ఏఐటీయూసీ చేసుకున్న ఒప్పంద పత్రాలు బయటపెట్టాలి.
డ్రైవర్లు, ఈపీ ఆపరేటర్ల సమస్యలను పరిష్కరించాలి.
ఎన్నికలతో మాకు సంబంధం లేదు.. కార్మికుల సమస్యల పరిష్కారమే లక్ష్యం.
అసోసియేషన్ కేంద్ర అధ్యక్షులు కట్కూరి శ్రీనివాసరెడ్డి.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని టౌన్, సెప్టెంబర్ 12:కేంద్ర కార్మిక శాఖ అధికారుల (ఆర్ఎల్సీ) సమక్షంలో సింగరేణి యాజమాన్యం, గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ మధ్య ఇటీవల జరిగిన చర్చల్లో కుదిరిన ఒప్పంద పత్రాలను కార్మికుల ముందు బహిర్గతం చేయాలని సింగరేణి డ్రైవర్స్, ఈపీ ఆపరేటర్స్ అండ్ యూజీ ఆల్ ట్రేడ్ వర్కర్స్ అసోసియేషన్ కేంద్ర అధ్యక్షుడు కట్కూరి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. శనివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 23 డిమాండ్లను సాధించామని, ఇది చరిత్రాత్మక ఒప్పందమని ఏఐటీయూసీ నాయకులు గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారని, అదే నిజమైతే ఒప్పందం కాపీని ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. ఏడాది క్రితం జరిగిన ఒప్పందాల్లోనే అనేక అంశాలు అమలు కాలేదని, ఇటీవల ఆర్ఎల్సీ సమక్షంలో చర్చలు జరిగి సుమారు 20 రోజులు గడిచినా స్పష్టమైన అమలు కనిపించడం లేదన్నారు. కార్మికులను అయోమయానికి గురిచేయడం సరికాదని, దాన్ని ఎన్నికల స్టంట్ గా కొట్టిపారేసారు. డ్రైవర్లు, ఈపీ ఆపరేటర్ల సమస్యలపై గుర్తింపు సంఘానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. సూటబుల్ జాబ్ సమస్యపై నాలుగేళ్ల క్రితం కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పినా నేటికీ నివేదిక వెల్లడించలేదన్నారు. డీ నుంచి సీ గ్రేడ్‌కు వన్‌టైం ప్రమోషన్ ఇచ్చిన తర్వాత తదుపరి ప్రమోషన్లపై పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గత 20 ఏళ్లుగా అర్హత, పని చేస్తున్న యంత్రాల ఆధారంగా గ్రేడ్లు కల్పించే విధానం సక్రమంగా అమలు కావడం లేదన్నారు. గతంలో 1992-98 మధ్య కాలంలో యూనిఫాం, షూస్, వాటర్ అలవెన్స్ తదితర డిమాండ్లను ఆపరేటర్లే స్వయంగా పోరాడి సాధించుకున్నామని గుర్తుచేశారు. సమ్మెలో ఓపెన్ కాస్ట్ లు కీలకం కనుక ఆపరేటర్ల అవసరం గుర్తుకు వస్తుందే కాని, సమస్యల పరిష్కారంలో ఏ యూనియన్ కూ తామెందుకు గుర్తుకు రావడం లేదని ప్రశ్నించారు. సింగరేణిలో సుమారు ఆరు వేల మంది డ్రైవర్లు, ఈపీ ఆపరేటర్లు ఉన్నారని, వారి న్యాయమైన గ్రేడ్లు, ప్రమోషన్లు, ఇతర సమస్యల పరిష్కారం కోసం తమ అసోసియేషన్ పోరాడుతుందని స్పష్టం చేశారు. మెడికల్ బోర్డు అంటూ పెడుతున్నారే గాని ఎంతమందిని మెడికల్ ఇన్వాలిడేషన్ చేస్తున్నారో చెప్పాలని నిలదీసారు. సొంత ఇంటి కల కలగానే మిగిలిపోతోందన్నారు. గుర్తింపు సంఘం కాలపరిమితి పూర్తయినందున వెంటనే ఎన్నికలు నిర్వహించాలని, ఎన్నికలు నిర్వహించకపోతే అర్హత ఉన్న అన్ని సంఘాలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని యాజమాన్యం, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమకు ఎన్నికల కంటే కార్మికుల సమస్యల పరిష్కారమే ముఖ్యమని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఇంకా ఈ విలేకరుల సమావేశంలో అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ్ మోహన్, ఉపాధ్యక్షులు కోల కనకయ్య, ప్రధాన కార్యదర్శి ఉదయ్ కుమార్, ఉప ప్రధాన కార్యదర్శి ఉల్లి రాజమొగిలి, కోశాధికారి కూచన అశోక్, కార్యదర్శి రామ్మోహన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ కట్కూరి రవీందర్ రెడ్డి, మీడియా ఇంచార్జి సాయి మణిదీప్ తదితరులు పాల్గొన్నారు.