

12వ వేతన ఒప్పందం కోసం వెంటనే కమిటీ ఏర్పాటు చేయాలి : భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు.
లేబర్ కోడ్లను రద్దు చేయాలి.. బొగ్గు బ్లాకులను సింగరేణికే కేటాయించాలి.
కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకు సిద్ధం : జాతీయ కార్మిక సంఘాల జేఏసీ.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్-భూపాలపల్లి, ఆగస్టు 10:సింగరేణి కార్మికులకు 12వ జాతీయ బొగ్గుగని కార్మికుల వేతన ఒప్పందాన్ని తక్షణమే అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే వేతన ఒప్పంద కమిటీని ఏర్పాటు చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు డిమాండ్ చేశారు. నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసి కార్మికుల హక్కులను పరిరక్షించాలని, తెలంగాణలోని బొగ్గు బ్లాకులను వేలం వేయకుండా నేరుగా సింగరేణి సంస్థకే కేటాయించాలని కోరారు. సోమవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సింగరేణి జీఎం కార్యాలయం ముందు సింగరేణి జాతీయ కార్మిక సంఘాల జేఏసీ (ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, సీఐటీయూ) ఆధ్వర్యంలో రెండు గంటల పాటు నిర్వహించిన మహాధర్నాలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా పాల్గొని కార్మికులకు సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ ధర్నాలో వివిధ కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని కార్మిక ఐక్యతను చాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ, 12వ జాతీయ బొగ్గుగని కార్మికుల వేతన ఒప్పందాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చిందని, అవి కార్మికుల హక్కులను కాలరాసే విధంగా ఉన్నాయని విమర్శించారు. నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని కోరారు. కోల్‌బెల్ట్ ప్రాంతానికి చెందిన 11 మంది ఎమ్మెల్యేలం కార్మికుల పక్షాన నిలిచి, లేబర్ కోడ్ల రద్దు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని తెలిపారు. బొగ్గు బ్లాకులను వేలం వేయడం వల్ల సింగరేణి సంస్థతో పాటు లక్షలాది మంది కార్మికుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని ఎమ్మెల్యే ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని బొగ్గు బ్లాకులను వేలం ద్వారా కాకుండా నేరుగా సింగరేణికి కేటాయించాలని, కోయగూడెం ఓసీ-3 బొగ్గు గనిని కూడా సింగరేణి సంస్థకే అప్పగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సింగరేణి వంటి ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ విధానాలకు ప్రాధాన్యం ఇస్తూ బొగ్గు బ్లాకులను వేలం వేయడం వల్ల ప్రభుత్వ రంగ సంస్థలు బలహీనపడటంతో పాటు కార్మికుల ఉపాధి భద్రత ప్రశ్నార్థకంగా మారుతోందన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్మికుల హక్కులు, శ్రమ చట్టాలు, ట్రేడ్ యూనియన్ ఉద్యమాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఎమ్మెల్యే విమర్శించారు. దేశ సంపదను కొద్దిమంది కార్పొరేట్ సంస్థల చేతుల్లో పెట్టే విధానాలను కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
సమ్మెకు వెనుకాడం : కార్మిక సంఘాల జేఏసీ.
కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే సమ్మెకు వెనుకాడేది లేదని జాతీయ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్, ఐఎన్టీయూసీ నాయకులు జోగ బుచ్చయ్య, సీఐటీయూ నాయకులు దుడ్డెల సాయిలు, హెచ్ఎంఎస్ నాయకులు నరేష్ నేత మాట్లాడుతూ, 12వ వేతన ఒప్పంద కమిటీని వెంటనే ఏర్పాటు చేసి వేతన ఒప్పందాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్ల పేరుతో 12వ వేతన ఒప్పందాన్ని అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని వారు ఆరోపించారు. కార్మికుల హక్కులను సాధించే వరకు, కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి వేతన ఒప్పందాన్ని అమలు చేసే వరకు అవసరమైతే సమ్మెకు వెళ్లి ఉద్యమిస్తామని హెచ్చరించారు. విద్యార్థి ఉద్యమాల స్ఫూర్తితో కార్మిక సంఘాలు ఐక్యంగా ఉద్యమించాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఐఎన్టీయూసీ బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ మధుకర్ రెడ్డి మాట్లాడుతూ, బొగ్గు బ్లాకుల వేలం సింగరేణి సంస్థతో పాటు లక్షలాది మంది కార్మికుల భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతుందని అన్నారు. తెలంగాణలోని బొగ్గు బ్లాకులను సింగరేణికే కేటాయించాలని, కోయగూడెం ఓసీ-3 గనిని కూడా సింగరేణికి అప్పగించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను పరిరక్షించాల్సింది పోయి కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. 44 కార్మిక చట్టాలను రద్దు చేసి తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లు అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం చేకూర్చేలా రూపొందించబడ్డాయని విమర్శించారు. ప్రైవేటీకరణ విధానాలకు స్వస్తి పలికి సింగరేణి వంటి ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం జేఏసీ నాయకులు సింగరేణి భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ రాజేశ్వర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్లు జోగ బుచ్చయ్య, రఘుపతి రెడ్డి, డిప్యూటీ జనరల్ సెక్రటరీ రత్నం సమ్మి రెడ్డి, సీనియర్ నాయకుడు కొలిపాక నర్సింగరావు, ఏఐటీయూసీ జనరల్ సెక్రటరీ కొరిమి రాజ్ కుమార్, భూపాలపల్లి ఏరియా ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ మోటపలుకుల రమేష్, హెచ్ఎంఎస్ బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ నరేష్ నేత, బ్రాంచ్ కార్యదర్శి జే. మల్లేష్, సీఐటీయూ బ్రాంచ్ సెక్రటరీ దుడ్డెల సాయిలు, సీఐటీయూ నాయకుడు తోట రమేష్, ఐఎన్టీయూసీ స్ట్రక్చర్ కమిటీ నాయకుడు బొడ్డు అశోక్, బ్రాంచ్ నాయకుడు కె. శంకర్, అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీలు కె. సంతోష్, ఈ. శంకర్ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీలు కోచర్ల రవి, దుర్గం రవి తదితరులు పాల్గొన్నారు. అలాగే కేటీకే-ఓసీ-2 ప్రాజెక్టు వర్క్‌మెన్ ఇన్స్పెక్టర్ బాగోతుల కుమారస్వామి, కేటీకే-1 ఇంక్లైన్ పిట్ సెక్రటరీ సోతుకు సమ్మయ్య, కేటీకే-5 ఇంక్లైన్ పిట్ సెక్రటరీ గట్టు రాజు, కేటీకే-ఓసీ-2 పిట్ సెక్రటరీ పోనగంటి కృష్ణ, కేటీకే-6 ఇంక్లైన్ పిట్ సెక్రటరీ చిరుత లక్ష్మీనారాయణ, కేటీకే-8 ఇంక్లైన్ పిట్ సెక్రటరీ సంగం శ్రీనివాస్, కేటీకే-ఓసీ-3 ప్రాజెక్టు పిట్ సెక్రటరీ గాజర్ల హరికృష్ణ, కేటీకే-5 ఇంక్లైన్ అసిస్టెంట్ పిట్ సెక్రటరీ బండి వెంకటేష్, కేటీకే-ఓసీ-2 అసిస్టెంట్ పిట్ సెక్రటరీ రాజ్ కిరణ్, కేటీకే-8 ఇంక్లైన్ అసిస్టెంట్ పిట్ సెక్రటరీ మాతంగి రమేష్ పాల్గొన్నారు. ఐఎన్టీయూసీ నాయకులు సజ్జనపు స్వామి, మధిర కొమురయ్య, బండ బాపు, చెరలు, బొజ్జ కిష్టయ్య, ఈగ శ్రీనివాస్, నక్క విజయ్, గాజుల మల్లయ్య, అజ్మీర తిరుపతి, రాములు, రవి, డి. కృష్ణ, బండి శ్రీనివాస్, రఘునాథ్ రెడ్డి, శరత్ తదితరులతో పాటు వివిధ కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.