సింగరేణి భవిష్యత్తుకు మన శ్రమే పునాది.
కార్మిక సంక్షేమం, సంస్థ విస్తరణే ప్రజా ప్రభుత్వ లక్ష్యం.
సింగరేణి కార్మికులు, ఉద్యోగులకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పండుగ శుభాకాంక్షల లేఖ.
(ప్రజాలక్ష్యం ప్రత్యేక ప్రతినిధి)
హైదరాబాద్, అక్టోబర్ 17: సింగరేణి భవిష్యత్తుకు కార్మికులు, ఉద్యోగుల శ్రమే పునాది అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బతుకమ్మ, దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకుని సింగరేణి కార్మికులు, ఉద్యోగులు, అధికారులు, కార్మిక సంఘాల ప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ శనివారం ఆయన ప్రత్యేక లేఖ విడుదల చేశారు. సింగరేణి సంస్థను మరింత బలోపేతం చేయడంతోపాటు కార్మిక సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ, కొత్త గనుల సాధన, థర్మల్, సౌర విద్యుత్ రంగాల్లో విస్తరణకు ప్రజా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. మారుతున్న బొగ్గు మార్కెట్లో పోటీని సమర్థంగా ఎదుర్కొంటూ సంస్థను అభివృద్ధి పథంలో నడిపించేందుకు కార్మికులు, ఉద్యోగులు, అధికారులు, యాజమాన్యం సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. భూగర్భ, ఉపరితల గనుల్లో ఎన్నో కఠిన పరిస్థితులను ఎదుర్కొంటూ కార్మికులు వెలికితీసే బొగ్గు రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీర్చడంతోపాటు తెలంగాణ అభివృద్ధికి చోదక శక్తిగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఎల్‌నినో వంటి వాతావరణ సవాళ్ల నేపథ్యంలో విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరాలో అంతరాయం కలగకుండా మరింత బాధ్యతతో విధులు నిర్వహించాలని సూచించారు. ఇతర బొగ్గు సంస్థలతో పోటీపడాలంటే నాణ్యమైన బొగ్గును సరసమైన ధరకు అందించడం, ఉత్పాదకతను పెంచడం, అనవసర ఖర్చులను తగ్గించడం అత్యవసరమని భట్టి విక్రమార్క అన్నారు. యంత్రాలను పూర్తి పని గంటలు సమర్థంగా వినియోగించుకుంటూ ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలని సూచించారు. అయితే, ఉత్పత్తి పెంపు క్రమంలో భద్రత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడకూడదని స్పష్టం చేశారు. ప్రతి కార్మికుడు సురక్షితంగా విధులు ముగించుకుని ఇంటికి చేరడమే అత్యంత ముఖ్యమైన విజయమని పేర్కొన్నారు. 137 ఏళ్ల చరిత్ర కలిగిన సింగరేణి సంస్థను భావితరాలకు మరింత పటిష్టంగా అందించేందుకు కొత్త బొగ్గు గనుల సాధనకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ఒడిశాలోని నైనీ బొగ్గు గనికి అవసరమైన అనుమతులు సాధించి ఉత్పత్తిని ప్రారంభించామని, తాడిచెర్ల-2 బ్లాక్‌కు మైనింగ్ లీజు పొందామని వివరించారు. మణుగూరులోని ప్రకాశం ఖని ఓపెన్‌కాస్ట్-2 డిప్‌సైడ్ బ్లాక్‌ను వేలం ద్వారా దక్కించుకున్నామని, సత్తుపల్లి-3, కోయగూడెం-3 బ్లాక్‌లను తిరిగి సాధించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని తెలిపారు. బొగ్గు రంగంతోపాటు విద్యుత్, పునరుత్పాదక ఇంధనం, బంగారం, రాగి తదితర కీలక ఖనిజాల రంగాల్లోనూ సింగరేణి కార్యకలాపాలను విస్తరించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. కార్మికుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ఇటీవల నిర్వహించిన సమీక్షలో పలు కీలక ఆదేశాలు ఇచ్చినట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. పెండింగ్‌లో ఉన్న సుమారు 250 నుంచి 300 డిపెండెంట్ ఉద్యోగ నియామకాలను వేగవంతం చేయాలని, మారు పేర్లకు సంబంధించిన సమస్యలను మానవీయ కోణంలో పరిశీలించాలని సూచించినట్లు తెలిపారు. సింగరేణి భూముల్లో అర్హులకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయడంతోపాటు కార్మికుల సొంతింటి కలను నెరవేర్చేందుకు నెహ్రూ హౌసింగ్ కాలనీల ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించినట్లు వివరించారు. శిథిలావస్థకు చేరిన కార్మిక క్వార్టర్ల స్థానంలో కొత్త నివాసాల నిర్మాణం, కార్మిక కాలనీల అభివృద్ధి, ఏరియా ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు, క్యాథ్ ల్యాబ్ సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు. ప్రతి ఆరు నెలలకోసారి కార్మికులకు సేఫ్టీ కిట్లు పంపిణీ చేయాలని, పెర్క్స్, అలవెన్సులపై ఆదాయపు పన్నుకు సంబంధించి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని యాజమాన్యానికి సూచించినట్లు పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సాధించిన రూ.1,754 కోట్ల నికర లాభాల్లో 34 శాతం వాటా, అంటే సుమారు రూ.596 కోట్లను కార్మికులకు లాభాల వాటా బోనస్‌గా పంపిణీ చేసినట్లు ఉప ముఖ్యమంత్రి తెలిపారు. అర్హులైన ప్రతి రెగ్యులర్ ఉద్యోగికి సగటున రూ.1,53,912 చెల్లించగా, కాంట్రాక్టు కార్మికులకు ఒక్కొక్కరికి రూ.5,500 అందించినట్లు వివరించారు. సంస్థ లాభాల్లో కార్మికులకు వాటా కల్పించడం వారి కష్టానికి, శ్రమకు ఇచ్చే గుర్తింపుగా అభివర్ణించారు. సింగరేణి విస్తరణకు అవసరమైన చర్యలు తీసుకోవడం ప్రభుత్వ బాధ్యత కాగా, సంస్థను శ్రమతో, ఐక్యతతో మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం కార్మికులు, ఉద్యోగుల బాధ్యత అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. పూర్వీకులు కష్టపడి నిర్మించిన ఈ బొగ్గు సంస్థను కాపాడుకుంటూ, మరింత అభివృద్ధి చేసి భావితరాలకు అందించడం అందరి ఉమ్మడి బాధ్యతగా గుర్తించాలని ఆయన పిలుపునిచ్చారు. సింగరేణి కార్మికులు, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు పండుగలను సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.