సీయోని ప్రార్థనా మందిరంలో నేత్ర, అవయవ, పార్థివదేహ దానంపై అవగాహన.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్-భూపాలపల్లి, ఆగస్టు 9: నేత్రదానం, అవయవదానం, పార్థివదేహ దానంపై ప్రజల్లో అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందని ఐ ఆర్గన్ అండ్ బాడీ డొనేషన్ అవేర్‌నెస్ అసోసియేషన్ జయశంకర్-భూపాలపల్లి జిల్లా చైర్మన్ దేవునూరి చంద్రమౌళి అన్నారు. శాంతినగర్–జంగేడు మార్గంలోని సీయోని ప్రార్థనా మందిరంలో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవునూరి చంద్రమౌళి మాట్లాడుతూ.. నేత్రదానం ద్వారా మరొకరి జీవితంలో వెలుగును నింపవచ్చని, అవయవదానం ద్వారా ప్రాణాపాయంలో ఉన్న వారికి కొత్త జీవితం అందించే అవకాశం ఉంటుందని తెలిపారు. పార్థివదేహ దానం వైద్య విద్యార్థుల అధ్యయనం, వైద్య పరిశోధనలకు ఎంతో విలువైన సహకారం అందిస్తుందని వివరించారు. మరణానంతరం కూడా తమ అవయవాల ద్వారా ఇతరులకు ఉపయోగపడటం గొప్ప మానవతా సేవ అని పేర్కొన్నారు. నేత్ర, అవయవ, పార్థివదేహ దానంపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి, శాస్త్రీయ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. దానానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ప్రజలకు చేరవేయడం ద్వారా మరింత మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చేలా ప్రోత్సహించవచ్చని చెప్పారు. గ్రామాలు, చర్చిలు, విద్యాసంస్థలు, కార్యాలయాలు, ప్రజా సమూహాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. అవగాహన కార్యక్రమానికి అవకాశం కల్పించిన సీయోని ప్రార్థనా మందిరం పాస్టర్ మనోహర్, చర్చి నిర్వాహకులు, సభ్యులకు దేవునూరి చంద్రమౌళి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సమాజంలో మానవతా విలువలను పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ దానంపై అవగాహన పెంచుకుని, తమ వంతు బాధ్యతగా ఇతరులకు కూడా ఈ సందేశాన్ని చేరవేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చర్చి పాస్టర్ మనోహర్, అసోసియేషన్ చైర్మన్ దేవునూరి చంద్రమౌళి, వర్కింగ్ ప్రెసిడెంట్ బందెల భూమయ్య, జేసీ డాక్టర్ రాజు ఆరుముల్లా తదితరులు పాల్గొన్నారు.