Take a fresh look at your lifestyle.

సింగరేణిలో రాజకీయ జోక్యంతోనే కార్మిక సమస్యలు పెండింగ్ – ఏఐటీయుసి

0 21

సింగరేణిలో రాజకీయ జోక్యంతోనే కార్మిక సమస్యలు పెండింగ్.

రూ.56 వేల కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలి. 

సమస్యలు పరిష్కరించకపోతే అన్ని సంఘాలతో కలిసి సమ్మెకు సిద్ధం.                              ఏఐటీయూసీ అధ్యక్ష, కార్యదర్శులు సీతారామయ్య, రాజ్ కుమార్.

(ప్రజాలక్ష్యం ప్రతినిధి)

భూపాలపల్లి, జూన్ 20:సింగరేణిలో రాజకీయ జోక్యం పెరగడం వల్లే కార్మికుల సమస్యలు పరిష్కారం కాకుండా పెండింగ్‌లో పడుతున్నాయని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) కేంద్ర కమిటీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణి వ్యవహారాల్లో రాజకీయాలకు కిటికీలు తెరిస్తే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తలుపులు తెరిచిందని వారు విమర్శించారు. శనివారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఏఐటీయూసీ కొమురయ్య భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.

గతంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖరరెడ్డి వంటి నాయకులు సింగరేణిని ప్రభుత్వరంగ సంస్థగా మాత్రమే పరిగణించి రాజకీయ జోక్యానికి అవకాశం ఇవ్వలేదని పేర్కొన్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత, ముఖ్యంగా 2014 నుంచి సింగరేణిలో రాజకీయ జోక్యం అధికమైందన్నారు. గతంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేపట్టిన సింగరేణి యాత్ర సందర్భంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో సింగరేణికి రూ.26 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని, వాటి కారణంగా సంస్థ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని విమర్శించారని గుర్తు చేశారు.

ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఆ బకాయిలు రూ.56 వేల కోట్లకు చేరాయని పేర్కొంటూ, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆ మొత్తాన్ని సింగరేణికి చెల్లించాలని డిమాండ్ చేశారు. గుర్తింపు సంఘంగా ఎన్నికైనప్పటి నుంచి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం స్ట్రక్చర్ మీటింగ్‌లలో పలుమార్లు ప్రస్తావించినప్పటికీ ఆశించిన ఫలితాలు లభించలేదన్నారు. ముఖ్యంగా మెడికల్ బోర్డు పాత విధానంలో కొనసాగించాలని, మారుపేర్ల సమస్యను పరిష్కరించాలని, కార్మికుల సొంతింటి పథకాన్ని వెంటనే అమలు చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. అలాగే పెర్క్స్‌పై ఆదాయపు పన్ను భారం తగ్గించడంతో పాటు కొత్త బొగ్గు గనులను ఏర్పాటు చేయాలని యాజమాన్యానికి, ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ స్పందన లేదని విమర్శించారు.

ఈ సమస్యల పరిష్కారం కోసం ఏఐటీయూసీ ఇప్పటికే సమ్మె నోటీసు ఇచ్చిందని, ఈ నెల 26న ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించిందని తెలిపారు. ఆ చర్చల్లో సానుకూల నిర్ణయాలు తీసుకోకపోతే నెల రోజుల్లో అన్ని జాతీయ ట్రేడ్ యూనియన్ సంఘాలను కలుపుకుని భారీ స్థాయిలో సమ్మె చేపడతామని హెచ్చరించారు. ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం మొండి వైఖరిని వీడి కార్మికుల పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, మెడికల్ బోర్డు, సొంతింటి పథకం, ఇతర సంక్షేమ అంశాలపై స్పష్టమైన నిర్ణయాలు ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్, అసిస్టెంట్ బ్రాంచ్ కార్యదర్శి ఎం.ఏ. ఆసిఫ్ పాషా, కాంట్రాక్ట్ కార్మికుల ఇన్‌చార్జి నూకల చంద్రమౌళి, భీమనాథుని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.