
సింగరేణి కొత్తగూడెం జీఎం కార్యాలయం ఎదుట అధికారుల నిరసన.
పే అప్‌గ్రెడేషన్, పీఆర్పీ బకాయిల చెల్లింపుకు డిమాండ్.
సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరిక.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
భద్రాద్రి-కొత్తగూడెం, జూన్ 25:అధికారుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ బొగ్గు గనుల అధికారుల సంఘం ఆధ్వర్యంలో కొత్తగూడెం సింగరేణి జీఎం కార్యాలయం ఎదుట గురువారం భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. నల్ల బ్యాడ్జీలు ధరించి, ప్లకార్డులు ప్రదర్శిస్తూ అధికారుల సమస్యల పరిష్కారానికి యాజమాన్యం, ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ, అధికారుల శ్రమకు తగిన ప్రతిఫలం దక్కేలా వేతనాలు చెల్లించాలని, అధికారుల గౌరవాన్ని కాపాడుతూ వారి సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. సింగరేణిలో కూడా కోల్ ఇండియాలో అమలవుతున్న తరహాలో పే అప్‌గ్రెడేషన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. 2017 వేతన సవరణలో జరిగిన నష్టాన్ని సవరించి, పే అప్‌గ్రెడేషన్ అమలు చేయడంతో పాటు 2022, 2023 సంవత్సరాలకు సంబంధించిన పెర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే (పీఆర్పీ) బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. అలాగే పదోన్నతులు, బదిలీలు, పోస్టింగ్‌లలో పారదర్శక విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణి అభివృద్ధి, భవిష్యత్తు కోసం అధికారులు నిరంతరం కృషి చేస్తున్నప్పటికీ, వారి సమస్యల పట్ల ప్రభుత్వం, యాజమాన్యం నిర్లక్ష్య ధోరణి అవలంబించడం బాధాకరమని విమర్శించారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోతే భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. సింగరేణి సంస్థ భవిష్యత్తు దృష్ట్యా కొత్త బొగ్గు బ్లాక్‌లను కేటాయించి సంస్థ విస్తరణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో బొగ్గు గనుల అధికారుల సంఘం నాయకులు, వివిధ విభాగాల అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.