జూన్ 30న చింతకానిలో సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ‘రైతు ఆశీర్వాద సభ’ :మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.

జూన్ 30న చింతకానిలో సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ‘రైతు ఆశీర్వాద సభ’.
అన్నదాతలకు అండగా ప్రజా ప్రభుత్వం.
భారీ వర్షాలొచ్చినా సభ విజయవంతం కావడం ఖాయం : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
ఖమ్మం, జూన్ 28:రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతు సంక్షేమానికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటూ అన్నదాతలకు అండగా నిలుస్తోందని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురం గ్రామంలో ఈ నెల 30న నిర్వహించనున్న ‘రైతు ఆశీర్వాద సభ’ ఏర్పాట్లను ఆదివారం ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో కలిసి మంత్రి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సభకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సభా ప్రాంగణం, హెలిప్యాడ్, వాహనాల పార్కింగ్ ప్రాంతాలను మంత్రి స్వయంగా పరిశీలించి, రైతులు మరియు ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సభా ప్రాంగణంలో జర్మన్ హ్యాంగర్లతో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నా కార్యక్రమం సజావుగా జరిగేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, తీసుకుంటున్న నిర్ణయాలు వ్యవసాయ రంగానికి కొత్త ఉత్సాహాన్ని అందిస్తున్నాయని పేర్కొన్నారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో భారీ వర్షాల సూచనలు ఉన్నప్పటికీ, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా రైతు ఆశీర్వాద సభను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టామని తెలిపారు. వేలాదిగా హాజరయ్యే రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సమగ్ర ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. రైతులకు అండగా నిలుస్తున్న ప్రజా ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని, చింతకానిలో జరగనున్న రైతు ఆశీర్వాద సభ కూడా చారిత్రాత్మక విజయాన్ని సాధిస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.