అడవి తల్లిపై గొడ్డలి వేటు…!
– హాజీపూర్ అటవీ ప్రాంతంలో సుమారు 12 ఎకరాల్లో చెట్ల నరికివేత
– రాత్రికి రాత్రే ఆటవిని ఖతం చేస్తున్న వైనం
– దర్జాగా అటవీ భూమి అక్రమణ
– సంబంధిత అధికారి అండదండలని తాండవాసులు ఆరోపణలు

ఎల్లారెడ్డి, సెప్టెంబర్ 10 ( లోకంతీరు ) : ఎల్లారెడ్డి అటవీ రేంజ్ పరిధిలోని బొల్లారం సెక్షన్ పరిధిలోని హాజీపూర్ బీట్‌లో అటవీ భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. రాత్రి పూట ఆక్రమణలు అడవిలోని చెట్లు, పొదలను నరికి దర్జాగా కబ్జాకు పాల్పడుతున్నారు. మండలంలోని హాజీపూర్ తండాకు చెందిన కొందరు అటవీలోని గత వారం రోజుల నుంచి చెట్లను నరికేస్తున్నారు. గతంలో చెట్లను నరికి భూములను చదును చేసి పంటలను పండిస్తున్నారు. ఇంత తతంగం జరుగుతున్నా అటవీశాఖ అధికారులకు తెలిసినప్పటికీ కూడా ఎందుకు పట్టించుకోవటం లేదని తండవాసులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. అడవిలోని విలువైన వృక్ష సంపద నేలమట్టం అవుతోంది. కబ్జాదారులు ముళ్లపొదలను తొలగించి అటవీ ప్రాంతాన్ని చదును చేసి పంటపొలాలుగా మార్చుకుంటున్నారు. గత ప్రభుత్వంలో పోడు పట్టాలు జారీ చేసిన తర్వాత తిరిగి అటవీ భూములు అక్రమణకు గురవుతున్నాయి. అటవీశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ ఉన్నప్పటికీ కూడా ఇదంతా ఎందుకు జరుగుతుందో బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో అని పలువురు ఆరోపిస్తున్నారు. సంబంధిత బీట్ అధికారి హస్తంతోనే ఆటవి ప్రాంతాన్ని నరికి వేస్తున్నారని, స్థానికులు తండవాసులు ఆరోపించారు. ఇప్పటికైనా అడవుల ఆక్రమణపై ఉన్నతాధికారులు విచారణ జరిపి, సంబంధిత అధికారి, అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండు చేస్తున్నారు.
బాధ్యులపై చర్యలు తీసుకుంటాం
ఆటవిని నరికింది వాస్తవమేనని వెంటనే సమాచారం తెలుసుకొని అక్రమణకు గురైన ప్రాంతాన్ని పరిశీలించి తమ సిబ్బందిని అప్రమత్తం చేశామని అన్నారు. అడవిని నరికిన అక్రమణదారులు ఎంత పెద్ద వారైనా వదిలి పెట్టమని వారిపై కేసు నమోదు చేస్తామని ఎల్లారెడ్డి ఫారెస్ట్ రేంజ్ అధికారి ఓంకార్ నాయక్ అన్నారు. నష్టపరిహారాన్ని అంచనా వేయడానికి విచారణ చేపడుతున్నట్లు వారు తెలిపారు.