కార్మికులను మోసం చేసిన సంఘాలను నిలదీయాలి: కామెర గట్టయ్య.
సింగరేణి సమస్యల పరిష్కారం కోసం అన్ని కార్మిక సంఘాలు ఐక్యంగా పోరాడాలి
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్-భూపాలపల్లి, జూన్ 22:సింగరేణిలో ఎన్నికల కాలపరిమితి ముగియనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల అనుబంధ కార్మిక సంఘాలు మరోసారి కార్మికులను మోసగించేందుకు గనులపై గేట్ మీటింగ్‌ల పేరుతో ప్రచారం చేస్తున్నాయని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య ఆరోపించారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఇప్పుడు మళ్లీ కార్మికుల ఓట్ల కోసం వస్తున్న నాయకులను కార్మికులు నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు. సోమవారం భూపాలపల్లి పట్టణంలోని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో వివిధ కార్మిక సంఘాలు అనేక హామీలతో కార్మికుల మద్దతు పొందినా, వాటిలో ఒక్క హామీ కూడా అమలుకు నోచుకోలేదని విమర్శించారు. ప్రస్తుతం సుమారు 3 వేల మంది కార్మికులు 16 నెలలుగా మెడికల్ బోర్డు కోసం ఎదురుచూస్తున్నారని, వెంటనే మెడికల్ బోర్డును పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అలాగే మారుపేర్ల (డిపెండెంట్ ఉద్యోగాలు) అంశానికి సంబంధించిన విజిలెన్స్ కేసులు ఆరు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని తక్షణమే పరిష్కరించాలని కోరారు. సింగరేణి కార్మికులకు సొంత ఇంటి కల ఇప్పటికీ నెరవేరలేదని, కార్మికుల గృహ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం, యాజమాన్యం చర్యలు చేపట్టాలని అన్నారు. మరోవైపు సింగరేణి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సుమారు 2,200 మంది అధికారులు పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ అమలు కోసం రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్న పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ఇది సంస్థలో నెలకొన్న పరిస్థితులకు నిదర్శనమని అన్నారు. పీఆర్సీ అమలు కోసం పోరాడుతున్న అధికారులకు తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం పూర్తి మద్దతు ప్రకటిస్తోందని గట్టయ్య తెలిపారు. సింగరేణి కార్మికులు, అధికారులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం, సంస్థ యాజమాన్యం పరిష్కరించే వరకు అన్ని కార్మిక సంఘాలు రాజకీయాలకు అతీతంగా ఐక్యంగా ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు దాసరి జనార్ధన్, కాసర్ల ప్రసాద్ రెడ్డి, నామాల శ్రీనివాస్, రాళ్లబండి బాబు, జయశంకర్, నరసింహారెడ్డి, సాజిత్, సలీం, రవి తదితరులు పాల్గొన్నారు.