వెన్ను చూపని మన్నెం వీరుడు.. గాం గంటందొర
– గుమ్మడి లక్ష్మీనారాయణ,ఆదివాసీ రచయితల వేదిక

కామారెడ్డి జిల్లా, జూలై 22 ( లోకంతీరు ) : భారత స్వాతంత్ర్య పోరాటంలో చిరస్మరణీయులైన వీరుల్లో గంటందొర ఒకరు. బాహ్య ప్రపంచానికి తెలియక మరుగున పడిన పోరాట వీరుల్లో ఆదివాసీ యోధులే ఎక్కువ. విశాఖ మన్యంలో బ్రిటీష్ వారితో పోరాడి అసువులు బాసిన విప్లవ వీరుల్లో గొప్ప గిరిజన ఆదివాసీ నాయకుడు గాము గంటందొర. గిరిజన బగత తెగకు చెందిన ఆయన ఇప్పటి అల్లూరి సీతారామరాజు (ప.గో) జిల్లాలో కొయ్యూరు మండలం లంకవీధిలో జన్మించాడు. బ్రిటిష్ నిరంకుశ పాలనలో గిరిజనులు అనుభవిస్తున్న దయనీయ పరిస్థితిని తొలగించి, వారి జీవితాలలో అభ్యుదయ కాంతులు నింపడానికి అల్లూరి సీతారామరాజుతో కలిసి గాము గంటందొర 1922 నుంచి 1924 వరకు ‘మన్యం విప్లవం సాగించారు. అల్లూరి సీతారామరాజుకి కుడి భుజంగా ఉంటూ బ్రిటీష్ ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేస్తూ 1924 వ సంవత్సరం జూన్ 7న వలసంపేట గ్రామం వద్ద మకరం ముట్ట కాలువ పైన ఉన్న సంగధార అనే ప్రదేశంలో వీర మరణం పొందారు.
బికారి అయిన మునసబు :
గాము గంటందొర గ్రామ మునసబుగా పనిచేసేవారు. ఇతనిని ప్రజలు ఎంతగానో అభిమానించేవారు. ఆయన కూడా ఎప్పుడూ గిరిజన ప్రజల సంక్షేమాన్ని, వారి అభివృద్ధిని కోరుకుంటూ వారి సర్వతోముఖాభివృద్ధికి నిత్యం కృషి చేసేవాడు. పరిపాలన వ్యవహారాలలో ఎంతో అనుభవం ఉండేది. ప్రజల మనస్తత్వం పూర్తిగా తెలిసినవాడు. ఎప్పుడూ ప్రజల పక్షంగా ఉండేవాడు. ఇది గూడెం డిప్యూటీ తహసీల్దార్ సెబాస్టియన్ కు నచ్చేది కాదు. ఎప్పుడూ గంటం దొరను ఇబ్బందులు పెడుతూ అవమానాలకు గురిచేసేవాడు. కుట్రపన్ని ప్రభుత్వ సొమ్మును కాజేశారని గంటం దొరపై నిందలు వేసి మునసబు పదవి నుంచి తప్పించేశాడు. బ్రిటిష్ ప్రభుత్వం దుర్మార్గంగా ఆయన భూములను, ఎడ్లను జప్తు చేసింది. చివరకు ఆయన ఇంటిని కూడా ఆక్రమించింది. న్యాయ మార్గాన్ని నమ్ముకున్న గంటందొరకు తీవ్ర అన్యాయం జరిగింది. దానితో వీరి కుటుంబం పూర్తిగా పేదరికంలో కూరుకుపోయింది. దీంతో తమకు జరిగిన అన్యాయంపై తిరుగుబాటు చేయాలని నిశ్చయించుకొని అప్పటికే ప్రభుత్వంపై పోరాటానికి సన్నాహాలు చేస్తున్న అల్లూరి సీతారామరాజుతో కలిసి మన్యం విప్లవానికి నాంది పలికారు. గంటం దొర గిరిజనులకు సుపరిచితుడుగా ఉండటం పైగా పాలన వ్యవహారాలలో పూర్తిగా అనుభవం కలిగి ఉండటం వలన అల్లూరి సీతారామరాజు 60 మంది గిరిజన పోరాటయోధులతో ఒక గెరిల్లా సైన్యాన్ని ఏర్పాటు చేసి దానికి ప్రధాన బాధ్యత గంటం దొరకు అప్పగించారు.
పోలీసు స్టేషన్లపై దాడులు :
అల్లూరి, గంటందొర కలిసి మన్యంలో జరిగిన విప్లవంలో బ్రిటిష్ ప్రభుత్వాన్ని గజగజలాడించి 1922, ఆగష్టు 22న చింతపల్లి స్టేషన్ పై దాడి చేయడంతో మన్యసీమ ఉద్యమం ఆరంభమైనది. పోలీస్ స్టేషన్ ఆక్రమించి తుపాకులు, తూటాలు తీసుకొని వెళ్ళిపోయారు. అలాగే కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్, ఆ మరుసటి రోజు రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్లను ఆక్రమించి తుపాకులు, మందు గుండు సామగ్రి స్వాధీన పరుచుకున్నారు. మన్యం పోరాటంలో మరొక గొప్ప సంఘటన కర్కశులైన బ్రిటిష్ మిలటరీ అధికారులు స్కాట్ కవర్స్, హైటర్లను అంతం చేయడం. వారు విశాఖ జిల్లాకు వచ్చినప్పుడు అల్లూరి, గంటం దొర, సోదరుడైన మల్లుదొరల నాయకత్వంలో మన్యం వీరులు వారిని అంతం చేశారు. ఇది బ్రిటిష్ ప్రభుత్వానికి కోలుకోలేని దెబ్బ. ఆ తర్వాత అడ్డతీగల పోలీస్ స్టేషన్, రంపచోడవరం పోలీస్ స్టేషన్లను ముందుగానే ముట్టడిస్తానని మిరపకాయ టపా పంపి మరీ వశపరుచుకున్నారు. ఈ విధంగా మన్యవిప్లవంలో ముఖ్యమైన అన్ని సంఘటనలలో గంటం దొర చాలా కీలకపాత్ర పోషించారు. మన్యం పితూరిని ముందుకు నడిపేందుకు ఎవరు ఏవిధంగా పనికొస్తారో, ఎవరిని ఉద్యమంలో కలుపుకొని వెళ్ళాలి అనే విషయాలను అల్లూరి సీతారామరాజుకి గంటందొర తగిన సలహాలిచ్చే వాడు. అల్లూరి ఆలోచనా విధానాన్ని, సిద్ధాంతాలను, వ్యూహమును నూటికి నూరు శాతం అర్ధం చేసుకొని మెలిగిన వ్యక్తి గంటందొర మాత్రమే. అందుకే మన్యవిప్లవం నుంచి గంటందొర జీవితాన్ని వేరుగా చూడలేం. పితూరీలు, పోరాటాలు గంటం దొర జీవితం. స్వేచ్ఛ కోసం జరిపిన గెరిల్లా పోరాటమే గంటం దొర జీవిత చరిత్ర. గిరిజన ఆదివాసీల సంక్షేమమే తన జీవిత లక్ష్యంగా, వారి కష్టాలు తీర్చడమే తన కర్తవ్యంగా పోరుబాట సాగించిన మన్యం వీరుడు గాము గంటందొర అనడం నిస్సందేహం!
అల్లూరి తర్వాత కూడా పోరుబాట వీడలేదు :
అల్లూరి సీతారామరాజు మరణానంతరం కూడా బ్రిటిష్ ప్రభుత్వంపై మన్యంలో పోరాటం కొనసాగిస్తూనే బ్రిటిష్ సైన్యాన్ని ముప్పుతిప్పలు పెట్టాడు గాము గంటం దొర, ఆ క్రమంలో చివరికి 1924వ సంవత్సరం జూన్ 7వ తేదీన కృష్ణదేవిపేట దగ్గరలో ఉన్న వలసంపేట గ్రామం వద్ద మకరం ముట్ట కాలువ పైన ఉన్న సింగధార అనే ప్రదేశంలో బ్రిటిష్ సైన్యంపై వీరోచితంగా పోరాడి వీరమరణం పొందాడు గాము గంటందొర. 1922 నుండి 1924 వరకు దాదాపుగా రెండేళ్లు సాగిన మన్య పోరాటంలో, ఎందరో వీరులు తమ జీవితాలను ధారపోసి అందించిన స్వరాజ్యం మనది. ఎందరో జైలు గోడల మధ్య చిత్రహింసలు అనుభవించి, స్వాతంత్ర్యాన్ని మనకు అందించి ఎటువంటి గుర్తింపుకు నోచుకోకుండా జీవితాలు చాలించిన వీరులలో గాం గంటందొర అనామక యోధుడుగా మిగిలాడు. అలాంటి వీరులందరి త్యాగఫలమే మనం అనుభవిస్తున్న స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు. కాబట్టి గంటందొర పోరాట చరిత్రను వెలుగులోకి తెచ్చి భావితరాలకు అందించాలి.
జులై 2024: గాం గంటందొర శత వర్ధంతి.