Take a fresh look at your lifestyle.

సీర్నాపల్లి సంస్థానం వీరత్వం……

0 1,260

సీర్నాపల్లి సంస్థానం వీరత్వం

  • 1905 లో రైలు మార్గం..!

  •  బ్రిటిష్ సామ్రాజ్యం తో పోరాటం..!

  • రైలు మార్గాన్ని వేయించిన వీరవనిత…!

  •  సిర్నాపల్లి దొరసాని..!

ఉమ్మడి జిల్లా బ్యూరో, సెప్టెంబర్ 01 (లోకంతీరు) : నిజాం ప్రభుత్వాలకు విధేయంగా కొనసాగిన సంస్థానం.నిజామాబాద్‌ జిల్లా ఇందల్వాయి మండలంలో సీర్నాపల్లి సంస్థానం ఉన్నది. ఇది ఒక చిన్న గ్రామం. సంస్థానం ముఖ్య కేంద్రంగా కొనసాగినందున చరిత్ర సృష్టించింది.1687లో గోల్కొండ రాజ్యాన్ని ఔరంగజేబు జయించినప్పుడు సిర్నాపల్లి సంస్థానం ఏర్పడింది. ధర్పల్లి, భీమ్గల్ , ఇందూరు గా నిజామాబాద్ అప్పుడు,ఇందల్వాయి,జానకంపేట, నవీపేట, రెంజల్ , యాంచ, బాసర వంటి 141గ్రామాలు ఈ సంస్థానం అధీనంలో ఉండేవి.సంస్థాన మూల పురుషుడు చెన్నారెడ్డి. 17 ఈ సంస్థానానికి సుమారు 400 సంవత్సరాల చరిత్ర ఉన్నది.మూలపురుషుడు చెన్నారెడ్డి,రాజధాని సిర్నాపల్లి
ఇంటిపేరు శీలం చీలం వివరాలు ఇలా సంస్థాన మూలపురుషుడు చెన్నారెడ్డి జన రంజకంగా పరిపాలన చేసి వ్యవసాయ అభివృద్ధికి తటాకాలు కుంటలు బావులు తవ్వించాడు. చెన్నారెడ్డి కుమారుడు రఘుపతిరెడ్డి. తండ్రి తరువాత పరిపాలనకు వచ్చిన రఘుపతిరెడ్డి తండ్రి బాటలోనే వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తూ గ్రామాలను కూడా అభివృద్ధి చేశాడు.
రఘుపతిరెడ్డి తనయుడు రెండవ చెన్నారెడ్డి. ఇతడి తనయుడు రామిరెడ్డి. ఇతడు అడవులను కొట్టించి వ్యవసాయ యోగ్యమైన భూమిని తయారు చేసి రైతులకు ఉచితంగా పంచిపెట్టాడు. రామిరెడ్డి తనయుడు రెండవ రఘునాథరెడ్డి. ఇతడి కుమారుడు మూడవ చెన్నారెడ్డి. రెండవ రఘునాథరెడ్డి అకాల మరణంతో భార్య పరిపాలనకు వచ్చింది. ఆ తరువాత మూడవ చెన్నారెడ్డి పరిపాలనకు వచ్చాడు. మూడవ చెన్నారెడ్డి కుమారుడు వెంకటరెడ్డి. వెంకటరెడ్డి కుమారుడు నాలుగవ చెన్నారెడ్డి. నాలుగవ చెన్నారెడ్డి మరణం తర్వాత అతడి భార్య ఉషమ్మ పాలనా బాధ్యతలు తీసుకుంది. ఈమె వీరనారి. ధైర్య సాహసాలు ఉన్న వనిత.

రాణి ఉషమ్మ ….!

రాణి ఉషమ్మ వీరత్వం గురించి చెప్పుకుంటే 1762 – 1803 మధ్య హైదరాబాద్ రాజ్యాన్ని నవాబ్ మీర్ నిజాం అలీఖాన్ సిద్దిఖి అసఫ్ జా పాలించాడు.1795 లో మరాఠ పేష్వా మాధవరావు కు నిజాం ఆలీ ఖాన్ కు యుద్ధం జరిగింది. ఈ యుద్ధం పేరు ఖర్దా ఈ యుద్ధంలో నిజాం ఆలీ ఖాన్ ఓడిపోయాడు. దైలతాబాద్, ఔరంగాబాద్, సోలాపూర్ లను వారికి అప్పగించి, 3 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించాడు.నిజాం అలీఖాన్ ఖర్దా యుద్ధం జరిపినప్పుడు, రాణి ఉషమ్మ ఆయుధాలు ధరించి స్వయంగా యుద్ధంలో పాల్గొన్నది.నిజాం ప్రభువుపై నిర్మల్ దుర్గాధిపతి తిరుగుబాటు చేసినప్పుడు కూడా యుద్ధంలో సహకరించింది. రాణి ఉషమ్మ తర్వాత రాజారాం,రాజారాంరెడ్డి సంస్థానాధీశుడయ్యాడు.రాజారామ్, రాజారాంరెడ్డి భార్య జానకమ్మ .ఈ దంపతుల కుమారుడు మూడవ రఘుపతిరెడ్డి.ఇతడి భార్య మంగమ్మ ఈ దంపతుల కుమారుడు రాజా ప్రతాపరెడ్డి. ఈ ప్రతాపరెడ్డి భార్యనే సంస్థానంలో ప్రఖ్యాతి గాంచిన శీలం జానకిబాయమ్మ.

రఘుపతిరెడ్డి తర్వాత..!

సంస్థానం కొన్నాళ్ళు నర్సాగౌడ్ అధీనంలో ఉండేది. ఆ తర్వాత శీలం ప్రతాపరెడ్డి ఆధీనంలోకి వచ్చింది. అని కొందరు రాసారు.కానీ వివరాల్లోకి వెళ్తే నిజమాబాద్ ప్రాంతానికి చెందిన రాజా నర్సాగౌడ్ గొప్ప దానకర్ణుడు.వీరి జీవితకాలం 1866- 1948 వరకు. జానకిబాయమ్మ సంస్థానాన్ని పాలిస్తున్న సమయంలో నర్సాగౌడ్ జన్మించారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలకు స్వచ్ఛందంగా సహాయం అందించాడు.నిజామాబాదులో మొదటి నీటిట్యాంకు నిర్మాణంలో జానకీబాయమ్మ ఆధ్వర్యంలో సహకారం అందించాడు.ఏడవ నిజాం నుండి రాజా బిరుదును పొందాడు.

శీలం జానకీబాయమ్మ పాలన..!

బాన్సువాడ మండలం పిట్టం గ్రామానికి చెందిన లింగారెడ్డి కుమార్తె శీలం జానకిబాయమ్మ. 12 ఏళ్ల వయసులోనే రాజ ప్రతాపరెడ్డి తో వివాహం జరిగింది. వివాహం జరిగిన కొన్నాళ్లకే ప్రతాపరెడ్డి కాలం చేశాడు. ఆ విధంగా 12 ఏళ్ల వయసులోనే పాలనకు వచ్చిన శీలం జానకిబాయమ్మ 1859 నుండి 1920 వరకు 60 ఏండ్లు సంస్థానాన్ని గొప్పగా పాలించింది.1921లో జానకీబాయమ్మమరణించింది

ముఖ్యంగా శీలం..!

జానకిబాయమ్మ ప్రతాపరెడ్డి దంపతులకు సంతానం లేకపోవడంతో,జానకిబాయమ్మ తన తమ్ముడి,
కుమారుడైన రఘుపతిరెడ్డిని దత్తత తీసుకుంది.ఈ రఘుపతిరెడ్డి భార్య మంగమ్మ. ఈ దంపతులకు కూడా సంతానం కలగకపోవడంతో రామలింగారెడ్డిని దత్తత తీసుకున్నారు. వనపర్తి రాజా రెండవ రామేశ్వరరావు కుమార్తె జానమ్మ రామలింగారెడ్డిని 1916 లో వివాహం చేసుకుంది. ఈ వివాహం సందర్భంగానే పెళ్లికి వచ్చిన పెద్దలతో మాట్లాడి రాజబహదూర్ వెంకటరామిరెడ్డి రెడ్డి హాస్టల్ నిర్మాణానికి అంకురార్పణ చేశారు.రాజా రామలింగరెడ్డి, జానమ్మల కుమారుడు శీలం రాంభూపాల్ రెడ్డి. వీరు ఐ.ఎ .ఎస్ అధికారిగా పదవీవిరమణ చేసి 2013లో మరణించారు. వీరి కుమార్తె అనురాధారెడ్డి.పింగళి వారి కోడలు. ఆమె సాంస్కృతిక వారసత్వ సంస్థ ఇండియన్ నేషనల్ ట్రస్టు ఫర్ కల్చురల్ అండ్ హెరిటేజ్ కు కన్వీనరుగా మంచి పేరు
సంపాదించుకున్నారు.

సిర్రాపల్లి దొరసానిగా..!

జానకీబాయి పగటి మషాల్ దొరసానిగా ప్రసిద్ధి చెందింది. . పగటి మషాల్ అంటే పగలే దివిటీలు వెలగటం అని అర్థం. పగటిపూట దివిటీలతో పల్లకీలో వెళ్ళడం అత్యున్నతమైన రాజగౌరవం. తెలంగాణలో కొందరు దొరలు కూడా పగటి మషాల్ దొరలుగా కొనసాగారు.అనుచరులతో కలిసి గ్రామాల్లో పర్యటించి ప్రజల బాధలను స్వయంగా తెలుసుకునేది. ఇందుకు గుర్రంపై బయలుదేరేది.
సంస్థాన పాలనలో లింగన్న పట్వారి కీలక పాత్ర పోషించాడు. తన సిబ్బంది సహాయ సహకారాలతో
జానకీబాయమ్మ ఆనాటి పాలన విధివిధానాలలో భాగంగా తన ఆధీనంలో ఉన్న గ్రామాల నుండి పన్నులు వసూలు చేసి, నిజాం ప్రభువుకి నిజాయితీగా లెక్కలు అప్పజెప్పేది. ఆ విధంగా నిజాం ప్రభువు అభిమానాన్ని చూరగొన్నది. నిజాం ప్రభు అండదండలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది.ఇందులో భాగంగా చెరువులు కుంటలు బావులు, కాలువలు తవ్వించింది. వ్యవసాయాన్ని అభివృద్ధి చేసింది.ఇందల్వాయి చెరువు, మంచిప్ప చెరువు, జానంపేట చెరువు, నల్లవెల్లి మత్తడి, దోన్కల్ కాలువ, లోలం చెరువు నిర్మించారు.సిర్నాపల్లి గడితో పాటుగా , పాతగంజ్లోని క్లాక్ టవర్ , నవీపేట గడి, నిర్మించారు.రఘునాథ ఆలయం,రఘునాథ చెరువు, ఖిల్లా రామాలయం, ఇందల్వాయి రామాలయం, జానకంపేట,లక్ష్మీనరసింహస్వామి ఆలయాలను పునరుద్ధరణ చేశారు.రాజ్యంలో ఒకానొక సమయంలో కరవు ఏర్పడింది. ప్రజలు తిండి గింజలులేక అల్లాడిపోతున్నారు. ఇటువంటి దుర్భర పరిస్థితిలో నిజాం దూతగా ఒక అధికారి పన్ను వసూలుకు సంస్థానంలోకి వచ్చాడు. ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసాడు. జానకీబాయమ్మ అధికారిని బండికి కట్టేసి ఊరు బయటకు పంపించి ప్రజాబంధువుగా నిరూపించుకుంది.

పర్యాటక ప్రాంతంగా సిర్నాపల్లి..!

జలపాతం జానకిబాయమ్మ నిర్మించినదే.నిజామాబాద్ బోధన్ దగ్గర ఉన్న జానకంపేట గ్రామాన్ని జానకిబాయమ్మ తన పేరిట నిర్మించింది. జనవాసాలకు స్థలాలను కేటాయించింది.నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ అసఫ్ జా 6వ 1899 లో హైదరాబాద్-బోధన్ – మీదుగా మన్మాడ్ రైల్వే లైన్‌ను తలపెట్టారు. జానకీబాయమ్మ నిజాం ప్రభువు దగ్గర తన పరపతి ఉపయోగించి రైల్వేలైనును సిర్నాపల్లి, ఇందూర్ మీదుగా మళ్ళించారు.

ఫలితంగా 1905 లోనే సిర్నాపల్లికి రైలు..!

సౌకర్య భాగ్యం కలిగింది. ఇందుకు కృతజ్ఞతగా జానకీబాయమ్మ ఇందూరు పేరును నిజాం పేరుమీద నిజాం బాద్ మార్చింది. కాలక్రమేనా ఇదే నిజామాబాదుగా మారిపోయింది.జానకీబాయమ్మ గురించి రెండు కథనాలు కూడా ప్రచారంలో ఉన్నాయి.
1 )రాణీ జానకీబాయి వేల్పూరు సంస్థానానికి చెందిన రేకులపల్లి కుటుంబపు ఆడపడుచు అని ప్రచారంలో ఉన్నది.2) నిజాం దగ్గర పనిచేసే ఒక అధికారి వేట కోసం అడవిలోకి ఒంటరిగా వెళ్ళి దారి తప్పాడు.కట్టెల కోసం వచ్చిన ఒక పన్నెండేళ్ళ అమ్మాయి ఆ అధికారిని క్షేమంగా అడవినుండి బయటకు తీసుకు వచ్చింది . చురుకుదనం చూసిన ఆ అధికారి నిజాం రాజుతో సంప్రదించి, సంబంధిత సిర్నాపల్లి సంస్థానానికి ఆ బాలికకు అప్పగించాడని ఒక కథనం.3) నీవు సిర్నాపల్లి దొరసానివా? నీవు సిర్నాపల్లి దొరసానివిలే నీకేం తక్కువ?
ఆమె ఏమైనా సిర్నాపల్లి దొరసానా?వంటి నానుడులు సామెతలు కూడా స్థానికంగా ప్రచారంలో ఉన్నాయి.

గడి నిర్మాణం..!

దాదాపు 5 ఎకరాల్లో 1910–13లలో సిర్నాపల్లి గడి నిర్మాణం జరిగింది. ఇండో– యూరోపియన్‌ నిర్మాణశైలితో ఈ గడీ నిర్మితమైంది .లోపల 20 గదులు, ఆకాలంలోనే వాటంతట అవే మూసుకునే తలుపులు, శత్రువులు దాడి చేసినప్పుడు,తప్పించుకోవడానికి రహస్య మార్గాలు ఉన్నాయి.భవనం ముందు భాగంలో నిర్మించిన ఆర్చీల డిజైన్ లను గోదీప్ డిజైన్లు అంటారు. ఈ నిర్మాణాలు ఎక్కువగా పశ్చిమ యూరప్ ప్రాంతాల్లో రాజ కుటుంబాల్లో కనిపించేవి. అట్లాగే చలికాలం వెచ్చగా, వేసవికాలం చల్లగా, ఉష్ణోగ్రతలు సమతూకంలో ఉండే సాంకేతిక నైపుణ్యాన్ని ఉపయోగించి సిమెంట్, స్టీల్, కాంక్రీట్‌ వాడకుండా ఈ గడీని ఆణువణువునా ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

సీర్నాపల్లి సంస్థానాదీషులు..!

ప్రజాబంధువులు. గొప్పగా పరిపాలన సాగించారు. 1948లో ఈ సంస్థానం హైదరాబాద్ సంస్థానంతో పాటుగా భారతీయునియంలో విలీనం అయ్యింది. సిర్నాపల్లి గడిని ప్రభుత్వానికి అప్పగించారు. అవిధంగా గడి దాదాపు మూడు దశాబ్దాలకుపైగా ప్రభుత్వ పాఠశాలగా సేవలు అందించింది. ప్రస్తుతం అందిస్తూనే ఉంది

Leave A Reply

Your email address will not be published.