రామగుండంలో అభివృద్ధి లేదు..అంతా విధ్వంసమే!
బీఆర్ఎస్ హయాంలోనే సింగరేణి అభివృద్ధి.
టీబీజీకేఎస్ తోనే కార్మిక సంక్షేమం.
కార్మిక గర్జనతో కాంగ్రెస్లో వణుకు.
టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని టౌన్, అక్టోబర్ 17:తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనలో..టీబీజీకేఎస్ గుర్తింపు సంఘంగా ఉన్న పదకొండున్నరేళ్ళ కాలంలోనే సింగరేణి సంస్థ అభివృద్ధి, సంక్షేమం వైపు నడిచిందని టీబీజీకేఎస్ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి అన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రామ్మూర్తితో కలిసి రాజిరెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దేశంలో ఏ బొగ్గు పరిశ్రమ కూడా ఇంతగా అభివృద్ధి చెందలేదని స్పష్టం చేశారు. సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తిని 70 మిలియన్ టన్నులకు చేర్చామని తెలిపారు. దేశంలో ఏ బొగ్గు పరిశ్రమలో కూడా వారసత్వ ఉద్యోగాలు లేవని, కానీ మన సింగరేణిలో జాతీయ సంఘాలు పోగొట్టిన వారసత్వ ఉద్యోగాలను, కారుణ్య నియామకాల పేరిట తీసుకురావడం జరిగిందని గుర్తు చేసారు. సింగరేణిలో 113 మెడికల్ బోర్డులను పెట్టి 13,400.మంది యువ కార్మికులకు ఉద్యోగాలను ఇచ్చిన చరిత్ర బీఆర్ఎస్, టీబీజీకేఎస్ లదని అన్నారు. మారుపేర్ల కార్మికులకు కూడా ఉద్యోగాలను ఇప్పించామని, కాని దాదాపు 150 మందికి మాత్రమే కొన్ని కాంప్లికేటేడ్ కారణాలతో ఆగిపోయాయని వెల్లడించారు. ఇటీవల జరిగిన సింగరేణి కార్మిక గర్జన, కేటీఆర్ బహిరంగ సభకు సింగరేణి నలుమూలల నుండి తరలివచ్చిన కార్మికవర్గాన్ని చూసి కాంగ్రెస్ పార్టీ నాయకుల వెన్నులో వణుకు పుట్టిందని, అందుకే అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. మాట్లాడితే రామగుండంలో అభివృద్ధి జరిగిందంటూ గొప్పలు చెబుతున్నారని, రామగుండంలో అభివృద్ధి జరుగలేదని, ఇప్పటివరకు విధ్వంసం మాత్రమే జరిగిందన్నారు. కేటీఆర్ సింగరేణి కార్మిక గర్జనతో కోల్ బెల్ట్ ప్రాంతమంతా రామగుండం విధ్వంసాన్ని చూసారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కార్మికవర్గానికి ఉన్న ఆక్రోశం మొన్నటి సభతో తేటతెల్లమయ్యిందని, అందుకే కాంగ్రెస్ పార్టీకి మింగుడు పడడం లేదన్నారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అడ్డగోలు మాటలు మాట్లాడడం మానుకోవాలని హితవుపలికారు. ఇంకా ఈ మీడియా సమావేశంలో టీబీజీకేఎస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నూనె కొమురయ్య, కోశాధికారి చెల్పూరి సతీష్, నాయకులు పోలాడి శ్రీనివాస్ రావు, వాసర్ల జోసఫ్, చంద్రు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.