సింగరేణి సమ్మె సమస్య పరిష్కారానికి సీఎండీకి గుర్తింపు సంఘం వినతిపత్రం.
ఆర్‌ఎల్‌సీ చర్చల అనంతరం సింగరేణి భవన్‌లో కీలక భేటీ.
స్ట్రక్చర్ కమిటీ సమావేశంలో సమస్యలు పరిష్కరిస్తామని యాజమాన్యం హామీ.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
హైదరాబాద్/భ ద్రాద్రి-కొత్తగూడెం, జూన్ 25:సింగరేణి కార్మికుల 31 డిమాండ్ల పరిష్కారం కోసం ఇచ్చిన సమ్మె నోటీసు నేపథ్యంలో, గుర్తింపు సంఘం ఎఐటీయూసీ నాయకులు గురువారం సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ బుద్ధ ప్రకాష్‌కు వినతిపత్రం అందజేశారు. కార్మికుల్లో నెలకొన్న అసంతృప్తి, పెండింగ్ సమస్యలు, సమ్మె నోటీసుకు దారితీసిన పరిస్థితులను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. హైదరాబాద్‌లో డిప్యూటీ లేబర్ కమిషనర్ (ఆర్‌ఎల్‌సీ) సమక్షంలో జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం, ఎఐటీయూసీ గౌరవ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆధ్వర్యంలో గుర్తింపు సంఘం నాయకులు సింగరేణి భవన్‌లో సీఎండీ గౌతమ్ బుద్ధ ప్రకాష్, డైరెక్టర్ (పర్సనల్) గౌతమ్ పోట్రూలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ, కార్మికులు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న పలు సమస్యలు ఇప్పటికీ పరిష్కారానికి నోచుకోకపోవడంతో తీవ్ర అసంతృప్తి నెలకొన్నదన్నారు. పదోన్నతులు, బదిలీలు, వారసత్వ ఉద్యోగాలు, కేడర్ సమస్యలు, సంక్షేమ అంశాలు, భద్రతా ప్రమాణాలకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో జాప్యం జరగడం వల్లే సమ్మె నోటీసు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని వివరించారు. అదేవిధంగా సంస్థ భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని కొత్త బొగ్గు గనుల అభివృద్ధి, నూతన ప్రాజెక్టుల ఏర్పాటు, ప్రత్యామ్నాయ ఆదాయ వనరుల అన్వేషణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని యాజమాన్యానికి సూచించారు. కార్మికుల సంక్షేమం, సంస్థ అభివృద్ధి పరస్పర అనుబంధ అంశాలని, ఉద్యోగుల్లో విశ్వాసాన్ని పెంపొందించే నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. గుర్తింపు సంఘం ప్రతిపాదనలను సానుకూలంగా స్వీకరించిన యాజమాన్యం, కార్మికుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తామని హామీ ఇచ్చింది. త్వరలోనే స్ట్రక్చర్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి పెండింగ్ అంశాలపై సమగ్ర చర్చ జరిపి, పరిష్కార ప్రక్రియను వేగవంతం చేస్తామని తెలిపింది. ఈ సమావేశంలో ఎఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్, అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య, ఉప ప్రధాన కార్యదర్శి కె. సారయ్య, సింగరేణి డైరెక్టర్లు, గుర్తింపు సంఘం నాయకులు పాల్గొన్నారు.