Take a fresh look at your lifestyle.

సింగరేణి 5 గనులకు జాతీయ స్థాయిలో 5-స్టార్ రేటింగ్.

0 21

సింగరేణి 5 గనులకు జాతీయ స్థాయిలో 5-స్టార్ రేటింగ్.
దేశవ్యాప్తంగా ఎంపికైన 50 అత్యుత్తమ గనుల్లో సింగరేణి నుంచి ఐదు గనులు.
ఆర్.కె. న్యూటెక్, ఆర్.కె.-6, జె.వి.ఆర్. ఓసీ-2, ఖైరిగూడ, ఆర్.జి. ఓసీ-1కు అత్యున్నత గుర్తింపు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభినందనలు.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
హైదరాబాద్/కొత్తగూడెం, జూలై 10:సింగరేణి సంస్థకు జాతీయ స్థాయిలో మరో అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2024–25 సంవత్సరానికి నిర్వహించిన గనుల పనితీరు మూల్యాంకనంలో సింగరేణికి చెందిన ఐదు గనులు అత్యుత్తమ 5-స్టార్ రేటింగ్ సాధించి జాతీయ స్థాయి ఉత్తమ గనులుగా ఎంపికయ్యాయి. గత ఏడాది నాలుగు గనులకు ఈ గుర్తింపు లభించగా, ఈసారి సింగరేణి చరిత్రలోనే అత్యధికంగా ఐదు గనులు 5-స్టార్ రేటింగ్ సాధించడం విశేషం. కేంద్ర బొగ్గు శాఖ విడుదల చేసిన జాబితా ప్రకారం శ్రీరాంపూర్ ఏరియాకు చెందిన ఆర్.కె. న్యూటెక్, ఆర్.కె.-6, సత్తుపల్లి ఏరియాలోని జె.వి.ఆర్. ఓసీ-2, బెల్లంపల్లి ఏరియాలోని ఖైరిగూడ ఓపెన్‌కాస్ట్ గని, రామగుండం-3 ఏరియాలోని ఆర్.జి. ఓసీ-1 గనులు 5-స్టార్ రేటింగ్‌కు ఎంపికయ్యాయి. దేశవ్యాప్తంగా 382 గనులు ఈ రేటింగ్ కోసం దరఖాస్తు చేసుకోగా, వాటిలో కేవలం 50 గనులు మాత్రమే ఎంపికయ్యాయి. అందులో సింగరేణికి చెందిన ఐదు గనులు చోటు దక్కించుకోవడం సంస్థ పనితీరుకు నిదర్శనంగా నిలిచింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు సింగరేణి యాజమాన్యం, అధికారులు, కార్మికులు, సిబ్బందిని అభినందించారు. క్రమశిక్షణ, భద్రత, కార్మిక సంక్షేమం, పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్ర అవసరాలకు తగిన బొగ్గును ప్రమాదరహితంగా ఉత్పత్తి చేస్తున్నందుకు ప్రశంసించారు. ఇతర గనులు కూడా ఈ గనులను ఆదర్శంగా తీసుకుని రానున్న రోజుల్లో మరిన్ని 5-స్టార్ రేటింగ్‌లు సాధించాలని ఆకాంక్షించారు. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ అనుబంధ సంస్థ కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ ప్రతి ఏడాది దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు బొగ్గు గనుల పనితీరును సమగ్రంగా అంచనా వేసి ఈ రేటింగ్‌లను ప్రకటిస్తుంది. గనుల నిర్వహణ, ఉత్పత్తి సామర్థ్యం, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, కార్మిక సంక్షేమం, భద్రత, పర్యావరణ పరిరక్షణ, గని ప్రభావిత గ్రామాల అభివృద్ధి తదితర ఏడు ప్రధాన విభాగాల్లో మొత్తం 50 అంశాలను పరిశీలించి మూల్యాంకనం నిర్వహిస్తారు. 90 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించిన గనులకు మాత్రమే 5-స్టార్ రేటింగ్ ప్రదానం చేస్తారు. తుది నిర్ణయానికి ముందు నిపుణుల బృందం ఆయా గనులను ప్రత్యక్షంగా సందర్శించి క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తుంది. ఇటీవల కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ నిపుణుల బృందం సింగరేణి గనులను పరిశీలించిన అనంతరం ఈ ఐదు గనులను 5-స్టార్ రేటింగ్‌కు ఎంపిక చేసింది. భద్రత, ఉత్పాదకత, కార్మిక సంక్షేమం, పర్యావరణహిత చర్యల అమలులో సింగరేణి పాటిస్తున్న ఉన్నత ప్రమాణాలకు ఈ గుర్తింపు నిదర్శనమని సంస్థ అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ఈసారి సింగరేణికి చెందిన మరో 17 గనులు 4-స్టార్ రేటింగ్ సాధించాయి. 80 నుంచి 90 శాతం మధ్య మార్కులు సాధించిన గనులకు ఈ రేటింగ్ లభిస్తుంది. కొద్ది మార్కుల తేడాతో ఈ గనులు 5-స్టార్ రేటింగ్‌ను కోల్పోయినప్పటికీ, జాతీయ స్థాయిలో ఉత్తమ పనితీరు కనబరిచిన గనులుగా గుర్తింపు పొందాయి.

Leave A Reply

Your email address will not be published.