(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్-భూపాలపల్లి, మే 24:
భూపాలపల్లి నియోజకవర్గంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబ సభ్యులను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. శనివారం సాయంత్రం గణపురం మండలం బుద్ధారం గ్రామానికి చెందిన సలేంద్ర లక్ష్మీ, దీప్తి, సాయి ఒకే బైక్‌పై గణపురం నుండి బుద్ధారం వెళ్తుండగా నారాయణగిరిపల్లి సమీపంలో ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తల్లి, కూతురు అక్కడికక్కడే మృతి చెందగా, కుమారుడు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు.
ఈ విషాద ఘటన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జీఎస్సార్ ఆదివారం ఉదయం ములుగు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని మృతదేహాలను సందర్శించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చినట్లు తెలిసింది.
ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి చెందడంతో బుద్ధారం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్థానిక ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.