
సీఈఆర్ క్లబ్ ఎన్నికలపై ఐఎన్టీయూసీ ప్రకటనలు అవాస్తవం: మోటపలుకుల రమేష్.
ఏఐటీయూసీ ఎన్నికలను బహిష్కరించినప్పుడు ‘ఘన విజయం’ ఎలా సాధ్యమని ప్రశ్న.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్-భూపాలపల్లి, జూలై 12: భూపాలపల్లి సీఈఆర్ క్లబ్ ఎన్నికల్లో ఐఎన్టీయూసీ ఘన విజయం సాధించిందంటూ చేస్తున్న ప్రచారం అవాస్తవమని, ఎన్నికలను ఏఐటీయూసీ బహిష్కరించిన పరిస్థితుల్లో దానిని విజయం అని చెప్పుకోవడం హాస్యాస్పదమని సింగరేణి గుర్తింపు సంఘమైన ఏఐటీయూసీ అనుబంధ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఎస్సీడబ్ల్యూయూ) భూపాలపల్లి ఏరియా బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్ విమర్శించారు. ఆదివారం సోషల్ మీడియా ద్వారా విడుదల చేసిన వీడియో సందేశంలో ఆయన మాట్లాడుతూ, భూపాలపల్లి సీఈఆర్ క్లబ్ కమిటీని 2015 నుంచి ఇప్పటి వరకు మార్చలేదని, ఇప్పటి వరకు అమలులో ఉన్న సంప్రదాయం ప్రకారం గుర్తింపు సంఘంగా ఉన్న యూనియన్ క్లబ్ కమిటీని నామినేట్ చేస్తూ వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీ ఉన్నందున క్లబ్ కమిటీని నామినేట్ చేసే అవకాశం తమకు ఇవ్వాలని యాజమాన్యాన్ని కోరినట్లు చెప్పారు. అయితే ఐఎన్టీయూసీ నాయకత్వం సేఫ్టీ కమిటీ, మైన్స్ కమిటీ మాదిరిగా క్లబ్ కమిటీలో కూడా వాటా కావాలని పట్టుబట్టిందన్నారు. క్లబ్ కమిటీకి అలాంటి విధానం వర్తించదని ఆయన పేర్కొన్నారు. భూపాలపల్లిలో గతంలో ఐఎన్టీయూసీ గుర్తింపు సంఘంగా ఉన్నప్పుడు ఐఎన్టీయూసీ, టీబీజీకేఎస్ గుర్తింపు సంఘంగా ఉన్నప్పుడు టీబీజీకేఎస్ క్లబ్ కమిటీలను నామినేట్ చేశాయని, అదే సంప్రదాయాన్ని కొనసాగించాలని తాము కోరినట్లు వివరించారు. క్రీడాకారుల మధ్య రాజకీయ విభేదాలు సృష్టించే ఎన్నికలు నిర్వహించడం సరికాదని, క్లబ్లో అన్ని కార్మిక సంఘాలకు చెందిన సభ్యులు ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికలు నిర్వహించాలనే నిర్ణయం తీసుకుంటే తాము పాల్గొనబోమని ముందుగానే ప్రకటించినట్లు రమేష్ తెలిపారు. మార్చి 2026 నాటికి సీఈఆర్ క్లబ్ ఖాతాలో రూ.26.50 లక్షలకు పైగా నిధులు ఉన్నాయని, ఆ మొత్తాన్ని ప్రస్తుత సభ్యులకు రీఫండ్ చేయడం లేదా బహుమతుల రూపంలో ఖర్చు చేయాలని యాజమాన్యాన్ని కోరినట్లు చెప్పారు. కొత్త కమిటీ ఏర్పాటుకు యాజమాన్యం, ఐఎన్టీయూసీ పట్టుబడితే కొత్త సభ్యత్వాలు నమోదు చేసుకుని క్లబ్‌ను నిర్వహించుకోవచ్చని తాము సూచించామని తెలిపారు. అయితే ఈ ప్రక్రియను వ్యతిరేకిస్తూ ఏఐటీయూసీకి చెందిన సభ్యులు తమ సభ్యత్వాలను రద్దు చేసుకుంటామని ప్రకటించి ఎన్నికలను బహిష్కరించినట్లు వెల్లడించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల్లో ఏఐటీయూసీ పోటీ చేయనప్పుడు, ఎటువంటి ప్రత్యర్థి లేకుండా జరిగిన ప్రక్రియను తమపై ఘన విజయం సాధించామని ఐఎన్టీయూసీ నాయకులు చెప్పుకోవడం సమంజసం కాదని ఆయన ప్రశ్నించారు. “ఘన విజయం అంటే ప్రత్యర్థితో పోటీ పడి మెజారిటీ సాధించడం. పోటీనే లేని చోట విజయం సాధించామని చెప్పుకోవడం కార్మికులను తప్పుదోవ పట్టించడమే” అని వ్యాఖ్యానించారు. పదవులు, అధికారాల కోసం పనిచేసే సంఘం ఏఐటీయూసీ కాదని, క్రీడాకారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే తమ లక్ష్యమని రమేష్ స్పష్టం చేశారు. ఎన్నికల్లో నిలబడే సామర్థ్యం లేక కాదు, క్లబ్ వ్యవహారాల్లో ఎన్నికల విధానాన్నే వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. సీఈఆర్ క్లబ్ ఖాతాలో ఉన్న రూ.26.50 లక్షల నిధులను పాత సభ్యులకు బహుమతుల రూపంలో పంపిణీ చేయాలని లేదా రీఫండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కొత్త కమిటీ, యాజమాన్యం సభ్యులకు అన్యాయం చేస్తే ఏఐటీయూసీ తీవ్రంగా స్పందిస్తుందని హెచ్చరించారు. జరగని పోటీకి ఘన విజయం సాధించామని ప్రచారం చేయడం మానుకోవాలని, ఇలాంటి ప్రకటనలు కార్మికుల్లో నవ్వుల పాలవుతాయని మోటపలుకుల రమేష్ పేర్కొన్నారు.