలని వారు కోరారు. ఇంకా ఈ సమావేశంలో ఐఎన్‌టీయూసీ బ్రాంచి నాయకులు బొడ్డు అశోక్‌, నాయకులు శంకర్‌, రవి కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.